స్టూడెంట్లకు స్పెషల్ బస్సులు

స్టూడెంట్లకు స్పెషల్ బస్సులు
  • వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి నడిపేందుకు ఆర్టీసీ ప్లాన్
  • కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చర్యలు
  • ఉదయం, సాయంత్రం వేళల్లో కాలేజీ రూట్లలో ఏర్పాటుకు సన్నాహాలు 
  • కొత్త ఎలక్ర్టిక్ బస్సుల్లో కొన్ని కేటాయించాలని నిర్ణయం
  • మహాలక్ష్మి’ స్కీమ్ తో బస్సుల్లో పెరిగిన ఆక్యుపెన్సీరేషియో
  • కాలేజీల టైమింగ్​లో తేడా ఉండేలా మేనేజ్​మెంట్లకు లెటర్లు
  • నివేదిక మేరకు బస్సులు నడుపుతమంటున్న ఆర్టీసీ అధికారులు

హైదరాబాద్,వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ స్కీమ్ ‘మహాలక్ష్మి’తో  సిటీలో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. మరోవైపు సరిపడా బస్సులు లేక విద్యార్థులు కాలేజీలకు టైమ్ కు చేరుతామో లేదోననే ఆందోళనలో జర్నీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఉన్న బస్సులు సమయానికి రాకపోగా, వచ్చినా సీట్లు దొరక్కపోవడంతో సర్కస్​ ఫీట్లు చేస్తూ వెళ్తున్నారు.

సిటీతో పాటు శివారులో విద్యాసంస్థలు ఉన్నరూట్లలో ఆర్టీసీ తగినన్ని బస్సులు నడపకపోవడంతోనే ఇబ్బందులు వస్తున్నాయి. అయితే.. వచ్చే ఏడాది అకడమిక్ ఇయర్ నుంచి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బస్సులు నడిపేందుకు టీఎస్​ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. ఇప్పటినుంచే  బస్సు రూట్లను ప్లాన్ ప్రకారం సిద్ధం చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా కాలేజీలు, విద్యాసంస్థల మేనేజ్ మెంట్లతోనూ సంప్రదింపులు జరుపుతున్నా రు. ఎంతమంది విద్యార్థులు కాలేజీల్లో చదువుతున్నారు?. వారిలో రోజూ ఎంతమంది ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారు? అనే వివరాలు తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కాలేజీల మేనేజ్ మెంట్లు ఇచ్చే విద్యార్థుల డేటా ఆధారంగా ఆయా రూట్లలో ఎన్ని బస్సులు నడపాలనే దానిపై ఆర్టీసీ అధికారులు తగు చర్యలు తీసుకోనున్నారు. 

ఎలక్ట్రిక్​ బస్సులు నడిపేందుకు నిర్ణయం 

ప్రస్తుతం సిటీతో పాటు శివారులో  2,830 బస్సులు నడుస్తున్నాయి. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా అవి సరిపోవడం లేదు. ఇప్పుడున్నవాటిలోనే కొన్ని కాలేజీలు, విద్యాసంస్థల ప్రాంతాలకు నడుపుతున్నారు. దీంతో విద్యార్థులకు తగినన్ని లేకపోగా జర్నీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితి వచ్చే ఏడాది నుంచి రాకుండా ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఈ ఏడాది మే ఆఖరు నాటికి కొత్తగా 500 ఎలక్ర్టిక్​బస్సులు రానున్నాయి.

ఇందులోంచి కొన్ని విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కేటాయించాలని కూడా అధికారులు నిర్ణయించారు. వాటిని ఉదయం, సాయంత్రం వేళల్లో ఆయా ప్రాంతాల్లో నడుపుతారు. ముఖ్యంగా ఇంజనీరింగ్​కాలేజీలు, వివిధ విద్యాసంస్థ లు సిటీశివారు ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. అధికశాతం మంది విద్యార్థులు కూడా ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సు పాసుల్లో  2.5 లక్షల వరకు విద్యార్థులవే ఉన్నాయి.

వచ్చే ఏడాది అకడమిక్ నాటికి వీరి సంఖ్య పెరగొచ్చని అధికారులు పేర్కొంటున్నారు.  దీన్ని దృష్టిలో పెట్టుకునే విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులను నడిపేందుకు కసరత్తు చేస్తున్నారు.  అయితే.. ‘మహాలక్ష్మి’ స్కీమ్ తో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీరేషియో భారీగా పెరిగింది. జిల్లాలతో పోలిస్తే సిటీలో మహిళలు అధికసంఖ్యలో ఫ్రీ జర్నీ చేస్తున్నారు. దీంతో సరిపడా బస్సులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఆర్టీసీ అధికారుల వద్ద రిజిస్టర్​అయిన విద్యార్థుల బస్సు పాస్​లతో పాటు కాలేజీ మేనేజ్ మెంట్లు ఇచ్చే రిపోర్ట్ ల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. 

కాలేజీల టైమ్​లో.. 

 వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి విద్యార్థులకు ప్రత్యేక బస్సు సౌకర్యం అందుబాటులో ఉండాలంటే కాలేజీలు, విద్యాసంస్థల ఓపెనింగ్ సమయాల్లో కొంత తేడా పాటించేలా చూసుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు. అన్ని కాలేజీల మేనేజ్ మెంట్లు ఒకే టైమ్ పాటించకుండా కనీసం గంట నుంచి రెండు గంటల తేడా ఉంటే విద్యార్థులు ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని పూర్తిగా వినియోగించుకుంటారని పేర్కొంటున్నారు.

తద్వారా సమయానికి బస్సులను నడిపేందుకు కూడా అనుకూలంగా ఉంటుందని ఆర్టీసీ గ్రేటర్​హైదరాబాద్​ఎగ్జిక్యూటివ్​డైరెక్టర్​వెంకటేశ్వర్లు తెలిపారు. దీనిపై కాలేజీలు, విద్యాసంస్థల మేనేజ్ మెంట్లతో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు. ఇది సక్సెస్​అయితే సిటీ పరిధిలో కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు టైమ్ కు ఆర్టీసీ బస్సు సౌకర్యం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.