మేడిగడ్డ బ్యారేజ్ వద్ద మళ్ళీ భారీ శబ్దాలు

  మేడిగడ్డ బ్యారేజ్ వద్ద మళ్ళీ భారీ శబ్దాలు

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ వద్ద మళ్ళీ భారీ శబ్దాలు వచ్చాయి.  మేడిగడ్డ బ్యారేజీ 7 బ్లాకులోని 16వ నెంబర్ గేటును ఎత్తే క్రమంలో బ్యారేజీ కింద భూగర్భంలో నుంచి  భారీ శబ్దాలు వినిపించాయి.  దీంతో అక్కడ ఏర్పాటు చేసిన సెన్సార్లు భారీ శబ్దాలను, ప్రకంపనలను గుర్తించి అలెర్ట్ చేశాయని అధికారులు చెబుతున్నారు.   గతంలో వరదల సమయంలో బ్యారేజీ పునాదుల కింద నుంచి ఇసుక కొట్టుకుపోయి 12 వేల నుంచి 15 వేల క్యూబిక్‌ మీటర్ల పరిమాణంలో భారీ బొరియ ఏర్పడి ఉండవచ్చని ఇప్పటికే నిర్వహించిన జియోఫిజికల్, జియోటెక్నికల్‌ పరీక్షల ద్వారా ఓ అంచనాకు వచ్చినట్టు నీటిపారుదల శాఖ వర్గాలు చెప్తున్నాయి. 

టన్నుల కొద్ది బరువు ఉండే గేటును పైకి ఎత్తే క్రమంలో పునాదులపై ఒత్తిడి ఏర్పడి బ్యారేజీ పిల్లర్లు మరింత కుంగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. ఏడవ బ్లాక్ లోని  పిల్లర్లు కుంగిన  తర్వాత లీకేజీలు ఆపడానికి 40 వేల ఇసుక బస్తాలను వేశారు.  మేడిగడ్డ బ్యారేజీ లో మొత్తం ఎనిమిది బ్లాకులు ఉండగా అందులో 85 గేట్లు ఉన్నాయి. గతేడాది అక్టోబర్ 21న ఏడో బ్లాకు కుంగిన వెంటనే ఏడవ బ్లాక్ లోని 15 నుంచి 22వ నంబర్ వరకు గేట్లు మొరాయించాయి.

కాలేశ్వరం లోపాలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ ఏర్పాటు చేసిన చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ బ్యారేజీలను పలుమార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇటీవల మధ్యంతర నివేదిక సమర్పించింది. 2019 జూలై నెలలో వచ్చిన వరదల సమయంలో బ్యారేజీ ప్రమాద సంకేతాలను తెలిపిందని ఆ నివేదికలో పేర్కొంది. పగుళ్లు వచ్చిన 19, 20, 21 పిల్లర్స్ మధ్య ఉన్న గేట్లను జాగ్రత్తగా పైకి ఎత్తాలని స్పష్టం చేసింది. 

నీటిపారుదల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టి సిబ్బందితో కలిసి మే 17న 15వ నెంబర్ గేటును పైకి ఎత్తారు. ఆ  తర్వాత నిన్న 16వ నంబర్ గేట్లు ఎత్తడానికి ప్రయత్నించగా భారీ శబ్దాలు ప్రకంపనలు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు.   మేడిగడ్డ బ్యారేజీ కింది భాగంలో ఏర్పడిన బొరియలు ఎంత మేరకు ఉన్నాయో ఒక స్పష్టత వచ్చాకే నిపుణుల కమిటీ సూచన మేరకు ఇసుక, సిమెంటు మిశ్రమాన్ని బొరియల్లోకి పంపించి పూడ్చివేయాలని భావిస్తున్నారు. ఈ వర్షాకాలంలో వచ్చే భారీ వరదలకు బ్యారేజీ తట్టుకుంటుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.