
- .కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు స్పీకర్ గడ్డం ప్రసాద్ వినతి
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా పాస్ చేసి, రాష్ట్రపతికి పంపిన బీసీ రిజర్వేషన్ల బిల్లులను ఆమోదించేలా కృషి చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కోరారు. ఆదివారం ఢిల్లీ అసెంబ్లీలో ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ముందుగా అమిత్ షాను స్పీకర్ గడ్డం ప్రసాద్ శాలువాతో సన్మానించారు. అనంతరం కాసేపు ముచ్చటించారు. తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల గురించి ప్రస్తావించారు.
ఓబీసీలకు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే రెండు బిల్లులను తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిందని అమిత్ షాకు వివరించారు. ఈ బిల్లులను గవర్నర్ కు పంపగా, గవర్నర్ కార్యాలయం రాష్ట్రపతి ఆమోదం కోసం ఢిల్లీకి పంపినట్లు తెలిపారు. అయితే నాలుగు నెలలు గడుస్తున్నా, ఈ బిల్లులు ఆమోదం పొందలేదని గుర్తు చేశారు. దీనివల్ల లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణకు అడ్డంకిగా మారిందన్నారు. ఈ విషయంలో చొరవ చూపి, బీసీలకు మేలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపేలా కృషి చేయాలని రిక్వెస్ట్ చేశారు. ఈ విజ్ఞప్తిపై అమిత్ షా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.
ఓం బిర్లా విందుకు హాజరైన స్పీకర్..
పార్లమెంట్ ప్రాంగణంలోని ఎన్ఎక్స్ లో ఆదివారం ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్ ప్రతినిధులకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా విందు ఇచ్చారు. కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు, మండలి చైర్మన్లు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ విందులో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు హాజరయ్యారు. అలాగే ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఇచ్చిన విందులోనూ తెలంగాణ స్పీకర్ బృందం పాల్గొన్నది.