
- ఆస్తి కోసం ఇద్దరు కొడుకులు, భార్య అఘాయిత్యం
పెన్ పహాడ్, వెలుగు: ఆస్తి కోసం తండ్రిని చంపేందు కు కొడుకులు యత్నించిన ఘటన సూర్యాపేట జిల్లా లో జరిగింది. సూర్యాపేట సీఐ రాజశేఖర్ శుక్రవారం మీడియాకు తెలిపిన వివరాల మేరకు.. పెన్ పహాడ్ మండలం మెగ్యా తండాకు చెందిన అంగోతు కురువా, కోటమ్మ దంపతులకు పవన్ కల్యాణ్(24), ప్రవీణ్ కుమార్(22), అనే కొడుకులు ఉన్నారు. కుటుంబ గొడవల కారణంగా కోటమ్మ తన కొడుకులతో కలిసి నాలుగేండ్లుగా సూర్యాపేటలోని శాంతినగర్ లో ఉంటుంది.
కురువా తండాలోనే ఉంటుండగా.. తనకున్న 6 ఎకరాల వ్యవసాయ భూమిని కొడుకులకు పంచి ఇవ్వలేదు. ఇటీవల కొంత భూమిని కురువా అమ్మేందుకు యత్నిస్తుండడంతో తమకు దక్కదేమోనని భావించి కోటమ్మ తన కొడుకులతో కలిసి భర్తను చంపాలని ప్లాన్ చేసింది. ఈనెల7న అర్ధరాత్రి12.30 సమయంలో పవన్ కళ్యాణ్, ప్రవీణ్ కుమార్ కలిసి మెగ్యా తండాకు వెళ్లారు. నోట్లో గుడ్డ కుక్కి, కండ్లకు గంతలు కట్టి ఇనుప రాడ్, కర్రతో కొట్టి తండ్రిని చంపేందుకు యత్నించారు.
ఇరుగు పొరుగువారు వస్తారన్నా భయంతో బైక్ పై తీసుకెళ్లి సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించిన అనంతరం పారిపోయారు. బాధితుడి ఫిర్యాదుతో భార్య, ఇద్దరు కొడుకులపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం మెగ్యా తండాలో పవన్ కళ్యాణ్, ప్రవీణ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నట్టు సీఐ తెలిపారు. పెన్ పహాడ్ ఎస్ఐ గోపి, సిబ్బంది రాజు ఉన్నారు.