సౌలతుల్లేక ఇండ్లు ఆపిన్రు.. ఎంపిక జరిగినా పంపిణీ చెయ్యట్లే..

సౌలతుల్లేక ఇండ్లు ఆపిన్రు.. ఎంపిక జరిగినా పంపిణీ చెయ్యట్లే..
  • తాగునీరు, కరెంట్, రోడ్లు లేక పెండింగ్​పెట్టిన ఎమ్మెల్యేలు
  • సర్కార్​ పై నమ్మకం లేక ఆసక్తి చూపని కాంట్రాక్టర్లు
  • ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ కు ఫండ్స్​ సరిపోవని వెనకడుగు

నల్గొండ, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లాలో డబుల్​బెడ్​ రూమ్​ ఇండ్లు కొన్ని పూర్తి అయినా ఇంకా ఇవ్వట్లేదు. లబ్ధిదారుల ఎంపిక జరిగినా అక్కడ సౌలత్​లు సరిగా లేవని ఇండ్ల పంపిణీ ఆపేశారు. ఎన్నికల వరకైనా ఇండ్లు ఇస్తారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటి నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్​ ఏమూలకు చాలడం లేదు. దీంతో కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదు.  

ఎన్నికల కోసమే లబ్ధిదారుల ఎంపిక!

డబుల్​బెడ్​రూమ్ ఇండ్ల వ్యవహారంపై ప్రతిపక్ష పార్టీలు అదేపనిగా విమర్శలు చేస్తుండటంతో ఎమ్మెల్యేలు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం తమ మెడకు చుట్టుకుంటదన్న భయంతో లబ్ధిదారులను ఎంపిక చేసి జాగ్రత్త పడ్డారు. ప్రజల నుంచి భారీగా అప్లికేషన్స్​రావడంతో వాటిన్నింటినీ వడపోసి ఫైనల్​ లిస్ట్​ ప్రిపేర్​ చేశారు. కానీ ఇండ్లు ఇద్దామంటే మాత్రం సంకోచిస్తున్నారు. గ్రౌండింగ్​ కంప్లీట్​అయిన ఇండ్లను కూడా లబ్ధిదారులకు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఇండ్ల వద్ద డ్రైనేజీ, తాగునీరు, రోడ్లు, పవర్​ సప్లై ఇవ్వలేదు. మొత్తం వర్క్స్​ కంప్లీట్​ చేయకుండా గృహప్రవేశాలు చేయిస్తే లబ్ధిదారుల నుంచి వ్యతిరేకత వస్తుందని పంపిణీ చేయకుండా ఆపేశారు. 

సొంత నిధులు ఇవ్వని ఎమ్మెల్యేలు

డబుల్​ బెడ్​ ఇండ్లలో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎంపీల ఫండ్స్ ఇవ్వాలని చెప్పింది. ఏసీడీపీ ఫండ్స్​, పట్టణ, పల్లె ప్రగతి కింద ప్రభుత్వం ఇచ్చే నిధులు కేటాయించాని ఆర్డర్స్ ఇచ్చింది. కానీ నల్గొండ జిల్లాలో జడ్పీ చైర్మన్ బండా నరేందర్​ రెడ్డి తప్ప ఎవరూ నయా పైసా ఇవ్వలేదు. చైర్మన్​ ప్రాతినిధ్యం వహించే నార్కట్​పల్లి మండలంలోని ఆయన సొంత గ్రామం నక్కలపల్లిలో నిర్మించిన ఇండ్లకు జడ్పీ ఫండ్స్ నుంచి రోడ్లు వేయించారు. 

కాంట్రాక్టర్లను బతిమాలుతున్న ఆఫీసర్లు 

ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరూ ముందుకు రాకపోవడంతో చివరకు ప్రభుత్వమే ఒక్కో ఇంటికి రూరల్​లో రూ.1.25 లక్షలు, అర్బన్​లో రూ.1.75ల క్షల చొప్పున మౌలిక వసతుల కల్పన ఫండ్స్ కేటాయిస్తూ ఆర్డర్స్ ఇచ్చింది. కానీ ఫండ్స్​ మాత్రం రిలీజ్​చేయలేదు. పనులు జరిగాకే ఫండ్స్ రిలీజ్​ చేస్తామని కండీషన్​ పెట్టింది. విద్యుత్​ సప్లై పనులకు మాత్రం ముందుకుగానే ఫండ్స్​రిలీజ్​ చేసింది. విద్యుత్​ అధికారులు పైసలు ఇస్తే తప్పపనులు చేయబోమని కండీషన్​ పెట్టడంతో వాళ్ల ప్రతిపాదన మేరకు నల్గొండ జిల్లాకు రూ.2.70 కోట్లు కేటాయించింది. 

ఇక మిగతా పనులకు మాత్రం కంప్లీట్​ అయిన తర్వాతే ఫండ్స్​ ఇస్తామని చెప్పడంతో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ డిపార్ట్​మెంట్లు టెండర్లు అయితే పిలిచారు కానీ కాంట్రాక్టర్ల నుంచి స్పందన రావడం లేదు. ప్రభుత్వం కేటా యించిన ఫండ్స్​సరిపోవని, బడ్జెట్​ పెంచాలని కాంట్రాక్టర్లు డిమాండ్​ చేస్తున్నారు. దీంతో మరోగత్యంతరం లేక ఇండ్లు కట్టిన కాంట్రాక్టర్లనే అధికారులు బతిమిలాడుకోవాల్సి వస్తోంది. కేటాయించిన బడ్జెట్​ మేరకు అయినకాడికి పనులు చేయాలని కాంట్రాక్టర్లను కోరుతున్నారు. 

శాంక్షన్​ చేసింది 17 వేలు.. ఇచ్చింది 944 ఇండ్లు 

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాలకు ప్రభుత్వం 17,199 ఇండ్లను శాంక్షన్​ చేసింది.కాగా దీంట్లో ఇప్పటి వరకు గ్రౌండింగ్​ చేసింది 8,436 మాత్రమే. వీటిల్లో 6,391 ఇండ్లు నిర్మించారు. ఇన్నేళ్లలో కోదాడ, సూర్యాపేట, దేవరకొండ, నకిరేకల్​ నియోజకవర్గాల్లోనే 944 ఇండ్లను మాత్రమే పంపిణీ చేశారు. నల్గొండ జిల్లాలో మునుగోడు, నాగార్జున సాగర్​ నియోజకవర్గాల్లో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదు. యాదాద్రి జిల్లా పరిధిలోని మునుగోడు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే నారాయాణ్​పూర్​ మండలంలో మాత్రమే 136 ఇండ్లు కంప్లీట్​ చేయగలిగారు. 17 వేల ఇండ్లకు గాను టెండర్లు 15,557 ఇండ్లకు పిలిస్తే 9, 427 ఇండ్లకు మాత్రమే కాంట్రాక్ట ర్లు ముందుకు వచ్చారు. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో ఇండ్ల నిర్మాణం జర గాలంటే లబ్ధిదారులు ఇంకా ఎన్నేళ్లు ఎదురుచూడాలో అర్ధంకానీ పరిస్థితి నెలకొంది.