అట్రాసిటీ కేసుల్లో వెంటనే న్యాయం చేయాలి : సంగారెడ్డి ఎస్పీ రమణ కుమార్

అట్రాసిటీ కేసుల్లో వెంటనే న్యాయం చేయాలి : సంగారెడ్డి ఎస్పీ రమణ కుమార్
  • సంగారెడ్డి ఎస్పీ రమణ కుమార్ 

సంగారెడ్డి టౌన్, వెలుగు : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు వెంటనే న్యాయం జరిగేలా పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు పనిచేయాలని సంగారెడ్డి ఎస్పీ రమణ కుమార్ సూచించారు. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ మీటింగ్​హాల్​లో శుక్రవారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్సు అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. అడిషనల్​ కలెక్టర్ వీరారెడ్డితో కలిసి ఆయన అట్రాసిటీ కేసుల పురోగతిపై సమీక్షించారు. బాధితులకు న్యాయం జరిగేందుకు పకడ్బందీగా దర్యాప్తు జరిపి పూర్తి సకాలంలో చార్జ్ షీట్ ఫైల్ చేయాలన్నారు. బాధితులకు ప్రభుత్వం తరపున అందించాల్సిన ఆర్థిక సహాయాన్ని త్వరగా ఇచ్చేలా చూడాలని డీఆర్ఓ కు సూచించారు.

2021–-22 సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి 46 కేసులలో బాధితులకు రూ.59.84 లక్షలు చెల్లించినట్లు తెలిపారు. 2022–-23లో 62 కేసులకు రూ. 68 లక్షల చెల్లించాల్సి ఉందని, నిధులు వచ్చిన వెంటనే బాధితులకు చెల్లిస్తామని చెప్పారు. సమావేశంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ డీడీ అఖిలేశ్​రెడ్డి, బీసీ సంక్షేమ అధికారి జగదీశ్, డీఎస్పీలు, ఆర్డీవోలు, డీటీడబ్ల్యూఓ ఫిరంగి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారి, కలెక్టరేట్  సూపరింటెండెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, విజిలెన్సు అండ్ మానిటరింగ్  కమిటీ సభ్యులు కె.ఇమ్మయ్య, బి.రామకృష్ణ, పి.దుర్గాప్రసాద్, ఎం.చంద్రశేఖర్, రాథోడ్ నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.