
- ఆ ఏరియాలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మిస్తలేరు
- ట్రాఫిక్, బల్దియా అధికారుల మధ్య లేని కో ఆర్డినేషన్
- రోడ్డు దాటేందుకు జనాలకు తప్పని ఇబ్బందులు
హైదరాబాద్, వెలుగు : సిటీలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు (ఎఫ్ ఓబీలు) లేక రోడ్డు దాటాలంటే జనాలకు కష్టాలు తప్పడంలేదు. కొన్నిచోట్ల ట్రాఫిక్ నియంత్రణ పేరిట రోడ్లను క్లోజ్ చేశారు. ఆయా ప్రాంతాల్లో రోడ్లను దాటేందుకు ఎలాంటి ప్రత్యామ్నయాలు చూపలేదు. సరైన ఏర్పాట్లు చేయలేదు. దీంతో వాకర్స్ కిలోమీటరు వరకు నడవాల్సి వస్తుంది. క్లోజ్ చేసిన రోడ్లపై డివైడర్ల ఎత్తును పెంచుతున్న పరిస్థితి ఉంది.
చిన్న వాటిస్థానంలో కొత్తగా మూడు ఫీట్ల ఎత్తు నిర్మిస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల పనులు పూర్తయ్యాయి. ఇంకొన్ని చోట్ల నడుస్తున్నాయి. ఇలా మెయిన్ రోడ్లపై వాకర్స్, వాహనదారులు ఎక్కడపడితే అక్కడ రోడ్లు దాటకుండా బల్దియా డివైడర్లను ఏర్పాటు చేస్తుంది. పెద్దగా డివైడర్లను నిర్మించే చోట రోడ్డు దాటేందుకు దారి దూరంగా ఉంటుంది. అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జి(ఎఫ్ఓబీ)లను కూడా ఏర్పాటు చేయడం లేదు.
దీంతో వాకర్స్ రోడ్డు దాటేందుకు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. స్కూళ్లకు వెళ్లే స్టూడెంట్స్, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. డివైడర్లను పెంచే రూట్లలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మిస్తే వాకర్స్ కు ఇబ్బందులు తప్పుతాయి. గ్రేటర్‌లో ఎఫ్‌ఓబీలు పూర్తిగా అందుబాటులోకి రావడం లేదు. నిర్మాణంలో ట్రాఫిక్ పోలీసులు, బల్దియా అధికారుల మధ్య కోఆర్డినేషన్ ఉండడంలేదు.
వందచోట్ల నిర్మిస్తామని..
సిటీలో 100 ఎఫ్ఓబీలను నిర్మిస్తామని బల్దియా చెప్పగా.. ఫస్ట్ ఫేజ్ లో 52 ప్రాంతాల్లోనే నిర్మించేందుకు అధికారులు ప్లాన్ చేశారు. ఇందులో 37 ఎఫ్‌ఓబీలను రెండేళ్ల కిందటే అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. అందులోనూ 22 ఎఫ్ఓబీల నిర్మాణాలను చేపట్టారు. వీటిలో సగమే అందుబాటులోకి వచ్చాయి. మిగతా వాటి పనులు స్లోగా నడుస్తుండగా ఇప్పట్లో పూర్తయ్యేలా లేదు. ఫుట్ఓవర్ బ్రిడ్జిలను అందుబాటులోకి తీసుకురాకపోగా, జనం రోడ్లు దాటకుండా ఉండేందుకు డివైడర్ల ఎత్తు పెంచుతుండగా.. రద్దీగా ఏరియాల్లో జనాలకు కష్టాలు తప్పడంలేదు.
మెహిదీపట్నం నుంచి మాసబ్ ట్యాంక్ వచ్చే వచ్చే రూట్ లో ఇటీవల డివైడర్ ఎత్తును పెంచారు. అక్కడ ఫుట్ఓవర్ బ్రిడ్జి అవసరమైనా అధికారులు నిర్మించడంలేదు. సరోజిని దేవి ఆస్పత్రి వద్ద నిర్మిస్తే డైలీ నాలుగైదు వేల మందికి ఈజీ అవుతుంది. పంజాగుట్టలోని నిమ్స్హాస్పిటల్ వద్ద కూడా నిర్మించాల్సి ఉండగా పట్టించుకోవడంలేదు. లంగర్ హౌజ్‌లోనూ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించకుండానే డివైడర్ ఎత్తును పెంచుతున్నారు. తాజాగా అసెంబ్లీ వద్ద రోడ్డు క్లోజ్ చేశారు. అక్కడ జనాలు రోడ్డు దాటేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇలా అనేక ప్రాంతాల్లో ఎఫ్ఓబీలు నిర్మించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు.
ఉన్నవి పూర్తి చేయట్లే..కొత్తగా గుర్తించట్లే..
ఎఫ్ఓబీ నిర్మించేందుకు ఇప్పటికే గుర్తించిన ఏరియాల్లో నిర్మాణాలు లేట్ చేస్తున్నారు. కొత్తగా అవసరమైన ప్రాంతాలను గుర్తించడం లేదు. దీంతో రోడ్డు దాటేందుకు జనాలు ప్రమాదాల బారిన పడుతున్న పరిస్థితి ఉంది. రోడ్లు దాటేటప్పుడు, రోడ్డు పక్కన నడుస్తున్నప్పుడు యాక్సిడెంట్లు ఎక్కువగా అవుతున్నాయి. సిటీలోని పలు ప్రాంతాల్లోని ఫుట్ పాత్‌లు ఆక్రమణల పాలవగా రోడ్డుపైనే నడవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని దుస్థితి ఉంది. చాలా చోట్ల జిబ్రా క్రాసింగ్‌లు లేవు. ఇది వరకు ఉన్న ఫుట్ ఓవర్‌బ్రిడ్జిలు మెట్రో రైల్నిర్మాణంతో తీసేశారు. కొత్తగా నిర్మాణాలు లేట్ అవుతుండగా జనానికి ఇబ్బందులు తప్పడం లేదు. 3 పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఏటా150 మందికి పైగా వాకర్స్ మరణిస్తున్నారు. అయినా బల్దియా అధికారులు పట్టించుకోవడం లేదు.