భార్య, అత్తను చంపింది అల్లుడే

భార్య, అత్తను చంపింది అల్లుడే

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బృందావన్​కాలనీలో ఈ నెల18వ తేదీన జరిగిన తల్లీకూతుళ్ల హత్య కేసు మిస్టరీ వీడింది. భార్య, అత్తను చంపింది అల్లుడే అని తేలింది. సుపారీ కిల్లర్స్ సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. రామగుండం సీపీ వి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా బోధన్​లోని శక్కర్​నగర్​కు చెందిన కాలేరు అరుణ్​కుమార్​కు మంచిర్యాలలోని బృందావన్​కాలనీకి చెందిన రవీనా ఆన్​లైన్​ పబ్జీ గేమ్​ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత ఇద్దరూ తల్లిదండ్రులను ఒప్పించి గతేడాది నవంబర్​6న పెళ్లి చేసుకున్నారు. బోధన్​లో కాపురం పెట్టారు. రవీనా గర్భవతి అయ్యాక అరుణ్​కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె పుట్టింటికి వచ్చి, మంచిర్యాల విమెన్​ పీఎస్​లో భర్తపై కంప్లైంట్ చేసింది. కౌన్సెలింగ్​ఇచ్చినా అరుణ్​లో మార్పు రాలేదని అతనితో వెళ్లేందుకు రవీనా నిరాకరించింది. అసలు తాను గర్భం దాల్చలేదని భర్తతో చెప్పింది. దీంతో అత్త విజయలక్ష్మినే అబార్షన్ చేయించి ఉంటుందని ఆమెను చంపుతానని అరుణ్ ​బెదిరించాడు.

యూట్యూబ్​లో సుపారి కిల్లర్

యూ ట్యూబ్​లో గన్ కల్చర్ ప్రోగ్రాం చూస్తుండగా కామెంట్ బాక్స్​లో కనిపించిన ‘సుపారి కిల్లర్​విజయవాడ’ అనే ఐడీ ఆధారంగా గుంటూరుకు చెందిన బిట్టుకు ఫోన్ ​చేసి తన భార్య, అత్తలను చంపాలని చెప్పాడు. బిట్టు రూ.10 లక్షలు అడగగా తన అత్తగారింట్లో ఎప్పుడూ 20 తులాల బంగారం, రూ.4 లక్షలు ఉంటాయని చంపాక అవి నువ్వే తీసుకోవచ్చని అరుణ్​ చెప్పాడు. బిట్టు ఆన్​లైన్​లో పరిచయమైన తెనాలికి చెందిన సుబ్బు అనే వ్యక్తితో కలిసి 17న మంచిర్యాలలోని బెల్లంపల్లి చౌరస్తా వద్ద ఉన్న ఓ లాడ్జిలో దిగాడు. అరుణ్, బిట్టు, సుబ్బు బైక్​పై18న తెల్లవారుజామున 3 గంటలకు బృందావన్​కాలనీకి  చేరుకున్నారు. 5 గంటలకు నల్లా నీళ్ల కోసం ఇంటి బయటికి వచ్చిన విజయలక్ష్మి మెడకు తాడు బిగించి చంపారు. తర్వాత ఇంట్లోకి వెళ్లి రవీనాను అంతమొందించారు. బీరువాలో ఏమీ దొరక్కపోవడంతో అరుణ్​కుమార్​ ల్యాప్​టాప్ ​తీసుకొని బైక్​పై ముగ్గురూ హైదరాబాద్ ​వెళ్లారు. సుపారి డబ్బులు ఈ నెల 28లోగా ఇవ్వాలని చెప్పి బిట్టు, సుబ్బు వెళ్లిపోగా, అరుణ్​ హైదరాబాద్​లోని తన బావ ఇంట్లో ఉండి, అక్కడి నుంచి బోధన్​కు వచ్చాడు. పోలీసులు తన కోసం గాలిస్తున్న విషయం తెలుసుకొని అరుణ్​ఇంటి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత మొదట అరుణ్​ను, అతడు చెప్పిన వివరాల ఆధారంగా మిగతా ఇద్దరిని అరెస్టు చేసినట్టు సీపీ వివరించారు.