విశ్లేషణ: అజాత శతృవు రోశయ్య

విశ్లేషణ: అజాత శతృవు రోశయ్య

విలువలతో కూడిన రాజకీయాలు చేసిన వారిలో రోశయ్య బహుశా ఆఖరితరం మనిషి కావచ్చు. 88 ఏండ్ల నిండు జీవితంలో పార్టీలకు అతీతంగా అందరి మన్ననలు పొందిన అజాత శత్రువు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నా కండువా మార్చని రాజకీయ నాయకుడు. ఆజానుబాహుడు, కంచు కంఠం, తెలుగుదనం ఉట్టిపడే పంచెకట్టు రోశయ్య సొంతం. రాజకీయ చాతుర్యం ఆయన స్వార్జితం, సామాజిక అంశాల్లో నిగూఢమైన మేధావి, ఆర్థికవేత్త కాకున్నా, క్రమశిక్షణ గల పొదుపరైన వ్యాపారి. ప్రజాప్రతినిధిగా, మంత్రిగా, సీఎంగా, గవర్నర్ గా ఏ హోదాలో ఉన్నా విలువలను వదలని వ్యక్తి రోశయ్య. ఆయన మరణం కాంగ్రెస్​ పార్టీకే కాదు.. తెలుగు రాజకీయాలకు తీరని లోటే. 

తెలుగు ప్రజలు ఒక గొప్ప నాయకుని కోల్పోయారు. ఆజానుబాహుడు, మాటల మాంత్రికుడు, ఖద్దరు పంచెకట్టు భుజంపై ఉత్తరీయంతో తెలుగుదనం ఉట్టిపడేలా ఉండే రాజకీయ దురంధరుడు, సీనియర్ రాజకీయ వేత్త, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మజిలీలు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి సన్నిహితంగా ఉండేవారు. ఆయన మరణం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ ఎక్కువ కాలం ఆ పదవిలో కొనసాగలేకపోయారు. తర్వాత కర్నాటక, తమిళనాడు గవర్నర్‌‌‌‌గానూ సేవలందించారు. చిన్నప్పటి నుంచి కూడా రోశయ్యలో నాయకత్వ లక్షణాలు ఎక్కువ. గుంటూరులో చదువుతున్న సమయంలోనే విద్యార్థి నాయకుడిగా ఎన్నికయ్యారు.
ఒక శకం ముగిసింది
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలకమైన నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందిన రాజకీయ దురంధరుడు కొణిజేటి రోశయ్య. విద్యార్థి ఉద్యమాల నుంచి గవర్నర్‌‌‌‌‌‌‌‌ దాకా అనేక పదవులను సమర్థంగా నిర్వహించి అన్నిచోట్లా తన విధులకు న్యాయం చేశారు. ప్రజల నాయకుడిగా ప్రాంతాలకు అతీతంగా తన విలువ నిలబెట్టుకున్నారు. హోదా ఉన్నా, లేకున్నా.. సంస్కృతి, సంప్రదాయాలు, తెలుగు భాష పరిరక్షణకు విశేషంగా కృషి చేశారు. తెలుగునేల నాలుగు చెరగులా ఎక్కడ సంగీత, సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినా వీలున్నప్పుడల్లా హాజరవుతూ సాంస్కృతిక రంగానికి తగిన ప్రాధాన్యం ఇచ్చారు.

స్వతంత్ర పార్టీ నుంచి రాజకీయ జీవితం
కాంగ్రెస్ పార్టీకి అత్యంత విధేయుడిగా పేరుగాంచిన రోశయ్య రాజకీయ జీవితం ఆ పార్టీతో ప్రారంభం కాలేదు. తొలుత ఆయన స్వతంత్ర పార్టీ సభ్యుడిగా ఉన్నారు. దివంగత ఆచార్య ఎన్జీ రంగా అంటే ఆయనకు అంతులేని అభిమానం. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. రోశయ్య 1968, 1974, 1980, 2009లో ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. 1989, 2004లో చీరాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతేకాదు 1998లో నరసరావుపేట లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. సుదీర్ఘకాలం ఆర్థికమంత్రిగా అనుభవం ఉన్న రోశయ్య 15 సార్లు అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌‌‌‌ను ప్రవేశపెట్టారు. ఇందులోనూ వరుసగా ఏడుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఆయనది. ముఖ్యమంత్రులు మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయ భాస్కరరెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆయన వేర్వేరు మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. అసెంబ్లీలో ఆయన ప్రసంగాలు సందర్భోచితంగా ఉండేవి. తనదైన శైలిలో విసిరే చెణుకులతో ప్రతిపక్షాలను ఇరుకున పెట్టేవారాయన.

పదవులకే వన్నె తెచ్చారు
1994 నుంచి 1996 వరకు ఏపీసీసీ అధ్యక్షుడిగా రోశయ్య వ్యవహరించారు. 1978--–79లో శాసనమండలిలో ప్రతిపక్ష నేతగానూ ఆయన వ్యవహరించారు. తన రాజకీయ జీవితంలో ఆర్ అండ్ బీ, హౌసింగ్, రవాణా, హోం, ఆర్థిక, ప్రణాళిక, సభావ్యవహారాల శాఖల మంత్రిగా బాధ్యతలను నిర్వహించారు. దాదాపు 60 ఏండ్ల పాటు ఆయన రాజకీయ జీవితం సాగింది. 2007లో ఆంధ్రా యూనివర్సిటీ ఆయనను గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 15వ ముఖ్యమంత్రిగా 2009 సెప్టెంబర్ 3 నుంచి 2010 నవంబర్ 24 వరకు రోశయ్య బాధ్యతలను నిర్వహించారు. అనారోగ్య కారణాలతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు గవర్నర్ గా సేవలు అందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన రోశయ్య పాలనాదక్షుడిగా, ఆర్థికవేత్తగా పేరుగాంచారు. అజాతశత్రువుగా ఆయన రాష్ట్రానికి  చేసిన సేవలు చిరస్మరణీయం.

మహామహులకు దీటుగా..
జాతీయ నాయకుల బహిరంగ సభల ప్రసంగాలను అలవోకగా తేటతెలుగులో అనువదించి ప్రశంసలందుకున్న రాజకీయ చతురుడు రోశయ్య. ఒక తెన్నేటి, లచ్చన్న, పుచ్చలపల్లి, జొన్నలగడ్డ, వావిలాల, పిల్లలమర్రి, జూపూడి, మన్నవ, టీఎస్ రామారావు, వీ రామారావు, కాసు, చెన్నారెడ్డి, కోట్ల, భవనం, ఎన్టీఆర్​ స్థాయిలో మహోన్నతుడు రోశయ్య. వారికి దీటుగా రాజకీయాలు నడిపారు. వీటన్నిటికీ మించి నాయకులు గోగినేని రంగా(ఎన్జీ రంగా) ఆత్మీయ అనుచరుడు. జాతీయ స్థాయిలో నెహ్రూ నుంచి నిన్నటి తరం కాంగ్రెస్ నాయకుల వరకు అందరితోనూ ఆయనకు సాన్నిహిత్యం. సమైక్యవాది అయినా పార్టీ నిర్ణయానికి కట్టుబడి నిలిచారు. పాత్రికేయ గురుతుల్యులు నరిసెట్టి ఇన్నయ్య, తుర్లపాటి కుటుంబరావు, రాఘవాచారి, పొత్తూరి.. మొదలైన వారికి ప్రియమిత్రుడు. మీడియా ప్రతినిధులతో 60 ఏండ్లుగా ఆయన సన్నిహిత సంబంధాలు నెరిపారు. వారితో చనువుగా, స్వేచ్ఛగా మెలిగేవారు. గుంటూరు జిల్లా వేమూరులో 1933 జులై 4న రోశయ్య జన్మించారు. ఆయనది మధ్యతరగతి కుటుంబం. గుంటూరు హిందూ కాలేజీలో కామర్స్ విద్యను అభ్యసించారు. 1950లో శివలక్ష్మిని రోశయ్య పెండ్లాడారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 2021 డిసెంబర్​ 4న అనారోగ్యంతో కన్నుమూశారు.

మచ్చలేని నాయకుడిగా..
రాజకీయ జీవితం ఆద్యంతం ఉన్నత విలువలకు కట్టుబడి ఉండటం రోశయ్య గొప్పదనం. ఎక్కడా అవినీతి మచ్చలేని నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తనకు ఎంతో ఇష్టమైన ఆర్థిక శాఖకు మంత్రిగా సుదీర్ఘకాలం పాటు సేవలందించారు. విలువలతో కూడిన రాజకీయాలు చేసిన వారిలో రోశయ్య బహుశా ఆఖరితరం మనిషి కావచ్చు. వయోభారం ఉన్నప్పటికీ చివరి వరకూ, ఎవరు వచ్చి అడిగినా వారికి తగిన సలహాలను ఇచ్చేవారు. ప్రతిపక్షాన్ని వంగ్యోక్తులతో సుతిమెత్తగా ఎండగట్టడంలో ఆయన మేటి. నిజాయితీకి ఆయన నిలువెత్తు రూపం. గ్రూపు విభేదాలు, ముఠా తగాదాలతో నిత్యం తలమునకలయ్యే కాంగ్రెస్​లో గ్రూపులు లేకుండా తామరాకుపై నీటిబొట్టు మాదిరి, ఏ మకిలీ అంటకుండా ఇన్ని దశాబ్దాలు వివాదరహితునిగా నెగ్గుకురావడం సామాన్యమైన విషయం కాదు. ఏ కాంగ్రెస్  ముఖ్యమంత్రి దగ్గరైనా నెంబర్ టు గానే రోశయ్య ఉన్నారు. ఆయనెప్పుడూ ఏ పదవినీ ఆశించ లేదు. ఏ పదవి ఆయన్ని వరించినా పొంగిపోనూ లేదు. తనకు 
లభించిన పదవికి ఆయన న్యాయం చేశారు. ఏ అవినీతి ఆరోపణ ఆయన్ని చుట్టుముట్ట లేదు.
- తిరుమలగిరి సురేందర్, ప్రెస్​ అకాడమీ మాజీ చైర్మన్