సుజాతనగర్, వెలుగు : యువత మత్తుకు దూరంగా ఉండాలని, గంజాయి అక్రమ రవాణా చేసే వారి సమాచారం అందించాలని ఎస్పీ రోహిత్ రాజు కోరారు. ఈనెల15 వరకు జిల్లా పోలీసులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చైతన్యం -డ్రగ్స్ పై యుద్ధం కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం సుజాతనగర్ సెంటర్ నుంచి లక్ష్మీదేవిపల్లి, ఇల్లెందు క్రాస్ రోడ్డు వరకు భారీ బైక్‌ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ‘చైతన్యం’ కార్యక్రమం ద్వారా గంజాయి లాంటి మత్తు పదార్థాల బారిన యువత పడకుండా అవగాహన కల్పించడం, గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవడం కోసం నిరంతర తనిఖీలు చేపట్టడం చేస్తున్నామన్నారు.
అనంతరం ఎస్పీ జెండాను ఊపి బైకు ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, సీఐలు రాయల వెంకటేశ్వర్లు, ప్రతాప్, కరుణాకర్, ఎస్సై లు రమాదేవి, రమణారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
