సమస్యల పరిష్కారం కోసం.. ఎన్నికల బహిష్కరణ

సమస్యల పరిష్కారం కోసం.. ఎన్నికల బహిష్కరణ

వెలుగు, నెట్​వర్క్: ‘ఎన్నికలు వచ్చినప్పుడే లీడర్లు, ఆఫీసర్లు వస్తున్నరు.. ఓట్లు వేయించుకొని పత్తా లేకుండా పోతున్నరు..  మా ఊళ్లె ఎక్కడి  సమస్యలు అక్కడే ఉంటున్నయి.. ఈ సారి మా ఊరి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తేనే ఓట్లేస్తాం..’ అని పలు గ్రామాల ప్రజలు భీష్మించుకున్నారు. ​టైం దాటిపోతున్నా పోలింగ్​ బూత్​ వైపు కదల్లేదు. పలుచోట్ల ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు బుజ్జగించి, హామీలిచ్చి ఓట్లేసేందుకు తీసుకెళ్లగా, ములుగు జిల్లాలోని ఎలిశెట్టిపల్లి వైపు ఎవరూ రాకపోవడంతో 400 మంది ఓట్లు వేయలేదు. 

ఓట్లు వేయకుండానే వెనుదిరిగిన్రు.. 

ములుగు నియోజకవర్గ పరిధిలోని ఏటూరు నాగారం మండలం అల్లం వారి ఘనపురం పంచాయతీ పరిధిలోని ఎలిశెట్టిపల్లి గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. ‘మా   ఊరికి సరైన రోడ్డు లేదు. స్కూల్​ బిల్డింగ్ లేదు, ​జంపన్న వాగు పై బ్రిడ్జి లేక వర్షాకాలంలో రాకపోకలు బందవుతున్నయ్​.  అంగన్వాడీ సెంటర్ కు టీచర్ లేదు. వైద్యం కోసం సబ్ ​సెంటర్ లేదు. 

సమస్యలు పరిష్కరించాలని వందలసార్లు అధికారులను, ప్రజాప్రతినిధులను కోరినా  పట్టించుకోలే. ప్రతిసారీ ఓట్లు వేయించుకొని పోతున్నారు. ఈసారి సమస్యల పరిష్కారానికి  హామీ ఇచ్చిన వారికే వేస్తాం’ అంటూ 400 మంది గ్రామంలో బైఠాయించారు. నాలుగు గంటల వరకు వెయిట్ చేసినా ఎవరూ రాకపోవడంతో ఎవరి ఇండ్లకు వారు వెళ్లిపోయారు.

ఖమ్మం జిల్లాలో ఐదు చోట్ల 

ఖమ్మం జిల్లాలో ఐదు చోట్ల ఓటర్లు పోలింగ్ బహిష్కరించేందుకు సిద్ధమయ్యారు. పదేండ్ల కింద చత్తీస్​గఢ్​ నుంచి వలస వచ్చిన గిరిజనులు ఏస్కూరు మండలం కొత్తమేడేపల్లిలో ఉంటున్నారు. తాగునీరు, రోడ్లు, మౌలిక వసతులు కల్పించలేదని 160 మంది ఓట్లు వేయడానికి వెళ్లలేదు. దీంతో తహసీల్దార్​శేషగిరిరావు వచ్చి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని హామీనివ్వడంతో వెళ్లి ఓట్లేశారు. ఇదే మండలం రాజులపాలెంలోనూ పొలాలకు వెళ్లే దారి సమస్య పరిష్కరించాలంటూ 300 మంది ఎన్నికలను బహిష్కరించారు. దీంతో త్వరలోనే సమస్ పరిష్కరిస్తామని తహసీల్దార్ శేషగిరిరావు హామీ ఇచ్చి పోలింగ్ లో పాల్గొనేలా  చేశారు. దీంతో గంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. సత్తుపల్లి మండలం సత్యంపేటలో అభివృద్ధి పనులు చేయలేదంటూ ఓటెయ్యకుండా 450  మంది నిరసన తెలిపారు. ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు వచ్చి మాట్లాడారు. సత్తుపల్లి కాంగ్రెస్ అభ్యర్థి మట్టా రాగమయి భర్త దయానంద్ కూడా వెళ్లి గ్రామస్తులకు సర్ది చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని హామీనివ్వడంతో ఓట్లు వేశారు. 

వైరా నియోజకవర్గం జులూరుపాడు మండల పరిధిలోని నల్లబండ బోడు  గ్రామస్తులు తమ గ్రామానికి రోడ్డు వేయడంలేదని ఎన్నికలను బహిష్కరించారు. వైరా ఏసీపీ సాంబరాజు, తహసీల్దార్ శారద వచ్చి వారికి నచ్చజెప్పారు. ఉన్నతాధికారులతో మాట్లాడతామని హామీ ఇవ్వడంతో రెండు గంటల తర్వాత ఓట్లు వేసేందుకు వెళ్లారు. అర్హత ఉన్నా  పోడుపట్టాలు ఇవ్వలేదని, డబుల్​బెడ్​రూం ఇండ్లు కేటాయించలేదని భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం సత్యనారాయణపురం గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు.  210 ఓటర్లుండగా 2 గంటల వరకు ఓట్లు వేయకుండా ఇండ్లలోనే ఉన్నారు. పలు పార్టీల రాజకీయ నాయకులు, గ్రామపెద్దలు నచ్చజెప్పడంతో పోలింగ్ కేంద్రానికి వెళ్లారు.  

కామారెడ్డి, ఆసిఫాబాద్​ జిల్లాల్లో...

నిజామాబాద్​ జిల్లా బోధన్ లోని గోసంబస్తీ ఓటర్లు  కాలనీలో రోడ్లు సరిగ్గా లేవని, మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్నామని ఓట్లు వేసేది లేదని నిర్ణయించుకున్నారు. ఓటు వెయ్యాలంటూ ఎవరూ తమ వద్దకు రావద్దన్నారు. దీంతో బీఆర్ఎస్ లీడర్లు వెళ్లి సమదాయించాక ఓటు వేశారు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కొత్త వరిపేట, వరిపేట గ్రామాన్ని జీపీగా మార్చాలంటూ వరిపేట గ్రామస్తులు ఓట్లేయలేదు. అధికారులు నచ్చజెప్పడంతో చివరకు ఓట్లు వేశారు.

ఆదిలాబాద్​ జిల్లా కొత్తపల్లిలో.. 

ఆదిలాబాద్​ జిల్లా బజార్​హత్నూర్ మండలంలోని కొత్తపల్లికి చెందిన 180 మంది ఎన్నికలను బహిష్కరించి పోలింగ్ బూత్ ముందు ధర్నా చేశారు. గ్రామ పటేల్ మాట్లాడుతూ రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నామని, చిన్న వర్షం కురిస్తే వాగు పొంగి రాకపోకలు ఆగిపోతున్నాయన్నారు.  హామీ ఇవ్వడం తప్ప ఎవరూ ఏమీ చేయడం లేదని, అందుకే ఎన్నికలను బహిష్కరిస్తున్నామన్నారు.

తహసీల్దార్ శంకర్, ఎస్సై నరేశ్ వచ్చి ఓటర్లను సముదాయించినా వినలేదు. చివరకు కలెక్టర్ రాహుల్​రాజ్ తో మాట్లాడించారు. ఐదు రోజుల్లో కొత్తపెల్లికి వచ్చి సమస్యల పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం, తహసీల్దార్ రాసి ఇవ్వడంతో గ్రామస్తులు ఓటువేశారు.