పార్టీలకో చావో రేవోగా మారిన ఎన్నికలు

V6 Velugu Posted on Jan 13, 2022

కీలకమైన ఉత్తరప్రదేశ్​తోపాటు మరో నాలుగు రాష్ట్రాలకు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో చాలా మంది నేషనల్ లీడర్ల పొలిటికల్​ ఫ్యూచర్​ తేలనుంది. ముఖ్యంగా కాంగ్రెస్​ పార్టీ వారసులకు ఇవి డూ ఆర్​ డై ఎన్నికలుగా మారనున్నాయి. ఎందుకంటే.. కాంగ్రెస్​ చరిత్రలోనే అత్యంత కఠినమైన ఎన్నికలు ఇప్పుడు ఎదురయ్యాయి. ఎలక్షన్లు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాలో వారు ఓడిపోవచ్చు. ఇక ఉత్తరప్రదేశ్​ విషయానికి వస్తే, అక్కడ ప్రియాంకాగాంధీ వాద్రా చాలా కాలం నుంచి యాక్టివ్​గా ఉన్నారు. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం యూపీలో కాంగ్రెస్​ సీట్ల సంఖ్యను 7 నుంచి కనీసం 25కు ప్రియాంక చేర్చలేకపోతే అప్పుడు పార్టీ పరిస్థితి మరింత దిగజారే అవకాశాలున్నాయి.

పంజాబ్​ విషయంలో కాంగ్రెస్​ పార్టీ పూర్తిగా నవ్వులపాలైంది. పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, ముఖ్యమంత్రి చరణ్‌‌జిత్ సింగ్ చన్నీతో అన్ని విషయాల్లో విభేదిస్తూ వస్తున్నారు. అమరీందర్​సింగ్​ నుంచి ఇటీవల పార్టీ పగ్గాలు చేపట్టిన చన్నీ. మళ్లీ పార్టీ అధికారంలోకి వస్తే ఆయనను పార్టీ సీఎం సీటులో కొనసాగనిస్తుందో లేదో అనే అనిశ్చితి నెలకొంది. గతంలో అయితే కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, అకాలీదళ్, బీజేపీ కూటమి మరోవైపు అధికారం కోసం పోటీ పడేవి. కానీ ఇప్పుడు కాంగ్రెస్​ పార్టీకి అదనంగా అమరీందర్​సింగ్​ నేతృత్వంలోని పంజాబ్ లోక్​ కాంగ్రెస్, బీజేపీ కూటమి, అకాలీదళ్, బీజేపీ కూటమి, సంయుక్త్ కిసాన్​ మోర్చా, ఆప్​ బరిలో నిలుస్తున్నాయి. అమరీందర్​సింగ్​ను పార్టీ నుంచి వెళ్లగొట్టిన తర్వాత కాంగ్రెస్​ పార్టీలో నాన్​ సీరియస్​ ప్లేయర్లు మాత్రమే మిగిలారు. వారు ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు తప్ప ప్రభుత్వ పాలనపై గానీ, పార్టీ ఎన్నికల వ్యూహాలపైగానీ దృష్టి పెట్టడం లేదు. వీటికి తోడు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోడీ టూర్​ సందర్భంగా చన్నీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు కాంగ్రెస్​ పార్టీ ఇమేజ్​ను దారుణంగా దెబ్బతీసింది.
ఆప్​కే ఎక్కువ అవకాశాలు
ఈసారి హంగ్​ ఏర్పడే అవకాశం ఉందని ఒపీనియన్​ పోల్స్​ అంచనా వేస్తున్నాయి. అన్ని పార్టీలకంటే ఆప్​ ముందంజలో ఉంది. పంజాబ్​లో ప్రచారాన్ని ఆప్​ చాలా రోజుల ముందే ప్రారంభించింది. ఇప్పటికే చాలా సభలు, కార్యక్రమాలను నిర్వహించింది. దీంతో ఇటీవలి చండీఘర్​ మున్సిపల్​ ఎలక్షన్స్​లో అద్భుతమైన ఫలితాలు సాధించింది. పంజాబ్​లో బీజేపీ ప్రధాన పార్టీ కాదు. అమరీందర్​ కొత్తగా పార్టీ పెట్టడంతో ఆయన వెంట పంజాబీలు ఎంత వరకు నడుస్తారనేది ఇప్పుడే చెప్పలేం. కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదికి పైగా ఆందోళనలు చేసిన సంయుక్త కిసాన్​మోర్చా వైపు ప్రజలు మొగ్గుచూపే అవకాశం ఉంది. 

గోవా, గుజరాత్​పై ఆప్​ ఫోకస్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆయన పార్టీ ఆప్​కు పంజాబ్​తో పాటు గోవాపైనా చాలా ఆశలే ఉన్నాయి. ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్న గుజరాత్ పైనా ఆప్​ ఫోకస్​ పెట్టింది. ఆప్​తో పాటు మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్​కాంగ్రెస్​ కూడా గోవాలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. కేజ్రీవాల్, మమత మంచి స్నేహితులు. గోవాలో ఈ రెండు పార్టీలు ఒకదానిపై మరొకటి పోటీ చేస్తున్నాయి. వాస్తవానికి గోవాలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే. అయితే ఆప్, టీఎంసీ పోటీ చేయడంతో సెక్యులర్​ ఓట్లు చీలిపోయి.. బీజేపీకి మేలు జరిగే అవకాశం ఉంది. పొలిటికల్​ స్ట్రాటజిస్ట్​ ప్రశాంత్​ కిశోర్, చాలా కాలంగా గోవాలో మమతా బెనర్జీ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు. ఈ రెండు ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ పాపులారిటీ దెబ్బతినడంతో ఆ ప్లేస్​ను ఆక్యుపై చేయాలనేది ఈ పార్టీల ప్రయత్నం.

ఉత్తరాఖండ్​లో దెబ్బతీసిన కుమ్ములాటలు
పంజాబ్,​ ఉత్తరాఖండ్ లో పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే, ఆ రాష్ట్రాల ప్రజలు ప్రతిసారి ఆల్టర్​నేట్​ గవర్నమెంట్​కు అవకాశం ఇస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీకి మళ్లీ మరోసారి చాన్స్​ ఇవ్వడం లేదు. అయితే, ఉత్తరాఖండ్​లో, ఇప్పటి వరకు వచ్చిన ఒపీనియన్​ పోల్స్​ ప్రకారం, బీజేపీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈసారి అధికారంలోకి వస్తామని కలలు కంటున్న కాంగ్రెస్​ పార్టీ నాయకులకు ఇది మింగుడుపడని విషయమే. గత ఐదేండ్లలో బీజేపీ ఇద్దరు ముఖ్యమంత్రులను మార్చినా కూడా ఇప్పటికీ ఆ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్​ కు చాన్స్​ ఇవ్వడానికి వెనుకాడుతున్నారు. ఇందుకు ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలే కారణం. తాజాగా ఉత్తరాఖండ్​లో కాంగ్రెస్​ ముఖ్యమంత్రి అభ్యర్థి హరీశ్​రావత్.. పార్టీ హైకమాండ్​ తనను పట్టించుకోవడం లేదంటూ ఎన్నికల ప్రచారాన్ని పక్కనపెట్టేశారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్​ పూర్తిగా ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఇక్కడ ఆ పార్టీని ప్రజలు రిజెక్ట్​ చేయడంలో ఆశ్చర్యం కలిగించేది ఏమీ లేదు.

పూర్తిగా సోషల్​ మీడియా ప్రచారమే
కరోనా కారణంగా ఎలక్షన్​ కమిషన్​ పొలిటికల్​ ర్యాలీలు, సభలపై నిషేధం విధించడంతో తొలిసారిగా ఎన్నికల ప్రచారం సోషల్​మీడియా, వర్చువల్​ కాన్ఫరెన్స్​ల ద్వారా సాగనుంది. ఈ విషయంలో మిగతా పొలిటికల్​ పార్టీలకంటే బీజేపీ ఒకడుగు ముందే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ పార్టీ రీచ్, పరిధి ఎక్కువ. అయితే గత ఐదేండ్లలో రాజకీయ పార్టీల పనితీరు, వాటి భావజాలం ఈసారి కీలకపాత్ర వహించే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం, మత సామరస్యం, కరోనా సంక్షోభాన్ని ప్రభుత్వం ఎలా ఎదుర్కొంది, జాతీయ భద్రత, శాంతిభద్రతలు, మహిళల సాధికారత, యువత ఉపాధి మొదలైన ప్రజల ఆలోచనలను ప్రభావితం చేసే అంశాలు. ఆఖరి నిమిషంలో ప్రచారం చేయడం వల్ల పెద్దగా తేడా ఏమీ రాదు. చాలా మంది భారతీయులకు, ముఖ్యంగా ఉన్నతవర్గాలకు ఎన్నికలు అంత ముఖ్యమైనవి కాకపోయినప్పటికీ, రాజకీయ నాయకులు, వారి భవిష్యత్తుకు ఇవి ఎంతో కీలకం. ప్రధాని మోడీ చరిష్మా చెక్కుచెదరకుండా ఉందా లేదా? ఆయన ప్రజాదరణ కోల్పోతున్నారా? ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పనితీరు ప్రజలను మెప్పించిందా? లేదా ఆయన పాలనలో విఫలమయ్యారా? అనేది ఈ అసెంబ్లీ ఎన్నికల ద్వారా వెల్లడవుతుంది. తమ రాష్ట్రాలకు వెలుపల ప్రభావం చూపాలని భావిస్తున్న కేజ్రీవాల్, మమతాబెనర్జీ పాపులారిటీకి కూడా ఈ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. 

తేలనున్న గాంధీల భవితవ్యం
కాంగ్రెస్​ పార్టీ లీడర్లు రాహుల్, ప్రియాంక భవితవ్యాన్ని ఈ ఎన్నికలు తేల్చనున్నాయి. ఒకవేళ ఉత్తరాఖండ్​లో బీజేపీని ఓడించలేకపోయినా, పంజాబ్, గోవా, మణిపూర్​లో సరైన ప్రభావం చూపించలేకపోయినా, వారిని సొంత పార్టీ నుంచే బయటకు పంపించే పరిస్థితులు ఏర్పడవచ్చు. కాంగ్రెస్​ రెబల్​ లీడర్లు, జీ23 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ ఓటమి కోసమే ఎదురుచూస్తున్నారు. అదే జరిగితే రాహుల్​ ప్లేస్​లో గాంధీ కుటుంబానికి చెందని బయటి వ్యక్తికి కాంగ్రెస్​ ప్రెసిడెంట్​గా​ చేయాలన్న వారి ప్రయత్నం సులువవుతుంది. కాంగ్రెస్​ ప్రెసిడెన్షియల్​ ఎలక్షన్లు సెప్టెంబర్​లో జరగనున్నాయి. ఒక బలమైన అభ్యర్థిని రాహుల్​కు వ్యతిరేకంగా బరిలోకి దించితే.. కాంగ్రెస్ పార్టీ నుంచి గాంధీ ఫ్యామిలీని తప్పించగలుగుతారు. పార్టీని ఐక్యంగా ఉంచడానికి గాంధీలు మార్గనిర్దేశం చేసే శక్తిగా ఉన్నారు. అయితే, గాంధీలు తామే ఎన్నికల్లో గెలవలేకపోతే, పార్టీ కార్యకర్తలకు ఆ కుటుంబాన్ని దాటి వెళ్లడం తప్ప వేరే మార్గం లేదు. ఇప్పటికే సీనియర్​ లీడర్లు గాంధీ వారసుల పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారు. వీరిని తిరస్కరించేందుకు కొందరు నేతలు నిక్కచ్చిగా వ్యవహరిస్తుండగా, మరికొందరు మాత్రం ఇప్పటి వరకు ఓపికగా ఉన్నారు. అయితే పార్టీ అస్థిత్వమే కాకుండా వ్యక్తిగత కెరీర్ కూడా పణంగా పెట్టాల్సి రావడంతో వారిలో సహనం నశిస్తోంది. జ్యోతిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాద్, హిమంత బిస్వశర్మ మాదిరిగానే కాంగ్రెస్​ను సులువుగా విడిచిపెట్టవచ్చు.

ఎన్నికల తర్వాత ఆసక్తికర పరిణామాలు
కాంగ్రెస్​ పార్టీ వరకు ఎన్నికల తర్వాత పరిస్థితులు కూడా ఆసక్తికరంగా మారనున్నాయి. చాలా రాష్ట్రాల్లో పరాజయంతో ఒక వైపు రాహుల్ గాంధీ, మరోవైపు రెబెల్స్ నిలిచి పార్టీ రెండుగా చీలిపోయే అవకాశం ఉంది. లేదంటే రాహుల్ గాంధీ ఎట్టకేలకు కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అంగీకరిస్తే పార్టీ నేతలు అందరూ మళ్లీ లైన్​లో పడతారు. రాహుల్​గాంధీ  2 సంవత్సరాలకు పైగా ఆ బాధ్యతలు చేపట్టడంపై సందిగ్ధంలో ఉన్నారు. ఇది పార్టీ క్యాడర్, నాయకులపై చాలా ఒత్తిడి పెంచుతోంది. ఇక్కడ మూడో ఆప్షన్​ కూడా ఉంది. ఒకవేళ రాహుల్​ బాధ్యతలు చేపట్టడానికి ముందుకు రాకపోతే, అప్పుడు సోనియాగాంధీ.. ప్రియాంకాగాంధీకి ఆ బాధ్యతలను అప్పగించవచ్చు. సోనియాగాంధీ, రాహుల్​గాంధీ కంటే కూడా ప్రస్తుతం కాంగ్రెస్​ లీడర్లు, కార్యకర్తలు ప్రియాంక పైనే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. ఆమె తమ పార్టీని కష్టాల నుంచి గట్టెక్కిస్తుందని ఆశిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఇవి కాంగ్రెస్​ పార్టీకి డూ ఆర్​ డై ఎన్నికలుగా కనిపిస్తున్నాయి.

Tagged Bjp, Congress, Assembly Elections, AAP, five state elections

Latest Videos

Subscribe Now

More News