యథేచ్ఛగా అమ్మకాలు.. పటాకులపై నియంత్రణ కరువు..!

యథేచ్ఛగా అమ్మకాలు.. పటాకులపై నియంత్రణ కరువు..!

యథేచ్ఛగా అమ్మకాలు.. పటాకులపై నియంత్రణ కరువు..!
పట్టణాల్లో నివాసాల మధ్యనే నిల్వ

ఖమ్మం, వెలుగు : కారేపల్లి మండలం చీమలపాడులో పటాకులు కాల్చడంతో గ్యాస్ ​సిలిండర్ పేలుడు ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనికి కారణమైన పటాకులపైనే ఇప్పుడు అందరి దృష్టి పడింది. దీపావళి పండుగకు వివిధ డిపార్ట్ మెంట్ల అనుమతితో, ప్రత్యేక ప్రాంతాల్లో మాత్రమే స్టాళ్లు ఏర్పాటు చేసి పటాకులు అమ్ముతుంటారు. పండుగ ముగిశాక కూడా ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ జనాలకు దొరుకుతున్నాయి. ఏటా దీపావళికి ఖమ్మం నగరంలో కేవలం ఎస్ఆర్అండ్​బీజీఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్ లో మాత్రమే పోలీసుల భద్రత, రెవెన్యూ శాఖ అనుమతితో మున్సిపల్ సిబ్బంది పర్యవేక్షణ, ఫైర్, ఇతర శాఖల సమన్వయంతో పటాకుల షాపులను ఏర్పాటు చేస్తారు.

ఆయా నియోజకవర్గాల్లో కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తారు. పండుగ సమయంలో మూడు రోజులపాటు అమ్మకాల కోసం పర్మిషన్లు, ఫైర్​సేఫ్టీ అంటూ హడావుడి చేసే ఆఫీసర్లు, ఆ తర్వాత మాత్రం మిగిలిన పటాకులపై పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మిగిలిన స్టాక్​ను ఇండ్ల మధ్యలోనే నిల్వ చేసి అమ్మకాలు జరుపుతున్నా, లైట్ తీసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. 

అన్నింటికీ ఆనవాయితీగా మారింది..

ప్రతి శుభ, అశుభ కార్యాలకు పటాకులు పేల్చడం ఆనవాయితీగా మారింది. పెళ్లిళ్లు, బరాత్ ల సమయంలోనే కాదు, శవయాత్రల్లోనూ పటాకులు పేల్చుతున్నారు. ఇక రాజకీయ పార్టీల మీటింగ్ లకు, ముఖ్య నేతలకు స్వాగతం పలికే సందర్భాల్లో, ఎన్నికల్లో అభ్యర్థులు గెలిచినప్పుడు, ఇతర రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చినప్పుడు, సినిమాలకు అవార్డులు వచ్చిన సమయంలో, ర్యాలీల్లో.., ఇలా ప్రతి అకేషన్​కు పటాకులు పేల్చడం కామన్​అయ్యింది. నగరంలోనే కాదు, సత్తుపల్లి, వైరా, మధిరలో కూడా ఎప్పుడంటే అప్పుడు పటాకులు  దొరుకుతున్నాయి.

జిల్లా ఫైర్​డిపార్ట్ మెంట్ సిబ్బంది చెబుతున్నట్లు మధిరలో రెండు షాపులకు మాత్రమే లైసెన్స్ ఉంది. మిగిలిన ఎక్కడా పటాకులు అమ్మకూడదని అధికారులు చెబుతున్నారు. కారేపల్లిలో ప్రమాదం జరిగిన చీమలపాడులో మాత్రం పటాకులను ఇల్లందు నుంచి తెప్పించినట్టు సమాచారం. ముందురోజే స్థానిక బీఆర్ఎస్​నేతలు పటాకులు తెప్పించి, ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములు నాయక్​ వచ్చిన సందర్భంగా వాటిని పేల్చడంతో ప్రమాదం జరిగింది.

అమ్ముడుపోని పటాకులపై నిఘా ఏదీ?

దీపావళి సమయంలో తెచ్చిన పటాకులు అమ్ముడుపోని సరుకును కొందరు రెగ్యులర్ గా విక్రయించే వ్యాపారులు బల్క్ లో కొంటారని, వాళ్లే వేర్వేరు  ప్రాంతాల్లో సీక్రెట్ గా అమ్ముతున్నట్టు తెలుస్తోంది. లైసెన్స్​ఉన్న ఇద్దరు వ్యాపారులు తప్పించి, పదుల సంఖ్యలో అక్రమంగా పటాకుల వ్యాపారం చేస్తున్నా ఆఫీసర్లు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో ఇలాంటి ప్రమాదాలకు దారి తీస్తోంది. ఇండ్ల మధ్యలోనే నిల్వ చేసి అమ్ముతుండడంతో జరగరాని ప్రమాదం జరిగితే మాత్రం మరింత ప్రాణ నష్టం జరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికైనా ఆఫీసర్లు స్పందించి, నిఘా పెట్టి బాణాసంచా నిల్వచేసి, అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 

* ఖమ్మం నగరంలోని కమాన్​బజార్ నుంచి రైల్వే గేట్ దాటగానే గాంధీ చౌక్ కు వెళ్లే దారిలో ఉన్న ఓ షాపులో 24 గంటలూ పటాకులు ఉంటాయని తెలిసింది. చర్చి కంపౌండ్ సెంటర్ లోని పార్కు దగ్గర కూడా మరో వ్యక్తి ఇండ్ల మధ్యలోనే పటాకులు అమ్ముతున్నారు. కస్బా బజార్, త్రీ టౌన్ ప్రాంతంలో కూడా యథేచ్ఛగా విక్రయాలు సాగుతున్నాయి. 

* వైరాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో దీపావళి సందర్భంగా 8 షాపులకు మున్సిపల్ కమిషనర్ పర్మిషన్ ఇచ్చారు. వీటిల్లో మిగిలిన పటాకులను శుభ, అశుభ కార్యాలకు విక్రయిస్తున్నారు. మధు విద్యాలయం సమీపంలోని ఒకరు, కూరగాయల మార్కెట్ సమీపంలో ముగ్గురు, పాత బస్టాండ్ సెంటర్లో మరొక ఇద్దరు ఈ పటాకులు నిల్వ చేసి అమ్ముతున్నారు.

* సత్తుపల్లిలో ఒకే షాపునకు లైసెన్స్​ ఉంది. గతేడాది డిసెంబర్ 31తో ఆ గడువు కూడా ముగిసింది. నాలుగు నెలలు గడుస్తున్నా లైసెన్స్​రెన్యూవల్ చేయకుండానే పటాకులను అమ్ముతున్నారు. దీనిపై నిఘా కరువైంది.

రెండు షాపులకు మాత్రమే పర్మిషన్లు..

మధిరలోని రెండు షాపులకు మాత్రమే పటా కులు అమ్మేందుకు లైసెన్స్ ఉంది. దీపావళి సమయంలో మాత్రమే మిగిలిన చోట్ల అను మతులిస్తాం. మిగిలిన సమయాల్లో లైసెన్స్​షాపుల్లో మాత్రమే అమ్మకాలు సాగాలి. మధి రలో రెండు షాపులు కాకుండా, మిగిలిన ఎక్కడైనా పటాకులు అమ్మితే కంప్లైంట్ చేయవచ్చు. చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం.

– ప్రకాశ్, జిల్లా ఫైర్​ఆఫీసర్