ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత

ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత
  • కేంద్ర మంత్రిగా, మూడుసార్లు యూపీ సీఎంగా సేవలు
  • నెలరోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస
  • నేడు అంత్యక్రియలు, మూడు రోజులు సంతాప దినాలు

లక్నో: సమాజ్​వాదీ పార్టీ(ఎస్పీ) వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్(82) కన్నుమూశారు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురుగ్రామ్​లోని మేదాంత ఆస్పత్రిలో ట్రీట్​మెంట్ పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కొడుకు, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ట్విట్టర్​లో వెల్లడించారు. ‘‘నా తండ్రి, ప్రతి ఒక్కరి నేత ‘నేతాజీ’ ఇక లేరు”అని ట్వీట్ చేశారు. మూడేండ్లుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ములాయం సింగ్ ఈ ఏడాది ఆగస్టు 22 న మేదాంత ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచి ఆయన ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. ఊపిరితిత్తులు, కిడ్నీ సమస్యలకు డాక్టర్లు ట్రీట్​మెంట్ అందజేశారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆయనను ఈ నెల 2న ఐసీయూలో ఉంచి డాక్టర్ల బృందం ట్రీట్​మెంట్ అందించింది. రెండ్రోజుల 
నుంచి పరిస్థితి క్షీణించడంతో ములాయంను వెంటిలేటర్​పై ఉంచి లైఫ్​ సేవింగ్ డ్రగ్స్ ఇచ్చారు. అయినా ఆయన హెల్త్ కండిషన్ క్రిటికల్​గా మారడంతో సోమవారం తుదిశ్వాస విడిచారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 

రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ సంతాపం

ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ సహా పలువురు నేతలు ములాయం సింగ్ మృతికి సంతాపం తెలిపారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ములాయం అసాధారణ విజయాలు సాధించారని ముర్ము ట్వీట్ చేశారు. ప్రజలకు ములాయం ఎన్నో సేవలు చేశారని, జయప్రకాశ్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియాల ఆదర్శాలను ఆచరణలోకి తేవడానికి ఆయన జీవితాన్ని అంకితం చేశారని ప్రధాని మోడీ కొనియాడారు. ములాయం మరణవార్త తెలియగానే కేంద్ర హోంమంత్రి అమిత్‌‌షా ఆస్పత్రికి చేరుకుని అఖిలేశ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

సోషలిస్ట్ గొంతు మూగబోయింది..

ములాయం మృతితో సోషలిస్టు ఆలోచనల గొంతు మూగబోయిందని కాంగ్రెస్‌‌ చీఫ్ సోనియా గాంధీ అన్నారు. ములాయం డైనమిక్ వ్యక్తిత్వం భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుందని ఎల్‌‌కే అద్వానీ కొనియాడారు. ఆయన గొప్ప పార్లమెంటేరియన్ అని మన్మోహన్ సింగ్ గుర్తుచేశారు. లౌకిక, సామ్యవాద రాజకీయ సంప్రదాయాలకు ములాయం జీవితకాలం కట్టుబడి ఉన్నారని హెచ్‌‌డీ దేవెగౌడ అన్నారు. అట్టడుగు రాజకీయాల నిజమైన యోధుడు ములాయం అని రాwహుల్ గాంధీ కొనియాడారు. బీఎస్పీ చీఫ్ మాయావతితో పాటు బీహార్​ సీఎం నితీశ్,  కేరళ సీఎం పినరయి, తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి,  పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా తదితరులు ములాయం సింగ్ మృతికి సంతాపం తెలిపారు.

ఉప ఎన్నికలో రికార్డు..

2002లో యూపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ, బీఎస్పీలు కలిసి మాయావతి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. ఆ తర్వాత ఏడాది ఆగస్టులో బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కుప్పకూలింది. అప్పుడు లోక్​ సభ సభ్యుడిగా ఉన్న ములాయం రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చారు. బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆరు నెలల్లో అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి ఉండడంతో 2004లో జరిగిన గున్నౌర్​ఉప ఎన్నికలో ములాయం పోటీ చేసి గెలిచారు. ఈ ఉప ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ములాయం సింగ్​కు 94 శాతం ఓట్లు పడ్డాయి. 

ప్రధాని పదవి కొద్దిలో మిస్..

ములాయం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాక అంచెలంచెలుగా ఎదిగారు.  రాష్ట్ర, దేశ రాజకీయాల్లో చక్రంతిప్పారు. ప్రధాని అయ్యే అవకాశం తృటిలో తప్పిపోయింది. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో ములాయం రక్షణ శాఖ బాధ్యతలు చేపట్టారు. దేవెగౌడ రాజీనామా చేయడంతో పీఎం అయ్యే ఛాన్స్  ములాయంకు దక్కింది. లాలూ ప్రసాద్, శరద్ యాదవ్ అడ్డుకోవడంతో ఆ ఛాన్స్ మిస్సైంది.

ఫ్యామిలీ, ఎడ్యుకేషన్​

ములాయం సింగ్​ యాదవ్​ 1939, నవంబర్​ 22న ఉత్తర్​ప్రదేశ్​లోని ఇటావా జిల్లా సైఫాయ్ గ్రామంలో జన్మించారు. తండ్రి పేరు సుగ్‌హ‌ర్ సింగ్ యాద‌వ్, తల్లి పేరు మూర్తీ దేవి. ములా యం పొలిటికల్​ సైన్స్​లో బీ.ఏ, బీ.టీ, ఎంఏ చదివారు. 1980‌‌లో మాల్తీ దేవిని పెండ్లి చేసు కోగా.. వారికి అఖిలేశ్ యాదవ్‌ పుట్టాడు. ఆరోగ్య సమస్యలతో మాల్తీ దేవి 2003లో కన్నుమూశారు. ఆపై సాధన గుప్తాను ములాయం పెండ్లి చేసుకున్నారు. 2022లో అనారోగ్యంతో సాధనా తుదిశ్వాస విడిచారు. 

1960లో రాజకీయాల్లోకి.. 

ములాయం సింగ్​ యాదవ్​ 1960లో రాజకీ యాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1967లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1977లో రాష్ట్ర మంత్రిగా  1980లో లోక్​దళ్​ ప్రెసిడెంట్​గా సేవలు అందించారు. తొలిసారి 1989లో యూపీ సీఎంగా ములాయం ఎన్నిక య్యారు. 1991లో మధ్యంతర ఎన్నికల్లో ములాయం పార్టీ ఓడిపోయింది. 1992లో సమాజ్ వాదీ పార్టీని స్థాపించి,  బీఎస్పీ పొత్తుతో రెండో సారి సీఎం అయ్యారు. 2003లో మూడో సారి సీఎంగా ఎన్నికయ్యారు.

యూపీలో మూడ్రోజులు సంతాపం

ములాయం సింగ్ యాదవ్​కు గౌరవ సూచకంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో మూడ్రోజులు 
సంతాప దినాలు ప్రకటించారు. ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని చెప్పారు.