ట్రంప్‌కు అదిరిపోయే డిన్నర్: లిమిటెడ్ గెస్టులు.. అన్‌లిమిటెడ్ వెరైటీలు

ట్రంప్‌కు అదిరిపోయే డిన్నర్: లిమిటెడ్ గెస్టులు.. అన్‌లిమిటెడ్ వెరైటీలు

అమెరికా అధ్యక్షుడిగా 2017లో బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ మూడేళ్ల తర్వాత తొలిసారి భారత పర్యటనకు వచ్చారు. నిన్న (సోమవారం) తొలి రోజు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అగ్రరాజ్యాధినేతకు దాదాపు లక్ష మందికి పైగా రోడ్డు వెంట నిలబడి అదిరిపోయే గ్రాండ్ వెల్‌కం చెప్పారు. ఎయిర్‌పోర్టు నుంచి మోతెరా స్టేడియం వరకు భారీ రోడ్ షో సాగింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన మోతెరా గ్రౌండ్‌లో లక్షా 25 వేల మందికి పైగా జనం ‘నమస్తే ట్రంప్’ అంటూ స్వాగతం పలికారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా సహా అతిరథ మహారథులతో కొలువుదీరిన ఆ భారీ బహిరంగ సభలో ప్రసంగం తర్వాత ట్రంప్ ఆగ్రా వెళ్లారు. తాజ్‌మహల్‌ను సందర్శించి ట్రంప్, మెలనియా జంట, ఇవాంకా, కుష్నర్‌ల జంట సుమారు గంటపైగా ఆ ప్రేమ సౌధం దగ్గర విహరించారు. అక్కడి నుంచి నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఇవాళ (మంగళవారం) ఉదయం నుంచి అధికారిక, ద్వైపాక్షిక చర్చలతో పాటు మరికొన్ని విజిట్స్‌తో బిజీబీజీగా గడిపారు. ఈ రాత్రి పది గంటలకు తిరుగు ప్రయాణమవుతున్నారు.

గ్రాండ్ డిన్నర్‌తో వీడ్కోలు

తొలిసారి మన దేశానికి అతిథిగా వచ్చిన అగ్రరాజ్యాధినేత ట్రంప్‌కు గ్రాండ్ డిన్నర్‌తో వీడ్కోలు చెబుతున్నారు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. రాష్ట్రపతి భవన్‌లో రాత్రి 7.30 గంటలకు ఈ విందు ఉంటుంది. ట్రంప్‌తో పాటు ఆయన భార్య మెలనియా, కుమార్తె ఇవాంక, అల్లుడు కుష్నర్, వారి అధికార బృందం అంతా ఈ ఇండియన్, ఫ్రెంచ్, రకరకాల వెస్ట్రన్ వెరైటీస్‌ను ఆస్వాదిస్తారు. ఈ విందులో 100 మంది స్పెషల్ గెస్టులు మాత్రమే పాల్గొంటారని తెలుస్తోంది. అందులో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, తెలంగాణ సీఎం కేసీఆర్ సహా మరో ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలువురు ప్రముఖులు ఉంటారు.

విందులో మెనూ ఇదే

బోడెలన్ని వెరైటీస్‌తో లావిష్ డిన్నర్‌ను ట్రంప్ టీమ్‌కు ఇస్తున్నారు రాష్ట్రపతి. ప్రీ డిన్నర్ కోర్స్‌లో రకరకాల ఫ్రెంచ్ సూప్స్, ఫుడ్స్.. గోల్డెన్ లీవ్స్‌తో డెకరేట్ చేసి చూడగానే నోరూరించేలా ఉంటాయి. అలాగే ఆలూ టిక్కీ, పాలకూర అప్పడాలతో పాటు సాల్మన్ ఫిష్ టిక్కా, లెమన్ కారియాండర్ సూప్ సహా పలు రకాల నార్త్ ఇండియా స్పెషల్ స్ట్రీట్ ఫుడ్స్‌ రుచి ట్రంప్‌కు చూపించబోతున్నారు.

హిమాలయాస్‌లో దొరికే మష్రూమ్స్

ఇక డిన్నర్ మెయిన్ కోర్స్‌లోకి వస్తే హిమాలయాల్లో మాత్రమే దొరికే మోరెల్ మష్రూమ్స్‌తో దమ్ గుచ్చీ మట్టర్‌ ఈ విందు మొత్తానికే హైలైట్. ఈ మష్రూమ్స్ కిలో రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకూ కాస్ట్ ఉంటాయి. మరికొన్ని  మష్రూమ్ వెరైటీస్‌తో పాటు రోస్టెడ్ మటన్ లెగ్ పీసెస్, మటన్ బిర్యానీ, పుదీనా రైతా, రాష్ట్రపతి భవన్ స్పెషల్ దాల్ రైసినాతో విందు అదిరిపోనుంది. చివరిగా డిజర్ట్స్‌లో హాజెల్‌ నట్-యాపిల్, వెన్నెలా ఐస్‌క్రీమ్స్, మాల్పువా, రబ్దీ స్వీట్స్ ఉంటాయని అధికార వర్గాల నుంచి సమాచారం అందుతోంది.