వరల్డ్ కప్ కంటే ఐపీఎల్ ట్రోఫీ గెలవడమే కష్టం: సౌరవ్ గంగూలీ

వరల్డ్ కప్ కంటే ఐపీఎల్ ట్రోఫీ గెలవడమే కష్టం: సౌరవ్ గంగూలీ

డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఓటమి.. పరోక్షంగా ఐపీఎల్ టోర్నీపై విమర్శలకు దారితీస్తోంది. ప్రాంచైజీ క్రికెట్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్న బీసీసీఐ.. అంతర్జాతీయ క్రికెట్‌ను పట్టించుకోవడంలేదనే మాటలు వినపడుతున్నాయి. ఐపీఎల్ టోర్నీ వల్ల భారత క్రికెట్ భవితవ్యం అగమ్యగోచరంలో పడిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

సన్నద్దతకు తగినంత సమయం లేకపోవడం కూడా ఓటమికి కారణమని రోహిత్ శర్మ వ్యాఖ్యానించడం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోస్తోంది. అసలు రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్‌గా పనికొస్తాడా? అతని సారథ్యంలో భారత జట్టు వన్డే వరల్డ్ కప్ అయినా గెలవగలదా? అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విమర్శలన్నింటినీ మాజీ దిగ్గజం సౌరవ్ గంగూలీ ఒకే ఒక్క సమాధానంతో కొట్టిపడేశాడు. రోహిత్ కెప్టెన్సీపై పూర్తిస్థాయిలో నమ్మకముందన్న దాదా.. 'వరల్డ్ కప్ టోర్నీలు గెలవడం కంటే ఐపీఎల్ ట్రోఫీ గెలవడం చాలా కష్టమని..' తెలిపాడు. 

రోహిత్ విజయవంతమైన కెప్టెన్..

జాతీయ మీడియాతో మాట్లాడిన గంగూలీ.. "కోహ్లీ టీ20, టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక జట్టుకు సారథి అవసరమయ్యాడు. ఆ టైమ్‌లో సెలెక్టర్లకు ఉన్న ఏకైన ఆప్షన్ రోహిత్. అందుకే అతనిని సరైనవాడని భావించి బాధ్యతలు అప్పగించారు. ఐపీఎల్‌లో రోహిత్ విజయవంతమైన కెప్టెన్. ఐదు ట్రోఫీలు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా దేశానికి ఆసియా కప్, నిదాహాస్ ట్రోఫీని అందించాడు. అందుకే అతడే బెస్ట్ ఆప్షన్ అని సెలక్టర్లు భావించారు".

"వాస్తవంగా చెప్పాలంటే ఐపీఎల్ ట్రోఫీ గెలవడం అంత ఈజీ కాదు. వరల్డ్ కప్ గెలవడం కంటే కూడా కఠినమైంది. ఐపీఎల్ లీగ్ దశలో  14 మ్యాచ్ లు ఉంటాయి. ప్లేఆఫ్స్ లో మరో  3 మ్యాచ్ లు ఆడాలి. అదే వరల్డ్ కప్ లో నాలుగైదు మ్యాచ్ లు గెలవగానే సెమీస్ చేరే అవకాశం ఉంటుంది. టైటిల్ గెలవడానికి అవకాశాలు ఎక్కువ. కానీ ఐపీఎల్ లో ఛాంపియన్ గా నిలవాలంటే 17 మ్యాచ్‌లలో గెలవాల్సి ఉంటుంది. రాబోవు రోజులలో టెస్ట్ ఛాంపియన్ షిప్ విజేతగా భారత జట్టు తప్పక నిలుస్తుంది..' అని దాదా చెప్పుకొచ్చాడు.