
రోజూ ఆఫీసుల్లో రెండు,మూడుసార్లు టీ, కాఫీ తాగుతున్నారా? అయితే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటారా? ‘టోటల్ జాబ్స్’ అనే సంస్థ జరిపిన సర్వేలో కొన్ని షాకింగ్ నిజాలు తెలిశాయి. పనిచేసే ప్రాంతాల్లో 25 శాతం సిబ్బంది టాయిలెట్ కు వెళ్లి.. కనీసం చేయి కూడా వాష్ చేసుకోరని, దీనివల్ల ప్రమాదకరమైన బ్యాక్టీరియా వాళ్ల నుంచి ఇతరులకు వ్యాపిస్తుందని తెలిపింది. అలాగే, రాత్రి వేళల్లో శుభ్రం చేసి వదిలేసే సామాన్లకు కూడా బ్యాక్టీరియా అంటుకుని ఉంటుందని సర్వే వివరించింది.
ఇక ఆఫీస్ విషయానికి వస్తే.. ముందుగా చెప్పుకున్నట్లు ఆ 25 శాతం సిబ్బంది వల్ల ప్రమాదకర బ్యాక్టీరియా ఆఫీసు కప్పుల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. ఎందుకంటే.. ఆఫీసుల్లో ఒకే కప్పులో తాగే అవకాశం ఉండదు. నిత్యం ఉపయోగించే కప్పులే అటూ ఇటూ మారుతూ ఉంటాయి. అంటే ఈ రోజు మీరు తాగిన కప్పు రేపు ఇంకొకరు తాగొచ్చు. అలా బ్యాక్టీరియా ఒకరి నుంచి వేరొకరికి చేరుతుందన్నమాట.
అధ్యయనంలో తేలిన వివరాల ప్రకారం.. ఆఫీస్‌లో ఉండే డెస్కుల్లో టాయిలెట్ సీటు మీద ఉండే బ్యాక్టీరియా కంటే 400 రెట్లు అధిక బ్యాక్టీరియా ఉంటుంది. డెస్కుల వద్ద కూర్చొని ఆహారం తినే వ్యక్తులు ఈ భయానక బ్యాక్టీరియాకు గురయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు, డెస్క్‌లో ఉండే పెన్ లు, వస్తువులు, తమ గోళ్లను నోట్లో పెట్టుకునే సిబ్బందికి ఈ బ్యాక్టీరియా సులభంగా చేరుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది.