త్వరలో దివ్యాంగుల కోసం ప్రత్యేక బస్సులు : ఆర్టీసీ ఎండీ, వీసీ సజ్జనార్

త్వరలో దివ్యాంగుల కోసం ప్రత్యేక బస్సులు : ఆర్టీసీ ఎండీ, వీసీ సజ్జనార్

బషీర్ బాగ్,  వెలుగు: దివ్యాంగుల కోసం త్వరలో ప్రత్యేక బస్సులు ప్రవేశపెట్టనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు.  నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో  బ్లైండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ లూయిస్ బ్రెయిలీ 215వ జయంతి వేడుకల్లో సజ్జనార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..   45 రోజుల్లోనే ఆర్టీసీ బస్సుల్లో  12  కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణాలు చేశారని పేర్కొన్నారు.  దివ్యాంగులకు కేటాయించిన సీట్లలో మహిళలు కూర్చుంటున్నారని దీని వల్ల వారు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 

త్వరలో 2375  కొత్త బస్సులను తీసుకుంటున్నామని దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసేలా నిర్ణయం తీసుకుంటామన్నారు.  ఆర్టీసీలో అనౌన్స్ మెంట్, ఎంక్వయిరీ విభాగాల్లోని ఉద్యోగాల్లో  బ్లైండ్స్ కు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.  అనంతరం అసోసియేషన్ బ్రెయిలీ లిపి క్యాలెండర్‌‌‌‌‌‌‌‌ను ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్, టీఎన్జీవో సంఘం కేంద్ర సంఘం జనరల్ సెక్రటరీ జగదీశ్వర్‌‌‌‌‌‌‌‌లతో కలిసి ఆవిష్కరించారు.  కార్యక్రమంలో బ్లైండ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లేశం, ప్రధాన కార్యదర్శి బి.రాఘవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.