
భారతదేశంలో మోస్ట్ ఫేమస్ పేమెంట్ మోడ్ యూపీఐ. ఫిజికల్ క్యాష్ తీసుకెళ్లినా షాపుల్లో చిల్లర దొరకని పరిస్థితి. షాపు యజమానులు సైతం యూపీఐ చేసేయమంటూ ప్రోత్సహిస్తున్న నేటి కాలంలో దానిని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.
ఇందులో భాగంగానే ప్రజలు ఇకపై తమ యూపీఐ పేమెంట్స్ ఫింగర్ ప్రింట్ అలాగే ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా వేగంగా పూర్తి చేసుచేసుకునే ఫెసిలిటీని అక్టోబర్ 8 నుంచి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆధార్ కింద ప్రభుత్వం వద్ద స్టోర్ చేయబడిన బయోమెట్రిక్ డేటాను ఉపయోగించనున్నట్లు వెల్లడైంది. రిజర్వు బ్యాంక్ కేవలం పిన్ నంబర్ ద్వారా మాత్రమే కాకుండా చెల్లింపులకు ఇతర ప్రత్యామ్నాయాలు తీసుకురావాలని సూచించిన తర్వాత ప్రస్తుత చర్యలు వస్తున్నాయి.
దీనికి అనుగుణంగానే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ కొత్త బయోమెట్రిక్ చెల్లింపుల విధానాన్ని ముంబై గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్టివల్‌లో షోకేస్ చేయనుందని రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది. అయితే దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన విడుదల కాలేదు.. కానీ విషయం గురించి తెలిసిన వ్యక్తులు మాత్రం కొత్త బయోమెట్రిక్ చెల్లింపుల విధానం గురించి మాట్లాడటం యూజర్లను సంతోషానికి గురిచేస్తోంది.