
హైదరాబాద్ సిటీ, వెలుగు: దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్)కు 2025 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో రూ.10,143 కోట్ల ఆదాయం సమకూరినట్టు శుక్రవారం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 71.14 మిలియన్ టన్నుల సరుకు రవాణాతో రూ.6,635 కోట్ల ఆదాయం సమకూరిందని, అలాగే ప్రయాణీకుల ద్వారా రూ.2,991 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో సరుకు రవాణా, ప్రయాణీకుల విభాగాల్లో అత్యుత్తమ పనితీరును కనబర్చినట్టు అధికారులు పేర్కొన్నారు.
జోన్ పరిధిలో 2025, ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రూ.10,143 కోట్ల స్థూల ఆదాయం వచ్చింది. ఇది 2024–-25లో నమోదైన ఆదాయం 9,966 కోట్లతో పోలిస్తే 1.7శాతం ఎక్కువని అధికారులు వివరించారు. అలాగే జోన్ మునుపెన్నడూ లేని విధంగా 2024–25లో 71.14 మిలియన్ టన్నులు సరుకును రవాణా చేసిందని వెల్లడించారు. గతేడాది కంటే ఇది 6శాతం ఎక్కువని తెలిపారు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ.. అధికారులు, సిబ్బందిని అభినందించారు. ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఉత్తమ పనితీరును సాధించడానికి అన్ని డివిజన్లు, ప్రధాన కార్యాలయాల సిబ్బంది, అధికారులు ఇదే స్ఫూర్తితో పని చేయాలని సూచించారు.