నేడు(జూన్ 11) స్పేస్కు శుభాంశు శుక్లా.. సాయంత్రం 5.30కు ఫ్లోరిడా నుంచి స్పేస్ ఎక్స్ ప్రయోగం

నేడు(జూన్ 11) స్పేస్కు శుభాంశు శుక్లా.. సాయంత్రం 5.30కు ఫ్లోరిడా నుంచి స్పేస్ ఎక్స్ ప్రయోగం
  • వాతావరణం పైనే అందరి అనుమానాలు
  • రాకేశ్ శర్మ తర్వాత స్పేస్కు వెళ్లనున్న రెండో ఇండియన్గా శుక్లా

వాషింగ్టన్: భారత వాయు సేన గ్రూప్ కెప్టెన్, గగన్ యాన్ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా బుధవారం అంతరిక్షానికి బయలుదేరనున్నారు. అమెరికా ఫ్లోరిడా తీరంలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 8 గంటలకు (ఇండియన్ టైం ప్రకారం సాయంత్రం 5.30 గంటలకు) స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ఆయనతో పాటు మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లతో నింగికి దూసుకెళ్లనుంది. అయితే, ఫ్లోరిడా తీరంలో వర్షాలు, పిడుగులతోపాటు బలమైన గాలులు వీచే అవకాశాలు ఉండటంతో ప్రయోగంపై అనుమానాలు నెలకొన్నాయి.

యాక్సియోమ్ స్పేస్ కంపెనీ ‘యాక్సియోమ్–4’ పేరుతో చేపట్టిన కమర్షియల్ మిషన్​లో భాగంగా శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు వెళ్లాల్సి ఉండగా.. వివిధ కారణాల వల్ల ఈ మిషన్ ఇప్పటికే నాలుగు సార్లు వాయిదా పడింది. ఆదివారం జరగాల్సిన ప్రయోగాన్ని ప్రతికూల వాతావరణం కారణంగా మంగళవారానికి వాయిదా వేశారు. ఫ్లోరిడా ప్రాంతంలో మంగళవారం కూడా వాతావరణం సరిగ్గా ఉండదన్న అంచనాలతో ప్రయోగాన్ని బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు నాసా సోమవారం ప్రకటించింది.

తాజాగా బుధవారం సాయంత్రం యాక్సియోమ్–4 మిషన్ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఒకవేళ ఆఖరి నిమిషంలో మళ్లీ ప్రయోగం వాయిదా పడితే, గురువారం ఉదయం ప్రయోగించే అవకాశం ఉందని యాక్సియోమ్ స్పేస్ కంపెనీ మిషన్ సర్వీసెస్ చీఫ్ అలెన్ ఫ్లింట్ వెల్లడించారు.

అయితే, ఈ మిషన్లో స్పేస్ఎక్స్ కంపెనీ ఫాల్కన్ 9 రాకెట్, క్రూ డ్రాగన్ మాడ్యూల్​ను వినియోగిస్తుండగా.. రాకెట్ బూస్టర్లో ఆక్సిజన్ లీకేజీని గుర్తించినట్టు స్పేస్ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ విలియమ్ గెర్ స్టెన్మీర్ వెల్లడించారు. అలాగే రాకెట్ దిశను మార్చేందుకు కీలకమైన థ్రస్ట్ వెక్టర్ కంట్రోల్ పరికరంలో కూడా సమస్య ఉందన్నారు. ఈ రెండింటినీ మంగళవారం సాయంత్రంలోగా సరి చేస్తామని తెలిపారు. ఈ మిషన్ సక్సెస్ అయితే రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షానికి వెళ్లిన రెండో భారతీయుడిగా శుక్లా చరిత్రకెక్కనున్నారు.