గ్రేటర్‍ వరద కష్టాలపై..సర్కార్‍ స్పెషల్‍ ఫోకస్‍

గ్రేటర్‍ వరద కష్టాలపై..సర్కార్‍ స్పెషల్‍ ఫోకస్‍
  •     నాలాల విస్తరణకు అడుగులు
  •     రూ.250 కోట్లతో  పనులకు శ్రీకారం  
  •     నయీంనగర్‍, భద్రకాళి, బొందివాగు నాలాల వెడల్పు
  •     నాలుగు నెలల గడువు.. ఎమ్మెల్యేల మానిటరింగ్‍

వరంగల్‍, వెలుగు : వరంగల్‍ వరదలపై కాంగ్రెస్‍ సర్కార్‍ స్పెషల్‍ ఫోకస్‍ పెట్టింది. కొన్నేండ్ల నుంచి సిటీ జనాలను  వణికించిన  వదర భయం దూరం కానుంది.  వరదల నుంచి కాపాడుకునేందుకు  కాంగ్రెస్​ ప్రభుత్వం, స్థానిక లీడర్లు దృష్టి సారించారు. ఇటీవల పలు పనులకు శంకుస్థాపన చేసి, నాలాల విస్తరణ, ఆక్రమణల కూల్చి వేతల కోసం అధికారులకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారు. 

వానకాలం వస్తే నగరం అతలాకుతలం

వానాకాలం వస్తుందంటేనే 100 నుంచి 150 కాలనీలు నీట ముగుతాయి. ..  లక్షలాది  జనాలు గజగజ వణుకుతారు. అయినా గత పదేండ్లలో వీటిని నివారించడంలో బీఆర్​ఎస్​ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది.  గతేడాది కురిసిన వానలకు అనేక కాలనీలు  నీటమునిగాయి. ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఈ నష్టం ఈ ఏడాది  రాకుండా ఉండాలని  ప్రభుత్వం కృషి చేస్తోంది.   కరీంనగర్‍ రోడ్డులోని నయీంనగర్‍ పెద్దమోరీ  వద్ద నెల క్రితమే పనులు ప్రారంభించారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసీ నగరంలోని మూడు ప్రధాన నాలాల అభివృద్ధికి మొత్తంగా   రూ.250 కోట్లు కేటాయించారు.  సిటీలోని దాదాపు 24.5 కిలోమీటర్ల పొడవుతో   నయీంనగర్‍, భద్రకాళి, బొందివాగు నాలాలు ఉన్నాయి.  

నగరంలో ఎక్కడికక్కడా ఆక్రమణలు పెరిగాయి. చెరువులు, కుంటలు కబ్జాలకు గురయ్యాయి.  100 అడుగులు ఉండాల్సిన నాలాలు   30 అడుగులకు కుంచించుకుపోయాయి.   కాజీపేట, సొమిడి మీదుగా డౌన్‍ ఏరియాలో ఉండే హనుమకొండ వైపు నీరు ఉద్ధృతంగా ప్రవహించి వందలాది కాలనీలు జలమయం అయ్యాయి. 2020, 2021, 2022లో  వరదల కారణంగా కాలనీలు నీట మునిగాయి.  2023 జులైలో వచ్చిన వరదలు మాత్రం సిటీ జనాలను అతలాకుతలం చేశాయి. 

100 అడుగుల నాలా.. 30 అడుగులే

 నయీంనగర్‍, భద్రకాళి, బొందివాగు మెయిన్‍ నాలాలు గతంలో 100 అడుగులు ఉండగా..  ఇప్పుడు 30 అడుగులకు కుచించుకు పోయాయి.   ఇంకొన్నిచోట్ల 50 అడుగులకు చేరాయి.  గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల అనుచరులు, వ్యాపారులు, కబ్జాదారులు   నాలాలపై నిర్మాణాలు చేపట్టారు. సమ్మయ్యనగర్‍ నుంచి నయీంనగర్‍ మీదుగా కాకతీయ కెనాల్‍ వైపు వెళ్లేచోట, భద్రకాళి, బొందివాగు నాలాలైతే మరింత ఆక్రమణకు గురయ్యాయి. 

శిలాఫలాకాలకే పరిమితం..

 2020లో వరదలొస్తే ఎంతో హడావుడి చేసిన అప్పటి మంత్రి కేటీఆర్‍.. మళ్లీ 2021లో గ్రేటర్‍ కార్పొరేషన్‍ ఎన్నికల వరకు పట్టించుకోలేదు. అప్పటికే సిటీలో అభివృద్ధి పనులు ఏండ్ల తరబడి పెండింగ్‍ ఉండటం..కార్పొరేటర్లు కబ్జాలకు పాల్పడ్డారని జనం ఆగ్రహంగా ఉన్నారు. దీంతో కేటీఆర్‍  వరంగల్లో పర్యటించారు. దాదాపు 2,200 కోట్ల పనులకు ఎలక్షన్ల శిలాఫలకాలు వేశారు. అందులో నాలాల వెడల్పు, మళ్లీ ఆక్రమణలు జరగకుండా ఇరువైపులా రిటర్నింగ్‍ వాల్ కడుతున్నట్లు చెప్పారు. తీరాచూస్తే 24.5 కిలోమీటర్ల నాలా పనులు చేపట్టాల్సి ఉండగా.. కేసీఆర్‍ ప్రభుత్వం ఫండ్స్‍ ఇవ్వకపోవడంతో గడిచిన 3 ఏండ్లలో సమ్మయ్యనగర్‍ నుంచి పావుకిలో మీటర్‍ దూరంలో ఉండే ప్రెసిడెన్సీ స్కూల్‍ వరకు కూడా పూర్తిస్థాయిలో గోడ కట్టలేకపోయారు. 

డిసెంబర్‍ 7న సర్కారు..ఫిబ్రవరి 7న పనులు షురూ

రాష్ట్రంలో 10 ఏండ్లు బీఆర్‍ఎస్‍ కేసీఆర్‍ ప్రభుత్వం అధికారంలో ఉండగా..  సిటీని మాత్రం పట్టించుకోలేదు.  కాంగ్రెస్‍ సర్కార్‍ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే  మంత్రులు రంగంలోకి దిగారు.  డిసెంబర్‍ 7న  ప్రభుత్వం రాగా ఫిబ్రవరి 7న  నయీంనగర్‍ నాలా వద్ద రూ.90 కోట్ల విలువ చేసే నాలా వెడల్పు, ఇరువైపులా రిటర్నింగ్‍ వాల్‍ పనులు మొదలయ్యాయి. గ్రేటర్‍ పరిధిలో ఉండే మంత్రి సురేఖ, వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవడంతో నయీంనగర్‍ నాలాను బఫర్‍జోన్‍తో కలిపి 82 అడుగుల విస్తిర్ణంతో డెవలప్‍ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సిటీలోని భద్రకాళి, బొందివాగు నాలాలు సైతం వెడల్పు చేసేందుకు రెడీ అయ్యారు.  

నాలాల అభివృద్ధికి రూ.250 కోట్లు కేటాయించారు. జూన్‍లో వర్షకాలం ప్రారంభమయ్యే నేపథ్యంలో నాలుగు నెలల్లో పనులు పూర్తి చేసే ప్రణాళికతో అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఫీల్డ్​ మీదకు వెళ్లి పనులను పరిశీలిస్తున్నారు.  విస్తరణ, ఆక్రమణల మార్కింగ్‍, కూల్చివేతల్లో ఎట్టిపరిస్థితుల్లో రాజకీయ జోక్యం ఉండదని..చివరకు తమ బంధువులు, సొంతిళ్లు ఉన్నా కూల్చడానికి వెనకాడొద్దని అధికారులకు ఫుల్‍ పవర్స్​ ఇచ్చారు.