కాయగూరల కొత్త రుచులు

కాయగూరల కొత్త రుచులు

ఎప్పుడూ అవే కూరగాయలు, అవే కూరలు తిని బోర్ కొట్టేశాయా? కొత్త రుచులు చూడటానికి ఎదురు చూస్తున్నారా? అయితే, ఒక పని చేయొచ్చు. రోజూ తినే కూరగాయలు ఆరోగ్యానికి చాలా మంచివి. కాబట్టి వాటినే, వేరే పద్ధతిలో వండితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఆలోచన బాగుంది కదూ! మరింకేం.. ఈ వెరైటీల పని పట్టేయండి.

బేండీ దో ప్యాజా 

కావాల్సినవి :
నూనె – మూడు టేబుల్ స్పూన్లు, వాము – పావు టీస్పూన్, ఆలుగడ్డ, బెండకాయ, ఉల్లిగడ్డ ముక్కలు – ఒక్కోటి కప్పు చొప్పున
అల్లం తరుగు – ముప్పావు టీస్పూన్, టొమాటోలు – రెండు, పసుపు – పావు టీస్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్
గరం మసాలా – ఒక టీస్పూన్, ఉప్పు – సరిపడా, కొత్తిమీర – కొంచెం
తయారీ :
ఒక పాన్​లో నూనె వేడి చేసి, వాము వేయాలి. అందులో ఆలుగడ్డ, బెండకాయ ముక్కలు వేయాలి. పావుగంట సేపు వేగించాక, ఉల్లిగడ్డ ముక్కలు వేసి కలపాలి. మరో పాన్​లో నూనె వేడి చేసి, అల్లం తరుగు, ఉల్లిగడ్డ తరుగు, టొమాటో గుజ్జు, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా వేయాలి. అందులో వేగించిన బెండకాయల మిశ్రమం వేసి కలపాలి. కావాలంటే టొమాటో ముక్కలు కూడా వేగించి కలపొచ్చు. 

దొండకాయ పచ్చికొబ్బరి కారం

కావాల్సినవి :
 
దొండకాయల తరుగు – అరకిలో, పచ్చి కొబ్బరి ముక్కలు – ఒక కప్పు
పచ్చిమిర్చి – ఏడు, నూనె – మూడు టేబుల్​ స్పూన్లు
అల్లం – చిన్న ముక్క, ఆవాలు, జీలకర్ర – ఒక్కోటి టీస్పూన్ చొప్పున
మినప్పప్పు, పచ్చి శనగపప్పు– ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున
ఎండు మిర్చి – ఒకటి

తయారీ :

మిక్సీ జార్​లో పచ్చికొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. 
ఒక పాన్​లో నూనె వేడి చేసి, ఆవాలు, మినప్పప్పు, పచ్చి శనగపప్పు, ఎండు మిర్చి వేయాలి. అవి ఎర్రగా వేగాక, జీలకర్ర, కరివేపాకు వేసి కలపాలి. అందులో దొండకాయ తరుగు, ఉప్పు వేసి మూతపెట్టి, ఇరవై నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత పచ్చి కొబ్బరి కారం వేసి కలపాలి. చివరగా కొత్తిమీర చల్లాలి.
 

 

కాలీఫ్లవర్ పెప్పర్​ ఫ్రై

కావాల్సినవి :

కాలీఫ్లవర్ – ఒకటి, ఉల్లిగడ్డలు – రెండు
టొమాటోలు – మూడు
సోంపు, పసుపు– ఒక్కోటి పావు టీస్పూన్ చొప్పున, అల్లం, వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి – ఒక్కోటి టేబుల్ స్పూన్ చొప్పున
కారం, ధనియాల పొడి – ఒక్కో టీస్పూన్ చొప్పున, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, నూనె – సరిపడా, సోంపు పొడి – చిటికెడు
కొబ్బరి పాలు – ఒకటిన్నర టేబుల్ స్పూన్
నెయ్యి – ముప్పావు టీస్పూన్

 


తయారీ :

మొదట వేడి నీళ్లలో పసుపు, ఉప్పు, కాలీఫ్లవర్ ముక్కలు వేయాలి. పది నిమిషాల తర్వాత గిన్నెలోకి తీసుకోవాలి. 
పాన్​లో నూనె వేడి చేసి, సోంపు, కరివేపాకు, ఉల్లిగడ్డ తరుగు వేయాలి. అవి వేగాక, అల్లం, వెల్లుల్లి పేస్ట్ కలపాలి. ఆ తర్వాత టొమాటో తరుగు, పసుపు, ధనియాల పొడి, కారం, ఉప్పు వేసి కలపాలి. కాసేపటి తర్వాత కొత్తిమీర వేసి, కొన్ని నీళ్లు పోసి ఉడికించాలి. కాలీఫ్లవర్​ ముక్కలు కూడా వేసి, నీళ్లు పోసి, మరొకసారి కొత్తిమీర చల్లి, మూత పెట్టాలి. పది నిమిషాల తర్వాత కొబ్బరి పాలు, మిరియాల పొడి, సోంపు పొడి, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ప్లేట్​లోకి తీసుకున్నాక, నెయ్యి వేసుకుంటే.. ఊరించే వేపుడు రెడీ.