కేసీఆర్ శకం ముగిసినట్లే

కేసీఆర్ శకం ముగిసినట్లే
  • కేసీఆర్ 9 ఏండ్ల పాలనపై రౌండ్ టేబుల్ మీటింగ్​లో వక్తలు 
  • బీఆర్​ఎస్‌ రోజురోజుకూ దిగజారుతోంది: కొండా
  • కేసీఆర్ ఏడ నిలబడ్తే ఆడికెళ్లి ఓడిస్తా: గద్దర్  
  • తాగుడు రాష్ట్రంగా మార్చిండు: పాశం యాదగిరి
  • కేసీఆర్​కు బుద్ధి చెప్దాం: బూర నర్సయ్య గౌడ్   
  • దశాబ్ది తెలంగాణలో శతాబ్ది దోపిడీ: అద్దంకి దయాకర్  

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ శకం ముగిసిందని, సర్వేలన్నీ ఇదే చెబుతున్నాయని బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. అన్ని పార్టీల గ్రాఫ్ పెరుగుతుంటే బీఆర్ఎస్ గ్రాఫ్ మాత్రం రోజురోజుకూ దిగజారుతోందన్నారు. దేశంలో హెల్త్, ఎడ్యుకేషన్ కు అతి తక్కువ బడ్జెట్ కేటాయిస్తున్న రాష్ట్రం మనదే కావడం దురదృష్టకరమని అన్నారు. “పదేండ్ల తెలంగాణలో దోచుకున్నది ఎవరు? దగా పడ్డది ఎవరు? ” అనే అంశంపై తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు కప్పరప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన రౌండ్ టేబుల్ మీటింగ్ లో వివిధ పార్టీల లీడర్లు, ప్రజా సంఘాల నేతలు మాట్లాడారు. సీఎం కేసీఆర్ సర్కార్ పాలనపై మండిపడ్డారు. తెలంగాణ మానవత్వం లేని రాష్ట్రంగా తయారైందని విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. రైతుల నుంచి అసైన్డ్ భూముల్ని లాక్కొని, ప్రైవేట్ సంస్థలకు తక్కువ రేట్ కు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. “బీజేపీ సిద్ధాంతం నచ్చింది. అందుకే ఆ పార్టీలో చేరిన. ఇప్పుడు పార్టీ మారేదిలేదు. అందులోనే ఉంటాను” అని కొండా స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్ శాతం ఇప్పటికే 40 వరకూ ఉందని, ఇది ఇంకా పెరుగుతుందన్నారు. కేసీఆర్ కొత్త పార్టీలని రాకుండా చేస్తుండని, కానీ వస్తే మంచిదేమోనన్నారు. ఇపుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ విడిపోతుందన్నారు. ఉద్యమ సమయంలో ఆంధ్రావాళ్ళను దొంగలని అన్నారని, కానీ ఇప్పుడు ఎవరు దొంగలో అందరికి అర్థమవుతోందన్నారు.  

కేసీఆర్ ను గద్దె దింపుదాం..  

కేసీఆర్ ఏడ నిలబడితే తాను అక్కడికి వెళ్లి.. పాట పాడుతానని, ఆయనను ఓడించడమే తన పని అని ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్నారు. ‘‘వాజ్ పేయి కలిశాడు. అమిత్ షా పలికరిస్తాడు. అంబానీ కూడా టైమ్ ఇస్తాడు. కానీ కేసీఆర్ మాత్రం కలవడు. గేట్ దగ్గరే ఆపేస్తాడు” అని ఆయన మండిపడ్డారు. అందరం కలిసి కేసీఆర్ ను గద్దె దింపేద్దామని పిలుపునిచ్చారు. కేసీఆర్ ను గద్దె దించేందుకు ఎవరితో అయినా కలిసి పని చేస్తానన్నారు. తెలంగాణ ఎవరి పాలైందనే అంశం పదేండ్ల తర్వాత చర్చకు వచ్చిందని సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి అన్నారు. తెలంగాణను కేసీఆర్ తాగుడు రాష్ట్రంగా మార్చిండని విమర్శించారు. జర్నలిస్టులు ప్రజా సమస్యల గురించి రాస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు.  

దోపిడీలు, లీకేజీలే ఉన్నయ్.. 

ఇవి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు కాదని, కేసీఆర్ దశాబ్ది ఉత్సవాలని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబమే భోగాలు అనుభవిస్తోం దన్నారు. ఉద్యమ టైమ్ లో అప్పటి సీఎంలు  రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలను కూడా కలిసే అవకాశం ఉండేదని, ధర్నాలు చేసేందుకూ వీలు ఉండేదన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మాత్రం కుక్కిన పేనులా ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కళాకారులను, ఉద్యమకారులను కూడా పక్కన పెట్టారన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నీళ్లు, నిధులు, నియామకాలన్నీ కేసీఆర్ కుటుంబానికే దక్కాయని పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. రాష్ర్టంలో దోపిడీలు, లీకేజీలు మాత్రమే ఉన్నాయని, దశాబ్ది తెలంగాణలో శతాబ్ది దోపిడీ జరుగుతోందన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి ఉద్యమకారులంటే ఎప్పుడూ చిన్నచూపేనని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. హక్కుల కోసం మళ్లీ గొంతు ఎత్తాల్సిన అవసరం ఉందని, మేధావులంతా ఏకమై మళ్లీ పోరాడాలని పిలుపునిచ్చారు.