అహ్మదాబాద్: టీ20 వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికా, అఫ్గానిస్తాన్‌ను విజయం దోబూచులాడింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన రెగ్యులర్ మ్యాచ్ టై అయిందనుకుంటే.. రెండు సూపర్ ఓవర్లు అంతకుమించిన మజాను అందించాయి. ఓవరాల్‌గా అటు సఫారీలు, ఇటు అఫ్గాన్లు బ్యాటింగ్‌లో కొదమసింహాల్లా కొట్లాడటంతో.. బుధవారం జరిగిన గ్రూప్–డి లీగ్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా రెండో సూపర్ ఓవర్‌లో గట్టెక్కి ఊపిరి పీల్చుకుంది.
అద్భుతమైన బ్యాటింగ్‌తో చివరి వరకు సఫారీలను వణికించిన అఫ్గాన్‌కు ఆఖర్లో కాస్త దురదృష్టం వెంటాడింది. లేదంటే మరో సంచలనం నమోదయ్యేది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 187/6 స్కోరు చేసింది. రైన్ రికెల్టన్ (61), డికాక్ (59) హాఫ్ సెంచరీలతో హోరెత్తించారు. 12 రన్స్ వద్ద మార్‌క్రమ్ (5) ఔటైనా.. ఈ ఇద్దరు రెండో వికెట్‌కు 114 రన్స్ జోడించారు. ఆ తర్వాత ఒక్క రన్ తేడాతో ఇద్దరూ వెనుదిరిగారు. డేవ్లాడ్ బ్రేవిస్ (23), డేవిడ్ మిల్లర్ (20 నాటౌట్), మార్కో యాన్సెన్ (16) మెరుగ్గా ఆడటంతో సౌతాఫ్రికా మంచి టార్గెట్‌ను నిర్దేశించింది.
ఒమర్‌జాయ్ 3, రషీద్ ఖాన్ 2 వికెట్లు తీశారు. తర్వాత అఫ్గానిస్తాన్ 19.4 ఓవర్లలో 187 రన్స్‌కు ఆలౌటైంది. రహమానుల్లా గుర్బాజ్ (84) ఒంటరిపోరాటం చేసినా.. రెండో ఎండ్‌లో పెద్దగా సహకారం లభించలేదు. అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (22), రషీద్ ఖాన్ (20), నూర్ అహ్మద్ (15 నాటౌట్) పోరాడటంతో స్కోర్లు సమం అయ్యాయి. దాంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఎంగిడి 3 వికెట్లు పడగొట్టాడు.
రెండో దాంట్లో ఫలితం..
టీ20ల్లో సూపర్ ఓవర్లు జరగడమే చాలా అరుదు. కానీ ఒకే మ్యాచ్‌లో రెండు సూపర్ ఓవర్లు ఆడాల్సి వస్తే అటు ఫ్యాన్స్‌కు, ఇటు ప్లేయర్లకు ఎంత ఉత్కంఠ ఉంటుందో చెప్పక్కర్లేదు. అలాంటి సూపర్ ఓవర్ మజాను సౌతాఫ్రికా, అఫ్గానిస్తాన్ రెండుసార్లు చూపెట్టాయి. తొలి సూపర్ ఓవర్‌లో ఎంగిడి వేసిన తొలి మూడు బాల్స్ ఆడిన ఒమర్‌జాయ్ (16 నాటౌట్).. 4, 6, 1 కొట్టాడు. నాలుగో బాల్‌కు గుర్బాజ్ (1 నాటౌట్) సింగిల్ తీసి మళ్లీ ఒమర్‌జాయ్‌కు స్ట్రయిక్ ఇచ్చాడు.
చివరి రెండు బాల్స్‌లో ఓ ఫోర్, సింగిల్ తీయడంతో సౌతాఫ్రికా 17/0 స్కోరు చేసింది. తర్వాత ఫజల్‌హక్ ఫారూకీ వేసిన ఓవర్ తొలి బాల్‌ను సింగిల్ తీసిన మిల్లర్ (1 నాటౌట్).. బ్రేవిస్ (6)కు చాన్స్ ఇచ్చాడు. రెండో బాల్‌ను సిక్స్ కొట్టిన అతను మూడో బాల్‌కు వెనుదిరిగాడు. చివరి మూడు బాల్స్ ఆడిన స్టబ్స్ (10 నాటౌట్) 4, 6 కొట్టడంతో స్కోరు 17/1 అయ్యింది.
దాంతో ఫలితం కోసం రెండో సూపర్ ఓవర్‌కు వెళ్లారు. అజ్మతుల్లా బౌలింగ్‌లో స్టబ్స్ (16 నాటౌట్) 6, 1 కొట్టగా, మిల్లర్ 2, 6, 6, 2తో 23/0 స్కోరు వచ్చింది. ఛేదనలో రెండో బాల్‌కే నబీ (0) ఔట్ కాగా, గుర్బాజ్ (18 నాటౌట్) హ్యాట్రిక్ సిక్సర్లు బాది ఉత్కంఠ పెంచాడు. కానీ ఆరో బాల్‌ను భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో గుర్బాజ్ పాయింట్‌లో మిల్లర్‌కు క్యాచ్ ఇచ్చాడు. దాంతో అఫ్గాన్ 19/2కే పరిమితం కావడంతో ఓటమి తప్పలేదు.
