
- ఐఏఎఫ్ చీఫ్‌కు విమానం అప్పగించిన స్పెయిన్ కంపెనీ
- మొత్తం 56 విమానాల కోసం రూ. 21 వేల కోట్ల డీల్
- 40 ప్లేన్లు వడోదరలో తయారీ
సెవిల్లే (స్పెయిన్) : భారత వాయుసేనకు స్పెయిన్ కంపెనీ ఎయిర్ బస్ నుంచి తొలి సీ295 సైనిక రవాణా విమానం అందింది. బుధవారం స్పెయిన్ లోని సెవిల్లేలోని కంపెనీ ఎయిర్ బేస్‌లో జరిగిన కార్యక్రమంలో ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధురి చేతికి అధికారికంగా ప్లేన్‌ను అప్పగించారు. ఈ సందర్భంగా విమానంలో ఐఏఎఫ్ చీఫ్ కొద్దిసేపు ప్రయాణించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వాయుసేన చరిత్రలో ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఈ విమానాలతో దేశ రక్షణ రంగం మరింత పటిష్టం అవుతుందన్నారు. సీ295 విమానం శుక్రవారం స్పెయిన్ నుంచి ఇండియాకు బయలుదేరనుందని తెలిపారు.
40 ప్లేన్ ల తయారీ వడోదరలోనే..
ఆరు దశాబ్దాల నాటి అవ్రో–748 రవాణా విమానాల స్థానంలో ప్రవేశపెట్టేందుకు సీ295 ప్లేన్లను వాయుసేన సమకూర్చుకుంటోంది. మొత్తం 56 ప్లేన్ల కొనుగోలు కోసం ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ కంపెనీతో రెండేండ్ల క్రితం ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 2025 కల్లా16 ప్లేన్లను స్పెయిన్‌లో, మిగతా 40 ప్లేన్లను 2026 నుంచి గుజరాత్‌లోని వడోదరలో తయారు చేస్తారు. వడోదరలో వీటి తయారీని టీఏఎస్ఎల్ కంపెనీ చేపట్టనుంది.
ALSO READ: 1టీబీ హార్డ్‌డిస్క్‌తో టెక్నో మెగాబుక్టీ1
హైదరాబాద్ నుంచి విడిభాగాలు
వడోదరలోని టాటా ప్లాంట్ 2024 నవంబర్ లో ప్రారంభం కానుంది. అక్కడ తయారు చేసే సీ295 విమానాలకు హైదరాబాద్ లోని మెయిన్ కాన్ స్టిట్యూయెంట్ అసెంబ్లీ (ఎంసీఏ) నుంచి విడిభాగాలు సరఫరా కానున్నాయి. మొత్తంగా 2031 కల్లా మొత్తం 56 సీ295 విమానాలు వాయుసేనకు అందనున్నాయి. వడోదరలో మిలిటరీ ట్రాన్స్ పోర్ట్ విమానాల తయారీ ప్రారంభమైతే.. దేశంలో ఇదే తొలి సైనిక రవాణా విమానాల తయారీ సంస్థ కానుంది.
ప్రాజెక్టు పూర్తయ్యాక ప్రపంచంలో అత్యధికంగా సీ295 ప్లేన్లను కలిగి ఉన్న దేశంగా ఇండియా నిలవనుంది. కాగా, సీ295 ప్లేన్లలో ఒకేసారి 71 మంది జవాన్లను లేదంటే 50 మంది పారాట్రూపర్లను సరిహద్దులకు తరలించ వచ్చు.