భారత క్రికెట్‌కి లభించిన గొప్ప యోధుడు యువరాజ్ సింగ్

భారత క్రికెట్‌కి లభించిన గొప్ప యోధుడు యువరాజ్ సింగ్

భారత క్రికెట్‌కి లభించిన గొప్ప పవర్ హిట్టర్, ఆల్‌ రౌండర్, ఫీల్డర్. రెండు వరల్డ్ కప్‌లు (2007 టీ20, 2011 వన్డే) గెలవడంలో కీలక పాత్ర పోషించిన వీరుడు. దాదాపు రెండు దశాబ్ధాలపాటు క్రికెట్‌కి తన సేవలు అందించిన సిక్సర్ కింగ్. క్యాన్సర్ కబలిస్తున్నా ఒంటిచేత్తో మ్యాచ్‌ని గెలిపించిన వారియర్... నేటితో 41 ఏండ్లు పూర్తి చేసుకున్నాడు. 

1981, డిసెంబర్ 12న చండీగఢ్‌లో జన్మించిన యూవీ, 2000, అక్టోబర్ 3న కెన్యాపై తన మొదటి వన్డే మ్యాచ్ ఆడాడు. తర్వాత 2003, అక్టోబర్ 16న న్యూజిలాండ్‌తో టెస్ట్‌ల్లో అరంగ్రేటం చేశాడు. 

తన అంతర్జాతీయ కెరీర్‌‌లో 402 మ్యాచ్‌లు ఆడిన యూవీ, 11 వేలకు పైగా పరుగులు చేశాడు. అందులో 17 సెంచరీలు, 71 అర్థ సెంచరీలు ఉన్నాయి. ఈ క్రమంలో యువరాజ్ సింగ్ నెలకొల్పిన రికార్డులు అనేకం.

2007 దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో యువరాజ్‌ సింగ్ ఒక ఓవర్‌‌లో ఏకంగా 6 సిక్స్‌లు కొడతాడు. స్టువర్ట్ బ్రాడ్ వేసిన 19వ ఓవర్లో ఈ ఫీట్ అందుకుంటాడు. అప్పటివరకు ఎవరు రాయని రికార్డ్‌లను యువీ తన పేరిట రాయించాడు. ఆ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో 36 పరుగులతో పాటు, టీ20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని (12 బంతుల్లో) సాధించాడు.

యువరాజ్‌ని బిగ్ మ్యాచ్ ప్లేయర్ అంటారు. ఎందుకంటే ఐసీసీ ఈవెంట్ ఏదైనా రెచ్చిపోయి ఆడటం యూవీనైజం. 2000లో ఆడిన అండర్ 19 వరల్డ్ కప్‌లో అయినా, 2007లో ఆడిన టీ20 వరల్డ్ కప్‌లోనైనా యూవీ ఒంటి చేత్తో గెలిపించిన మ్యాచ్‌లు ఎన్నో. యూవి ఆటకు  సాక్ష్యం 2011 వరల్డ్ కప్‌. ఈ టోర్నీ మొత్తంలో క్యాన్సర్‌‌తో పోరాడుతూనే 362 పరుగులు చేయడంతో పాటు 15 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచాడు.

7 ఐసీసీ ఫైనల్స్ ఆడిన ఏకైక ప్లేయర్, అతిచిన్న వయసులో (18) ప్రపంచకప్ టోర్నీలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ గెలుచుకున్న తొలి భారత ఆటగాడు, ఒక టోర్నీలో 4 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకుంది యూవీనే.

ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్, పుణె వారియర్స్ ఇండియా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్‌‌డెవిల్స్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లో రెండు సార్లు హ్యాట్రిక్ వికెట్లు తీసిన ఘనత కూడా యూవీ సొంతం. 

క్యాన్సర్‌‌ని జయించి తిరిగి బ్యాట్ పట్టినప్పటికీ మునుపటి ఫామ్‌ని అందుకోని యువరాజ్‌కి అవకాశాలు రావడం నెమ్మదిగా తగ్గిపోయాయి. దాంతో 2017లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన యూవీ, 2019లో  క్రికెట్‌కి గుడ్‌ బై చెప్పాడు.