కేరళను తాకిన నైరుతి

కేరళను తాకిన నైరుతి
  •     రెండు రోజుల ముందే ఎంటరైన రుతుపవనాలు
  •     మూడు రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశం
  •     రేపటి నుంచి రాష్ట్రంలో వర్షాలు పడే చాన్స్​.. ఎల్లో అలర్ట్ జారీ
  •     మండిన గురువారం.. సీజన్​లోనే హయ్యెస్ట్ టెంపరేచర్ రికార్డ్​
  •     మంచిర్యాల జిల్లా భీమారంలో 47.2 డిగ్రీలు నమోదు

హైదరాబాద్, వెలుగు: అంచనా వేసినదానికంటే వేగంగా నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. ఏటా జూన్ 1 నాటికి కేరళలోకి ఎంటరై.. జూన్ 5 నాటికి ఈశాన్య రాష్ట్రాలకు విస్తరిస్తాయి. కానీ, ఈ సారి మే 31వ తేదీనే కేరళలోకి ఎంటరవుతాయని తొలుత భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. కానీ, ఐఎండీ అంచనాలకన్నా ముందే రుతుపవనాలు వచ్చాయి. గురువారం ఉదయం 10 గంటలకే కేరళలోకి ప్రవేశించిన రుతుపవనాలు.. ఈశాన్య రాష్ట్రాలకు కూడా విస్తరించాయి. అంటే రెండు రోజుల ముందే కేరళలోకి రాగా.. ఈశాన్య రాష్ట్రాలకు ఆరు రోజుల ముందుగానే చేరుకున్నాయి. 

ఇటు దక్షిణ తమిళనాడులోని పలు ప్రాంతాల్లోనూ రుతుపవనాలు విస్తరించినట్టు ఐఎండీ వెల్లడించింది. మరో మూడు రోజుల్లో తెలంగాణలోకీ రుతుపవనాలు వచ్చేందుకు అనుకూల వాతావరణ పరిస్థితులున్నట్టు అధికారులు చెప్తున్నారు. అందుకు తగ్గట్టు జూన్ 1 నుంచి రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని, రుతుపవనాలు త్వరగా ప్రవేశించేందుకు ఉపరితల గాలుల వేగం కూడా సహకరిస్తుందని చెప్తున్నారు. శనివారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడుతాయని ఐఎండీ బులెటిన్​లో పేర్కొంది. రాష్ట్రం మొత్తానికి ఎల్లో అలర్ట్​ను జారీ చేసింది.

రాష్ట్రంలో మండిన ఎండ.. 

గురువారం రాష్ట్రంలో ఎండ మండిపోయింది. ఈ సీజన్​లోనే అత్యధిక టెంపరేచర్ రికార్డ్ అయింది. మంచిర్యాల జిల్లా భీమారంలో అత్యధికంగా 47.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెల 5న తొలిసారిగా జగిత్యాల జిల్లా వెల్గటూరులో 47.1 డిగ్రీల మార్క్​ను దాటిన టెంపరేచర్.. తాజాగా మంచిర్యాల జిల్లాలో రికార్డ్ అయిన టెంపరేచర్ దాన్ని బ్రేక్ చేసింది. ఈ జిల్లాలోని 13 మండలాల్లో 46 నుంచి 47 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెళ్లపాడులోనూ 47.1 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. 

ఈ జిల్లాలోనూ 15 మండలాల్లో టెంపరేచర్లు 45 నుంచి 47 డిగ్రీల మధ్య నమోదు కావడం గమనార్హం. భద్రాద్రి జిల్లాలో మూడు చోట్ల 46.8 డిగ్రీల మేర టెంపరేచర్లు నమోదయ్యాయి. పెద్దపల్లి జిల్లా కమాన్​పూర్​లో 46.7 డిగ్రీలు నమోదు కాగా.. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కుంచవెల్లిలో 46.6, ఖమ్మం జిల్లా పమ్మిలో 46.5 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అయింది. నల్గొండ జిల్లా మాడ్గులపల్లిలో 45.9, జగిత్యాల జిల్లా జైనలో 45.8, ములుగు జిల్లా అలుబాకలో 45.8, సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో 45.6, భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో 45.6, జయశంకర్ జిల్లా సార్వాయిపేటలో 45.5, కరీంనగర్ జిల్లా తంగులలో 45.4, ఆదిలాబాద్ జిల్లా పిప్పల్ ధరిలో 45.2, నిర్మల్ జిల్లా దస్తూరాబాద్​లో 45.1 డిగ్రీల మేర టెంపరేచర్లు నమోదయ్యాయి. 

మొత్తంగా రెండు జిల్లాల్లో 47 డిగ్రీలు రికార్డ్​ కాగా.. 3 జిల్లాల్లో 46 డిగ్రీలు, 9 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్, రాజన్నసిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, జనగామ, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో 44 డిగ్రీలకన్నా ఎక్కువగా రికార్డ్ అయ్యాయి. మిగతా జిల్లాల్లో మాత్రం 43 డిగ్రీల కన్నా తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో 41 డిగ్రీల మేర రికార్డ్ అయ్యాయి.

హైదరాబాద్​లో తక్కువే అయినా.. మంటే..

ఇతర ప్రాంతాలతో పోల్చితే హైదరాబాద్ సిటీలో ఉష్ణోగ్రత తక్కువే నమోదైనా.. వేడి మాత్రం చాలా తీవ్రంగా ఉంది. సిటీలోని ఉప్పల్​లో 43.3, అంబర్​పేటలో 43, సరూర్​నగర్ పరిధిలో 42.4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదైనా.. వేడి మాత్రం అంతకుమించి ఉంది. టెంపరేచర్లు తక్కువగానే ఉంటున్నా.. సిటీలో చుట్టూ కాంక్రీట్ నిర్మాణాలే ఉండడం, వెహికల్స్ నుంచి వెలువడుతున్న పొల్యూషన్​ ఎక్కువగా ఉండడం, చెట్లు లేకపోవడం వంటి కారణాలతో ఉపరితల వేడి టెంపరేచర్లకు మించి నమోదవు తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కాంక్రీట్ నిర్మాణాలతో వేడి భూమిలోకి అబ్జార్బ్ కాకుండా పైకి రిఫ్లెక్ట్​ అవుతున్నదని అంటున్నారు. అందుకే ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నా.. వేడి ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు.