2022 నేరాలను వెల్లడించిన పోలీసు ఆఫీసర్లు

2022 నేరాలను వెల్లడించిన పోలీసు ఆఫీసర్లు

2022 నేరాలను వెల్లడించిన పోలీసు ఆఫీసర్లు
సైబర్ క్రైమ్ మాత్రం పెరుగుదల

ములుగు, వెలుగు : ములుగు జిల్లాలో గతేడాదితో పోలిస్తే క్రైమ్ రేట్ తగ్గిందని ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ వెల్లడించారు. మేడారం జాతర, వరద బాధితుల రక్షణ చర్యల్లో పోలీసులు బాగా పనిచేశారని కొనియాడారు. గురువారం ములుగు పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో 2022కు సంబంధించిన క్రైమ్ రేట్ ను మీడియాకు వివరించారు. జిల్లాలో 38,893 చలాన్లు నమోదు అయ్యాయని, ఇందుకు గాను రూ.89.2లక్షల ఫైన్లు వసూలు చేశామన్నారు. 742 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, 16 మందిని అరెస్ట్ చేశామన్నారు. ఈ ఏడు 21, 746 డ్రంకెన్​ డ్రైవ్​ కేసులు ఫైల్ చేశామన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న 22 మంది మావోయిస్టులను అరెస్ట్​ చేశామని, ఇందులో ఆరుగురు లొంగిపోయారని తెలిపారు. 134 సైబర్ క్రైమ్ కేసులు నమోదు అయ్యాయని, అడ్వకేట్ మల్లారెడ్డి హత్య కేసును 48గంటల్లో  ఛేదించామన్నారు. ఆదివాసీ విద్యార్థులు, యువత కోసం క్రీడా పోటీలు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నేరనియంత్రణకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. మెరుగైన  పనితీరు కనబరుస్తున్న ఓఎస్డీ గౌస్ ఆలం, ఏఎస్పీలు సుధీర్ రాంనాథ్ కేకన్, అశోక్ కుమార్, ఇతర సిబ్బందిని అభినందించారు.

మానుకోటలో 9.72 % క్రైం రేట్ పెరుగుదల..

మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ జిల్లా పరిధిలో క్రైం రేట్ పెరుగుతోంది. గతేడాదితో పోల్చితే 9.72శాతం క్రైమ్ పెరిగినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతేడాది జిల్లాలో 3,179 కేసులు నమోదు కాగా, ఇప్పుడు 3,488 కేసులు ఫైల్ అయ్యాయన్నారు. మర్డర్లు, చీటింగ్ కేసులు, సైబర్ నేరాలు, కిడ్నాప్, మహిళాలపై దాడులు పెరిగాయన్నారు. దోపిడీ దొంగతనాలు, ఆస్తుల గొడవలు, రోడ్డు ప్రమాదాలు సైతం పెరిగాయన్నారు. నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని రెగ్యులర్ గా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. గతేడాది 792 డ్రంకెన్ కేసులు ఫైల్ కాగా, ఈ ఏడాది 3,189 కేసులు నమోదయ్యాయని, నాలుగు రెట్లు పెరుగుదల కనిపించిందన్నారు. దొంగతనాల కేసులో 50.16 శాతం రికవరీ సాధించామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు సదయ్య, రఘు, రమణబాబు, సీఐలు సతీశ్, రవికుమార్ ఉన్నారు.