
- డ్రగ్స్ సప్లయర్లుగా మారిన కొందరు ఆఫ్రికన్లు
- గతేడాది డ్రగ్స్ కేసుల్లో 15 మంది అరెస్ట్
హైదరాబాద్, వెలుగు: సిటీలో సైబర్ క్రైమ్స్, డ్రగ్స్ నివారణ కోసం గ్రేటర్ పోలీసులు యాక్షన్ ప్లాన్ షురూ చేశారు. కొత్తగా ఏర్పాటైన సైబర్ సెక్యూరిటీ బ్యూరో, యాంటీ నార్కొటిక్స్ బ్యూరో సిబ్బందితో స్పెషల్ యాక్టివిటీస్‌కు ప్లాన్ చేస్తున్నారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ దందాలో నైజీరియన్లు కీలకంగా మారుతుండటంతో వారిపై నిఘా పెట్టారు. సూడాన్, కెన్యా, సోమాలియా, యెమన్, పాకిస్తాన్‌కు చెందిన కొందరు సిటీలో షెల్టర్ తీసుకుంటున్నట్లు గుర్తించారు. స్టూడెంట్, బిజినెస్, విజిటింగ్, హెల్త్ వీసాలపై వచ్చి ఉంటున్న నైజీరియన్లతోపాటు ఇతర దేశాల వారి వివరాలు సేకరిస్తున్నారు.వారు ఏం చేస్తున్నారనే విషయాలను స్పెషల్ బ్రాంచ్‌లోని ప్రత్యేక విభాగం డేటా సేకరిస్తోంది.
గోవా, ముంబయి డ్రగ్స్ గ్యాంగ్‌లతో లింక్స్
పబ్స్‌తో పాటు సిటీలో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడ్డా నైజీరియన్ల కాంటాక్ట్స్ బయటపడుతున్నాయి. గోవా, ముంబయిలోని నెట్‌వర్క్‌తో నైజీరియన్లు సంబంధాలు పెంచుకొని, అక్కడి నుంచి గుట్టుగా సిటీకి డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. సిటీలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో ప్రధాన డ్రగ్ సప్లయర్ టోనీ కూడా నైజీరియనే. గోవాకు చెందిన మోస్ట్ వాంటెడ్ సప్లయర్ఎడ్విన్ను నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కొద్దిరోజుల క్రితం అరెస్ట్ చేసి, వీరిపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపించారు. లోకల్ నెట్‌వర్క్‌లో బెంగళూర్, గోవా, ఢిల్లీలోని డ్రగ్స్ ముఠాలకు నైజీరియన్లు కొరియర్లుగా మారినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. విజిటింగ్ వీసాలు,హెల్త్, టూరిస్ట్ వీసాలతో సిటీకి వచ్చే కొందరు తమ అవసరాల కోసం డ్రగ్స్ సప్లయర్స్‌గా మారుతున్నారని పోలీసులు గుర్తించారు. ఇలాంటి వారు వీసా గడువు ముగిసినా దేశం విడిచి వెళ్లకుండా నేరాలకు పాల్పడుతున్నారని పోలీస్ కేస్ రికార్డ్స్ చెబుతున్నాయి.
12 మంది నైజీరియన్లు సొంత దేశాలకు..
వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉంటూ ఇల్లీగల్ యాక్టివిటీస్‌కు పాల్పడుతున్న విదేశీయుల డేటాను స్పెషల్ బ్రాంచ్ రెడీ చేస్తోంది. గతేడాది నమోదైన 889 ఎన్‌డీపీఎస్(నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకొట్రోపిక్ సబ్స్టాన్సస్) యాక్ట్ కేసుల్లో 2,495 మందిని అరెస్ట్ చేయగా.. వారిలో15 మంది నైజీరియన్లు ఉన్నారు. దీంతో వారిలోని 12 మందిని సొంత దేశాలకు డిపోర్ట్ చేశారు. ఈ క్రమంలోనే వీసా గడువు ముగిసినా తప్పించుకు తిరుగుతున్న వారిని ట్రేస్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఇందుకోసం గ్రేటర్‌లోని మూడు కమిషనరేట్లలో ఉన్న విదేశీయుల వివరాలను రాబడుతున్నారు. ఇమ్మిగ్రేషన్, ఫారిన్ రీజనల్ రిజిస్ట్రేషన్ అధికారులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించనున్నారు.