4 రోజుల్లో 30 వేల భూ సమస్యలకు ధరణి పరిష్కారం

4 రోజుల్లో 30 వేల భూ సమస్యలకు ధరణి పరిష్కారం
  • ధరణి స్పెషల్​ డ్రైవ్​తో కొలిక్కి వస్తున్న భూసమస్యలు
  • ఫోన్లు చేసి వివరాలు తీసుకుంటున్న అధికారులు
  • రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షల దరఖాస్తులు
  • కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్​ స్థాయిలో అప్లికేషన్లకు ఆమోదం

హైదరాబాద్, వెలుగు: ధరణి స్పెషల్​ డ్రైవ్​తో భూసమస్యలు కొలిక్కి వస్తున్నాయి. మండలాల్లో బృందాలుగా ఏర్పడిన అధికారులు.. ధరణి పెండింగ్​ అప్లికేషన్ల వివరాలు తీసుకుని రిపోర్టులు రెడీ చేసి కలెక్టర్​ కార్యాలయాలకు పంపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ధరణిలో దాదాపు రెండున్నర లక్షల అప్లికేషన్లు పెండింగ్​లో ఉన్నాయి. ధరణిలో పెండింగ్​లో ఉన్న భూసమస్యల అప్లికేషన్ల పరిష్కారానికి ప్రభుత్వం ఈ నెల 1 నుంచి స్పెషల్ డ్రైవ్  చేపట్టింది. 

హైదరాబాద్, వెలుగు: ధరణి స్పెషల్​ డ్రైవ్​తో భూసమస్యలు ఒక్కొక్కటి కొలిక్కి వస్తున్నాయి. మండలాల్లో బృందాలుగా ఏర్పడిన అధికారులు.. ధరణి పెండింగ్​ అప్లికేషన్ల వివరాలు తీసుకుని రిపోర్టులు రెడీ చేసి కలెక్టర్​ కార్యాలయాలకు పంపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ధరణిలో దాదాపు రెండున్నర లక్షల అప్లికేషన్లు పెండింగ్​లో ఉన్నాయి. ధరణిలో పెండింగ్​లో ఉన్న భూసమస్యల అప్లికేషన్ల పరిష్కారానికి ప్రభుత్వం ఈనెల 1 నుంచి స్పెషల్ డ్రైవ్  చేపట్టింది. 

నాలుగో తేదీ నాటికి దాదాపు 30 వేల పెండింగ్​ అప్లికేషన్లను క్లియర్​ చేశామని సీసీఎల్ఏ వర్గాలు వెల్లడించాయి. ఇంకో నాలుగు రోజుల్లో పూర్తి స్థాయిలో అప్లికేషన్లకు సంబంధించి రిపోర్టులన్నీ రెడీ చేసి కలెక్టర్లకు పంపేలా ముందుకు వెళ్తున్నారు. తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్ స్పెక్టర్  నేతృత్వంలోని కమిటీలు పనిచేస్తున్నాయి.  ప్రతి దరఖాస్తును పరిశీలించి అందులో ఉన్న ఫోన్​ నంబర్లకు కాల్  చేసి వివరాలు అడిగి తీసుకుంటున్నారు. 

అయితే, గ్రామ స్థాయిలో భూవివాద పరిష్కారాల్లో చురుగ్గా ఉండే వీఆర్ఓ, వీఆర్‌‌ఏ వ్యవస్థ రద్దు కావడంతో క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన మండల ప్రత్యేక బృందాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత బీఆర్ఎస్  ప్రభుత్వం వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థను రద్దుచేసిన విషయం తెలిసిందే. మరోవైపు కొన్ని తహసీల్దార్‌‌  కార్యాలయాలకు ఫైల్స్  పంపిణీలో జాప్యం నెలకొనగా...రెవెన్యూ డివిజన్‌‌  కార్యాలయాల్లో ఇటీవల కొంత మంది అధికారులు బదిలీ కావడంతో ఇక్కడా కొంత అయోమయం నెలకొంది.

 ఈనెల 9 వరకు ఈ స్పెషల్​ డ్రైవ్​ కొనసాగనుంది. సోమవారం ధరణి కమిటీ సభ్యులు కోదండరెడ్డి, భూమి సునీల్​ క్షేత్రస్థాయిలో స్పెషల్​ డ్రైవ్​ను పర్యవేక్షించారు. యాచారం, ఇబ్రహీంపట్నం తహసీల్దార్​ ఆఫీసులకు వెళ్లి అప్లికేషన్ల పరిష్కారం ఎలా చేస్తున్నారో రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు. 

రిజెక్ట్​ చేస్తే తగిన కారణాలతో వెల్లడి

గత ప్రభుత్వంలో ధరణిలో ఏదైనా అప్లికేషన్​ను తిరస్కరిస్తే తగిన కారణాలు వెల్లడించే సిస్టం లేదు. అయితే, స్పెషల్​ డ్రైవ్​లో ఏదైనా అప్లికేషన్​ను తిరస్కరిస్తే కారణాలు వెల్లడించనున్నారు. ఇప్పటికే సీసీఎల్ఏ ఆదేశాల మేరకు టీఎం 4, 10, 14, 32 మాడ్యుల్స్‌‌లో ఉన్న సక్సెషన్‌‌, జీపీఏ/ఎస్‌‌పీఏ, భూ రికార్డుల అంశాలలో ఫిర్యాదులు, ఖాతా మెర్జింగ్‌‌  సంబంధిత దరఖాస్తులను పరిశీలించి చర్యలు తీసుకుంటున్నారు. 

దరఖాస్తు ఎందుకు రిజెక్ట్  అవుతుందో కూడా చెబుతున్నారు. టీఎం 7, 16, 20, 22, 33 మాడ్యుల్స్‌‌లో ఉన్న నాలా (పాస్‌‌ బుక్‌‌  లేకుండా), భూసేకరణ ఫిర్యాదులు, ఎన్‌‌ఆర్‌‌ఐ పోర్టల్‌‌, సంస్థల పట్టా పాస్‌‌ పుస్తకం, కోర్టు కేసులు, మిస్సింగ్‌‌ సర్వే నంబర్‌‌, విస్తీర్ణ సవరణ (5 లక్షల విలువ వరకు) తదితర అప్లికేషన్లపై తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి సిఫార్సులతో ఆర్డీఓలకు పంపుతున్నారు. 

టీఎం 3, 4, 15, 23, 24, 31, 33 మాడ్యూల్స్‌‌లో ఉన్న మ్యుటేషన్‌‌, అసైన్డ్  భూముల సక్సెషన్‌‌ (పీపీబీ లేకుండా), ప్రొహిబిటెడ్‌‌  జాబితా ఆస్తుల సమస్యలు, పట్టా పాస్‌‌ పుస్తకం, సెమీ అర్బన్‌‌  ల్యాండ్‌‌ పట్టా పాస్‌‌ పుస్తకం, నాలా కన్వర్జేషన్‌‌, పట్టా పాస్‌‌ పుస్తకంలో సవరణలు తదితర దరఖాస్తులపై కలెక్టర్‌‌  నిర్ణయం తీసుకుని సీసీఎల్ఏకు పంపుతారు. అయితే, కలెక్టర్​ ఆమోదించినా సీసీఎల్ఏలో అప్లికేషన్లకు ఆమోదం లభించడం లేదు.

 గత నాలుగు రోజుల స్పెషల్​ డ్రైవ్​లో సీసీఎల్ఏలో ఒక్క అప్లికేషన్​కు కూడా అప్రూవల్​ ఇవ్వలేదని తెలిసింది. కిందిస్థాయిలో ఎమ్మార్వో, ఆర్డీఓ, కలెక్టర్ ​ అప్రూవల్​ ఇచ్చి పంపిన దరఖాస్తులకు సీసీఎల్ఏలో ఒక్క క్లిక్​తో అప్రూవల్​ ఇవ్వొచ్చు. అయినప్పటికీ వాటిని పెండింగ్​లోనే పెడుతున్నారు. ఇలా ఇప్పటికే రెండున్నర వేల అప్లికేషన్లు సీసీఎల్ఏ లాగిన్లో మూలుగుతున్నట్లు తెలిసింది.