వారే నిజమైన దేశభక్తులు

వారే నిజమైన దేశభక్తులు
  • కరోనాపై పోరాడుతున్న వారికి సోనియా ప్రశంసలు
  • డాక్టర్లు, నర్సులు, శానిటరీ వర్కర్లు, పోలీసులకు కృతజ్ఞతలు
  • వీడియో రిలీజ్​ చేసిన ఏఐసీసీ ప్రెసిడెంట్

న్యూఢిల్లీ: కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ముందున్న డాక్టర్లు, మెడికల్​ సిబ్బంది, శానిటరీ వర్కర్లు, పోలీసులు నిజమైన దేశభక్తులని ఏఐసీసీ ప్రెసిడెంట్​ సోనియాగాంధీ ప్రశంసలు కురిపించారు. వారంతా ఎలాంటి సొంత లాభం గురించి చూసుకోకుండా, సరైన సదుపాయాలు అందుబాటులో లేకపోయినా, ప్రాణాలకు తెగించి కరోనాతో పోరాడుతున్నారని కొనియాడారు. మంగళవారం దేశ ప్రజలనుద్దేశించి ఆమె ఒక వీడియోను విడుదల చేశారు. ప్రధాని మోడీ ప్రసంగానికి కొద్ది గంటల ముందు రిలీజ్​ అయిన ఈ వీడియోలో డాక్టర్లు, పోలీసులు, మెడికల్​ సిబ్బంది, శానిటరీ వర్కర్లకు సోనియా కృతజ్ఞతలు చెప్పారు. ‘‘కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా కలసికట్టుగా పోరాడటం కంటే దేశభక్తి ఏముంటుంది. సరైన ప్రొటెక్టివ్​ కిట్స్​ లేకపోయినా డాక్టర్లు కరోనా పేషెంట్లకు ట్రీట్​ మెంట్​ చేస్తున్నారు. పోలీసులు, జవాన్లు లాక్​డౌన్​ను సక్సెస్​ చేస్తున్నారు. సరైన సదుపాయాలు లేకపోయినా శానిటేషన్​ వర్కర్లు పరిసరాలను శుభ్రంగా ఉంచుతున్నారు. ప్రభుత్వ అధికారులు కూడా ఎంతో కష్టపడుతున్నారు. మనం వారికి సపోర్ట్​ అందించకపోతే.. వారు తమ పనులను సమర్థంగా చేయలేరు. కొన్ని చోట్ల డాక్టర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. మన సంస్కృతికి ఇది వ్యతిరేకం. ఈ యుద్ధంలో మనం వారికి సపోర్ట్​గా నిలవాలి” అని చెప్పారు. ప్రజలంతా సోషల్​ డిస్టెన్స్ ను, లాక్‌డౌన్‌ ను తప్పనిసరిగా పాటించాలని, ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండాలని సూచించారు. కరోనాపై పోరాటంలో ప్రజలకు కాంగ్రెస్‌ కార్యకర్తలు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పారు. కాగా, సోమవారం ప్రధానికి లేఖ రాసిన సోనియా.. లాక్‌డౌన్‌ వల్ల ఎవరు ఆకలితో బాధపడకుండా చూడాలని కోరారు.