
పెన్ పహాడ్, వెలుగు : ప్రజల అభిమానం పొందేలా పోలీసులు విధులు నిర్వహించాలని ఎస్పీ నరసింహ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోనీ పోలీస్ స్టేషన్ ను ఆయన తనిఖీ చేశారు. ముందుగా ఎస్పీకి డీఎస్పీ ప్రసన్నకుమార్ స్వాగతం పలికారు. స్టేషన్ రికార్డులు, పరిసరాలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని పని చేయాలన్నారు. రౌడీ సీటర్స్, గ్రామాల్లో సమస్యలు సృష్టించే వ్యక్తులపై నిఘా పెట్టాలని చెప్పారు. స్టేషన్ పరిధిలో గ్రామాలు, కాలనీలు పెట్రోలింగ్, తనిఖీలు చేయాలన్నారు. అనంతరం స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు.
నిర్వాహకులు జాగ్రత్తలు పాటించాలి..
సూర్యాపేట, వెలుగు: భారీ గణేశ్ విగ్రహాలను వాహనాల్లో తరలించేప్పుడు కరెంట్ తీగలు గమనిస్తూ వెళ్లాలని ఎస్పీ నరసింహ మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఎత్తయిన గణేశ్ విగ్రహాలను తరలించే సమయంలో కరెంటు తీగలు తగిలి ప్రమాదాలు సంభవించిన సంఘటనలు ఉన్నాయని గుర్తుచేశారు. ఎవరూ ప్రమాదాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ విగ్రహాలు తరలించే సమయంలో స్థానిక పోలీసులు, ఎలక్ట్రిసిటీ అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.