దసరాకు 620 స్పెషల్ ట్రైన్లు

దసరాకు 620 స్పెషల్ ట్రైన్లు

సికింద్రాబాద్/హైదరాబాద్, వెలుగు: దసరా సందర్భంగా 620 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. రాష్ట్రంలో సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే స్టేషన్లు, కాచిగూడ, లింగంపల్లి సహా ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి ప్రత్యేక రైళ్లు నడుస్తాయని ప్రకటించింది. పండుగ సీజన్లో విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నంతో సహా వివిధ ప్రాంతాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్యాసింజర్లు ఎక్కువగా ప్రయాణిస్తారు. ఈ నేపథ్యంలో  తెలుగు రాష్ట్రాల మధ్య దాదాపు 200 ట్రిప్పులు షెడ్యూల్ చేశారు.

రెండు భారత్ గౌరవ్ టూరిస్ట్  రైళ్లు

దసరా  సందర్భంగా పవిత్ర పుణ్యక్షేత్రాలకు ఈ నెలలో రెండు భారత్ గౌరవ్ టూరిస్ట్  రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ రెండు ట్రైన్లు కాశీ, పూరి, అయోధ్య, రామేశ్వరం మొదలైన పవిత్ర స్థలాలకు ప్రయాణిస్తాయి. ప్రయాణికుల సౌకర్యార్థం అదనపు టికెట్ కౌంటర్లు, మార్గదర్శకాలను అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలిపారు.

జేబీఎస్ మీదుగా విజయవాడకు బస్సులు

ప్యాసింజర్ల వినతుల మేరకు జేబీఎస్ మీదుగా విజయవాడకు బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. బీహెచ్ఈఎల్/మియాపూర్ నుంచి బయలుదేరే 24 సర్వీసులను ఎంజీబీఎస్ నుంచి కాకుండా జేబీఎస్ మీదుగా నడపనున్నామని తెలిపారు. ఆ సర్వీసులు కేపీహెచ్ బీ కాలనీ, బాలానగర్, బోయిన్ పల్లి, జేబీఎస్, సంగీత్ , తార్నాక , హబ్సిగూడ , ఉప్పల్ , ఎల్బీనగర్ మీదుగా విజయవాడకు నడుస్తాయని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18  నుంచి సర్వీసులు ప్రారంభమవుతాయన్నారు.