వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : రాజర్షి షా

వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : రాజర్షి షా

మెదక్ టౌన్, వెలుగు : చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని మెదక్​కలెక్టర్​రాజర్షి షా పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్​లో ఎఫ్ఎల్ఎస్, ఉన్నతి, లక్ష్య కార్యక్రమాలపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలని, దీని కోసం  లక్ష్యలో నిర్ధేశించిన కార్యక్రమాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నారు. 

పదో తరగతి విద్యార్థులకు జనవరి నుంచి ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. పోషకుల సమావేశంలో విద్యార్థుల ప్రగతిపై  చర్చించాలన్నారు. విద్యార్థులు పాఠశాలకు రోజూ హాజరయ్యేలా హెడ్​మాస్టర్లు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఉన్నతి, తొలిమెట్టు కార్యక్రమాల అమలుపై ఎంఈవోలు, మండల నోడల్ అధికారులు, సీపీడీ టీమ్​సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించి క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమాలు సక్రమంగా అమలయ్యేందుకు కలెక్టర్​రాజర్షి షా పలు సూచనలు చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి ప్రొఫెసర్ రాధాకిషన్, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ సుదర్శన్ మూర్తి, ఎంఈవోలు నీలకంఠం, బుచ్చానాయక్ తదితరులు పాల్గొన్నారు.