తండ్రి మందలించాడని కొడుకు ఆత్మహత్య

తండ్రి మందలించాడని కొడుకు ఆత్మహత్య

హసన్‌‌పర్తి, వెలుగు : పబ్జీ గేమ్ ఆడకుండా కాలేజీకి వెళ్లి చక్కగా చదువుకోవాలని తండ్రి మందలించడంతో కొడుకు మనస్తాపం చెంది పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హన్మకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెగడపల్లి గ్రామంలో శనివారం ఈ ఘటన జరిగింది. కేయూ సీఐ అబ్బయ్య కథనం ప్రకారం పెగడపల్లికి చెందిన మామిండ్ల రాకేశ్  ( 20 ) ఈనెల 18న కాలేజీకి వెళ్లకుండా పబ్జి గేమ్  ఆడుతున్నాడు. గమనించిన అతని తండ్రి రామస్వామి.. రాకేశ్ ను మందలించాడు.

దీంతో మనస్తాపం చెందిన రాకేశ్.. ఇంట్లో ఎవరూలేని సమయంలో గడ్డిమందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. విషయం తెలిసి కుటుంబ సభ్యులు అతడిని ఎంజీఎంకు తరలించారు. అక్కడ  చికిత్స పొందుతూ శనివారం రాత్రి రాకేశ్  మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు. తండ్రి రామస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ అబ్బయ్య తెలిపారు.