
సిద్దిపేట: సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలం చెల్మి తండాలో సోనుసూద్ పర్యటించారు. గిరిజన సంప్రదాయం మంగళ హారతులతో చెల్మి తండా వాసులు ఘన స్వాగతం పలికారు. రెండేళ్ల క్రితం తండాలో తనకు గుడి కట్టారని తెలిసిందని, ఇక్కడకు రావాలని చాలా కోరిక ఉండేదన్నారు. గ్రామస్తులు, ఫ్యాన్స్ కు థ్యాంక్స్ చెప్పాలని వచ్చానని చెప్పారు. కరోనా ఉన్నా లేకపోయినా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. కష్టాల్లో ఉన్నవారికి సాయం అందిస్తానన్నారు. చెల్మి తండా వాసులకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా తాను ఉన్నానని భరోసా ఇచ్చారు. ‘నేను దేవుడిని కాదు. మీలా మనిషినే. మీ అభిమానాన్ని గుండెల్లో పెట్టుకుంటాను’ అని సోనుసూద్ వ్యాఖ్యానించారు. అభిమానులకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
కరోనా లాక్‌డౌన్ సమయంలో సోనుసూద్ చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు చెల్మి తండాలో గుడి కట్టారు. తండా వాసులు, స్థానికుల విజ్ఞప్తి మేరకు ఇవాళ చెల్మి తండాకు సోనుసూద్ వెళ్లారు. రాజకీయాలకు సంబంధం లేకుండా సహాయం చేయడంతో చెల్మి తండా గ్రామస్తులు, యువకులు సోనుసూద్ పై మరింత అభిమానం పెంచుకున్నారు. తండా వాసులు సోనుసూద్ ను దేవుడిగా భావించి.. వారి గ్రామంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీంతో అభిమానుల పిలుపు మేరకు తండాకు వెళ్లారు.
అంతకుముందు చేర్యాల పట్టణానికి చేరుకున్న సోనుసూద్ కు అభిమానులు, యువకులు ఘన స్వాగతలం పలికారు. ఆయనతో చాలామంది సెల్ఫీలు తీసుకున్నారు. చేర్యాలలో నిర్వహించిన బైక్ ర్యాలీలో సోనూసూద్ తో పాటు చాలామంది యువకులు పాల్గొన్నారు. బైక్ ర్యాలీలో అభిమానులకు అభివాదం చేస్తూ సోనుసూద్ ముందుకు సాగారు. కొందరు అభిమానులు హీరో హీరో అంటూ నినాదాలతో హోరెత్తించారు. అభిమానుల చూపిన ప్రేమకు సోనుసూద్ సంతోషం వ్యక్తం చేశారు.