కంత్రీగాళ్లు : రూ.28 కోట్ల బ్యాంక్ డబ్బు కొట్టేసిన ఉద్యోగులు

కంత్రీగాళ్లు : రూ.28 కోట్ల బ్యాంక్ డబ్బు కొట్టేసిన ఉద్యోగులు

సౌత్ ఇండియన్ బ్యాంక్ నోయిడా బ్రాంచ్‌లో ఓ భారీ మోసం జరిగింది. అందులో పని చేసే ఓ సీనియర్ ఉద్యోగే సుమారు రూ. 28 కోట్లకు పైగా స్వాహా చేశాడు. అంతే కాదు ఆ మొత్తానంతా తన కుటుంబ సభ్యుల ఖాతాలకు బదిలీ చేసినందుకు గానూ అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం డిప్యూటీ జనరల్ మేనేజర్, సౌత్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్ రీజినల్ హెడ్ రెంజిత్ ఆర్ నాయర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వెంటనే స్పందించిన పోలీసులు.. ఘటనపై విచారణ జరిపి నిందితులను వీలైనంత త్వరగా పట్టుకునేందుకు ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. డిసెంబర్ 3న బ్యాంక్ అంతర్గత విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ చీఫ్… కస్టమర్‌లలో ఒకరితో సంబంధం ఉన్న కొంతమంది వ్యక్తులు కొన్ని చట్టవిరుద్ధమైన లావాదేవీలు చేయమని బెదిరిస్తున్నారని పేర్కొంటూ (నిందితుడు) నుండి ఒక మెయిల్ వచ్చిందని రెంజిత్ ఆర్ నాయర్ చెప్పారు. అందుకు తాను ఒప్పుకోకపోవడంతో వారు బెదిరింపులు చేయడం మొదలెట్టారన్నారు. ఆ తర్వాత ఎవరికీ తెలియకుండా ఆ వ్యక్తి కంపెనీ ఖాతా నుంచి రూ.28.07కోట్లు విత్ డ్రా చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రాథమిక విచారణలో నిందితుడు సేవింగ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాల నుంచి సొమ్మును స్వాహా చేసినట్లు తేలిందని బ్యాంక్ తన ఫిర్యాదులో పేర్కొంది. బ్యాంకు లావాదేవీల ఆధారంగా నిందితుడి భార్య, తల్లి కూడా నేరంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఘటన అనంతరం నిందితుడిని ఆ కంపెనీ సస్పెండ్ చేసింది. అతను ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు సమాచారం. దీంతో అతను దేశం నుంచి పారిపోయినట్టు అనుమానిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం, సౌత్ ఇండియన్ బ్యాంక్‌లోని కొంతమంది అధికారులు.. తమ ఉద్యోగుల్లో ఒకరు తన కుటుంబ సభ్యుల ఖాతాలకు బ్యాంకు నుంచి రూ. 25 కోట్లకు పైగా బదిలీ చేసినట్లు పేర్కొంటూ ఫిర్యాదు చేశారని నోయిడా డీసీపీ తెలిపారు. ఈ ఘటనపై ప్రాథమిక విచారణ జరిపి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు.. నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు. అతనితో పాటు నిందితుని కుటుంబసభ్యుల పైనా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.