
ఏటూరునాగారం, వెలుగు: విద్యార్థులకు నాణ్యమైన బోధనతోపాటు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ, స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ సూచించారు. మంగళవారం ఏటూరునాగారం ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాలను స్పెషల్ సీఎస్, కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీవో చిత్రమిశ్రాతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వంటశాల, ఆహారం నాణ్యత, స్టోర్ రూము, కూరగాయలు నిల్వలు, హాజరు పట్టిక, ఆహారం నాణ్యతపై విద్యార్థులు రాసిన ఫీడ్ బ్యాక్, పరిసరాలను సీఎస్ పరిశీలించారు.
అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. ఈ సందర్భంగా అరవింద్కుమార్మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు అనేక సౌకర్యాలు కల్పిస్తుందని, విద్యార్థులు బాగా చదువుకోవాలని సూచించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థుల పఠనా సామర్థ్యం, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. వారివెంట అడిషనల్ కలెక్టర్ మహేందర్ జి, ఆర్డీవో వెంకటేశ్, ఏపీవో వసంతరావు, డీడీ పోచం, మండల ప్రత్యేకాధికారి రాంపతి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.