ఫాల్కన్ ఎగిరింది

ఫాల్కన్ ఎగిరింది
  • అతి క్లిష్టమైన మిషన్ సక్సెస్
  • మూడు కక్ష్యల్లో చేరిన 24శాటిలైట్లు
  • ‘అఫ్ కోర్స్ ఐ లవ్ వ్యూ’పై ల్యాండ్ కాని కోర్ సెంటర్

స్పేస్ ఎక్స్ గెలుపు గుర్రం ఫాల్కన్ హెవీ అతి క్లిష్టమైన మిషన్ ను విజయవంతం గా పూర్తి చేసింది. అమెరికాలోని ఫ్లారిడాలో ఉన్న నాసాకు చెందిన కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి మంగళవారం రాత్రి 2.30 గంటలకు నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకుపోయింది. దాదాపు 4 గంటల పాటు సాగిన సుదీర్ఘ ప్రయాణంలో మొత్తం 24 ఎక్సె పెరిమెంట్ శాటిలైట్లను మూడు కక్ష్యల్లో సక్సెస్ ఫుల్ గా ప్రవేశపెట్టింది. అంతకుముందు హెవీని నిర్ణీత కక్ష్యల వద్దకు పంపేందుకు స్పేస్ ఎక్స్ నిర్వాహకులు మొత్తం నాలుగు సార్లు అప్పర్ స్టేజ్ ఇంజన్‌‌ను మండించారు. మొత్తం మిషన్ పూర్తి కావడానికి 6 గంటల సమయం తీసుకుంది. అమెరికాకు చెందిన డిపార్ట్ మెంట్ ఆఫ్ డిఫెన్స్ (డీఓడీ) చేపట్టిన స్పేస్ టెస్ట్ ప్రొగ్రామ్–2 (ఎస్టీపీ–2)లో భాగంగా నాసా, ఎన్వోఏఏ ఈ శాటిలైట్స్‌‌ను స్పేస్ ఎక్స్‌‌తో కలిసి నింగిలోకి పంపాయి. నాసా పంపిన వాటిలో
డీప్ స్పేస్ అటామిక్ క్లాక్ ఉంది. ఇది పూర్తిగా గ్రీన్ ఫ్యూయల్‌‌తో పని చేస్తుంది. మనిషి అస్థికలతో తయారు చేసిన 152 మెటల్ క్యాప్సుల్స్‌‌ను ఫాల్కన్ హెవీ నింగిలోకి చేర్చింది.

వాడిన బూస్టర్లే మళ్లీ వాడారు

అరబ్ శాట్–6ఏను నింగిలోకి పంపేందుకు వాడిన బూస్టర్లనే, ఈ ప్రయోగం కోసం మళ్లీ వాడారు. అరబ్ శాట్‌‌ను సక్సెస్ ఫుల్ గా ప్రవేశపెట్టిన తర్వాత రాకెట్ కు ఉన్న బూస్టర్లు తిరిగి స్పేస్ ఎక్స్ స్టేషన్‌‌కు చేరుకున్నాయి. వీటిలో తాజాగా ఇంధనాన్ని  నింపి ఈ ప్రయోగం కోసం వాడారు.

‘అఫ్ కోర్స్ ఐ లవ్ వ్యూ’కు తిరిగి రాలేదు..

24 శాటిలైట్ల ప్రయోగం బాగానే జరిగినా.. రాకెట్ లో కీలక భాగమైన ‘కోర్ సెంటర్’ తిరిగి భూమికి రాలేదు. దీని ల్యాండింగ్ కోసం అట్లాంటిక్ మహా సముద్రంలో తీరానికి 768 మైళ్ల దూరంలో స్పేస్ ఎక్స్ ‘అఫ్ కోర్స్ ఐ లవ్ వ్యూ’ డ్రోన్ షిప్ ను ఉంచింది. కానీ కోర్ సెంటర్ సముద్రంలో పడిపోయింది. స్పేస్ ఎక్స్ గత ప్రయోగంలోనూ కోర్ సెంటర్‌‌ను పొగొట్టుకుంది. ప్యాడ్ పై కోర్ ల్యాండయినా, సముద్ర అలజడికి ఒరిగి నీళ్లలో పడిపోయింది.

ఫాల్కన్ హెవీ వివరాలు

ఎత్తు: 229.6 అడుగులు

వెడల్పు:  39.9 అడుగులు

స్టేజులు: రెండు

బూస్టర్లు: రెండు

మళ్లీ వాడుకునేవి: మూడు

ఇంజన్లు: 27

మార్స్ కు తీసుకెళ్లగల పేలోడ్: 16,800 కిలోలు

లోయర్ ఎర్త్ ఆర్బిట్‌కు తీసుకెళ్ల గల పేలోడ్: 63,800 కేజీలు