2024 కల్లా స్పేస్ టూర్​లను స్టార్ట్ చేస్తాం : స్పేస్ పర్ స్పెక్టివ్

2024 కల్లా స్పేస్ టూర్​లను స్టార్ట్ చేస్తాం : స్పేస్ పర్ స్పెక్టివ్

అంతరిక్షంలోకి ఆస్ట్రోనాట్లను మాత్రమే కాదు.. సాధారణ ప్రజలనూ టూరిస్టులుగా తీసుకుపోయేందుకు ఇప్పటికే అనేక కంపెనీలు కసరత్తు షురూ చేశాయి. ఒకట్రెండు కంపెనీలు ఇదివరకే స్పేస్ టూరిజానికి నాంది పలికాయి. అయితే 2024 కల్లా తాము పూర్తిస్థాయిలో స్పేస్ టూర్​లను స్టార్ట్ చేస్తామని అమెరికాకు చెందిన ‘స్పేస్ పర్ స్పెక్టివ్’ కంపెనీ ప్రకటించింది. మీరు జస్ట్ రూ.కోటి పెట్టి టికెట్ కొనుక్కుంటే చాలు.. మిమ్మల్ని పెద్ద స్పేస్ బెలూన్​తో అంతరిక్షం అంచు దాకా తీసుకెళ్లి.. గుండ్రటి భూమిని నేరుగా 360 డిగ్రీల్లో చూపిస్తామని అంటోంది. 

ఇదీ ప్లాన్ 

‘స్పేస్ పర్ స్పెక్టివ్’ కంపెనీని ఫ్లోరిడాకు చెందిన భార్యాభర్తలు టేబర్ మెక్ కల్లమ్, జేన్ పోయింటర్ 2019లో ప్రారంభించారు. సముద్రంలో షిప్​లను ఉంచి, వాటిపై నుంచి ఫుట్​బాల్ ఫీల్డ్ అంత ఉండే స్పేస్ బెలూన్​కు వేలాడదీసిన క్యాప్సూల్​లో టూరిస్టులను అంతరిక్షం అంచు(స్ట్రాటోస్పియర్) దాకా పంపి, తిరిగి సేఫ్​గా సముద్రంలో ల్యాండ్ అయ్యేలా చూడటమే ఈ కంపెనీ వేసిన ప్లాన్. ఇందులో భాగంగా షిప్​లను కొనుగోలు చేసి, ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల సముద్రంలో వాటిని మెరైన్ స్పేస్ పోర్టులుగా ఉపయోగించుకునేందుకు కసరత్తు చేస్తోంది. 2024లో స్పేస్ టూరిజం స్టార్ట్ చేసేందుకు లాస్ ఏంజెలిస్ కంపెనీ నుంచి 292 ఫీట్ల షిప్​ను కూడా కొనుగోలు చేసింది. దీనికి ‘ఎంఎస్ వొయెజర్’ అని పేరు పెట్టింది. దీని నుంచి రెండేండ్లలో ఫస్ట్ టూర్​కు ప్రణాళికలు వేస్తోంది.

లగ్జరీ క్యాప్సూల్ లో ప్రయాణం 

స్పేస్ టూర్ కోసం వాడే ‘స్పేస్ నెప్ట్యూన్’ క్యాప్సూల్​లో అద్దాలతో కూడిన క్యాబిన్ ఉంటుంది. అందులో కూర్చునేందుకు సోఫా, టిపాయ్​ల వంటివీ ఉంటాయి. సరదాగా మందేసేందుకు చిన్న పాటి బార్ లాంటి సెటప్ కూడా ఉంటుంది. వైఫై సౌలతు కూడా ఏర్పాటు చేస్తారు. అందులోనే బాత్రూం సైతం ఉంటుంది. ఈ ప్యాసింజర్ క్యాప్సూల్​లో ఒక్కోసారి 8 మంది చొప్పున టూర్​కు పంపుతామని కంపెనీ చెప్తోంది. 

2024కు బుకింగ్ ఫుల్ 

2024లో చేపట్టబోయే టూర్లన్నింటికీ ఇప్పటికే టికెట్లు బుక్ అయిపోయాయని కంపెనీ చెప్తోంది. ఇప్పుడు మీకు కావాలంటే.. 2025కే టికెట్లు బుక్ చేసుకునే చాన్స్ ఉందని అంటోంది. మొత్తం టికెట్ డబ్బులు ముందే కట్టాల్సిన అవసరం కూడా లేదట. ప్రస్తుతం రూ. 81 వేలు కట్టి బుక్ చేసుకుంటే చాలని.. ఆ తర్వాత టూర్​కు ముందు మిగతా అమౌంట్ కడితే సరిపోతుందని కంపెనీ పేర్కొంటోంది.  

మొత్తం 6 గంటల టూర్ 

టూర్ మొత్తం ఆరు గంటల పాటు సాగుతుంది. ప్యాసింజర్ క్యాప్సూల్ రెండు గంటల పాటు స్ట్రాటోస్పియర్ మధ్యలో సుమారు లక్ష అడుగుల ఎత్తు (30 కిలోమీటర్లు)లో ఆగుతుంది. ఇక్కడి నుంచి భూగోళం మొత్తాన్ని ఒకేసారి చూసేందుకు వీలవుతుంది. ఆ తర్వాత బెలూన్ నెమ్మదిగా కిందకు దిగి, సముద్రంలో క్యాప్సూల్​ను ల్యాండ్ చేస్తుంది. క్యాప్సూల్ ల్యాండ్ అయ్యే చోటు దగ్గర్లోకి ముందే చేరుకుని ఉండే షిప్.. వెంటనే అక్కడికి వెళ్లి ప్యాసింజర్లను పికప్ చేసుకుంటుంది. అలాగే స్పేస్ బెలూన్ పైకి ఎగిరాక.. సముద్రపు గాలులతోనే ముందుకు కదులుతుందని.. దానిని సముద్రంలో వాతావరణం అనుకూలంగా ఉన్న చోటనే దింపొచ్చని చెప్తున్నారు. క్యాప్సూల్ ల్యాండ్ అయ్యే చోటుకు షిప్​ను తరలించడం ఈజీ అని, అందువల్ల టూర్​లు ఆగిపోయే అవకాశాలు తక్కువని అంటున్నారు.