నీలకురింజీ పూల కోసం.. తల్లిని భుజాలపై ఎత్తుకెళ్లిన కొడుకులు

నీలకురింజీ పూల కోసం.. తల్లిని భుజాలపై ఎత్తుకెళ్లిన కొడుకులు

అమ్మ..సృష్టికి మూలం. అసలు అమ్మ లేనిది సృష్టే లేదు. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ భూమ్మీద జీవితాంతం ఎవరికైనా రుణపడి ఉంటామంటే.. అది ఒక తల్లికి మాత్రమే. అలాంటి తల్లి కోసం మనం ఏం చేసినా తక్కువే. కానీ తల్లిదండ్రులను కష్టపెట్టకుండా, బాధపెట్టకుండా చూసుకోవడం పిల్లల బాధ్యత.  కన్న తల్లి కోరిక తీర్చడంలో ఉండే ఆ ఆనందమే వేరు. లేటెస్ట్ గా కేరళలో  ఓ ఇద్దరు కొడుకులు.. 87 ఏళ్ల వయసులో వృద్ధాప్యంతో బాధపడుతున్న తన తల్లి కోరికను  తీర్చి అందరి మన్నన పొందుతున్నారు. తల్లిని సంతోష పెట్టిన వీళ్లను చూస్తే కొడుకులంటే.. ఇలానే ఉండాలని ప్రతీ తల్లికి అనిపిస్తుందేమో..

కేరళలో మున్నార్ కొండల్లో పూసే  నీలకురింజీ పూలు ఎంత ఫేమసో అందరికి తెలుసు. 12 ఏళ్లకోసారి పూసే ఆ అరుదైన పూలు కనువిందు చేస్తుంటాయి. ఈ ఏడాది నీలకురింజీ విరబూశాయి.  అయితే నీలి రంగుల పువ్వుల సోయగాన్ని 87 ఏళ్ల బామ్మ చూడాలని కోరుకుంది. అయితే అడవుల్లో ఎత్తైన కొండలమీద విరబూసే ఈ పువ్వులను చూడడానికి ఆ తల్లి వయసు, ఆరోగ్యం రెండు సహకరించవు. ఇదే విషయాన్ని ఆ తల్లి తన కొడుకులకు చెప్పింది. వెంటనే  తల్లి కోరికను తీర్చాలనే ఉద్దేశంతో తనయులిద్దరు రోజన్, సత్యన్  ఆమెను జీపులో ఎక్కించుకుని దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణించి మున్నార్ సమీపంలోని కల్లిపారా కొండలకు చేరుకున్నారు. అయితే అక్కడికి చేరుకున్నాక వాళ్లకు తెలిసింది. అక్కడ రోడ్డు సదుపాయం లేదని. దీంతో చేసేదేం లేక ఆ ఇద్దరు కొడుకులు తన తల్లిని భుజాలపై 1.5 కి.మీ ఎత్తుకెళ్లి కొండపైకి తీసుకెళ్లారు. అక్కడ ఆ కొండ నీలకురంజీ పూలతో నిండిపోయింది. తన తల్లిని ఆ పూల మధ్యన కూర్చోబెట్టి  ఇద్దరు కొడుకులు ఫోటోలు, సెల్ఫీలు తీసుకుని మురిసిపోయారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

నీలకురింజీ పూలు చూడాలంటే రెండు కళ్లు సరిపోవు.. అంత అందం వీటి సొంతం. అందుకనే ప్రకృతి ప్రేమికులు ఈ పువ్వులు వికసించే సమయం కోసం 12 ఏళ్ళు ఎదురుచూస్తారు. అత్యంత ప్రసిద్ధి చెందిన నీలకురింజి వికసించే ప్రదేశం ఇడుక్కి జిల్లాలోని మున్నార్ హిల్ స్టేషన్.  ఇక్కడ చివరిసారిగా 2018లో కేరళ వరదలు సంభవించిన సమయంలో నీలకురింజి వికసించాయి. ప్రకృతి ప్రేమికుల ఎదురు చూపులకు చెక్ చెబుతూ ఈ ఏడాది కల్లిపారా కొండలలో 10ఎకరాలకు పైగా ప్రాంతంలో నీలకురింజి పువ్వులు విరబూశాయి. మళ్ళీ మున్నార్‌లో తదుపరి నీలకురింజి పుష్పించేది 2030లో మాత్రమే.