ఎన్నికల ఫలితాలకు ముందు ఏం జరిగింది?

ఎన్నికల ఫలితాలకు ముందు ఏం జరిగింది?
  • హార్డ్‌‌ డిస్కుల్లో సీక్రెట్‌‌ ఇన్ఫర్మేషన్‌‌ ఏముంది?.. ధ్వంసం చేయాల్సిన అవసరం ఏంటి?
  • మాజీ డీఎస్పీ ప్రణీత్‌‌ రావును ప్రశ్నించిన పోలీసులు
  • రేపటితో ముగియనున్న కస్టడీ

హైదరాబాద్‌‌, వెలుగు: ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసులో స్పెషల్‌‌ ఇంటెలిజెన్స్‌‌ బ్రాంచ్‌‌ (ఎస్‌‌ఐబీ) మాజీ డీఎస్పీ ప్రణీత్‌‌ రావు కస్టడీ కొనసాగుతున్నది. ఆయన కస్టడీ విచారణలో స్పెషల్  ఇన్వెస్టిగేషన్  టీమ్‌‌  కీలక ఆధారాలు సేకరిస్తున్నది. ప్రధానంగా డిసెంబర్ 4వ తేదీకి ముందు ఏం జరిగిందనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్  వచ్చినప్పటి నుంచి ఫలితాలు వచ్చే వరకు ప్రణీత్‌‌ రావుతో సంప్రదింపులు జరిపిన వారి వివరాలను సేకరిస్తున్నారు. 

కాల్‌‌ డేటా, ఫోన్  నంబర్ల ఆధారంగా ఆయా వ్యక్తులను విచారిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ప్రణీత్‌‌ రావును ఏడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఐదో రోజు కస్టడీలో గురువారం విచారించారు. గత నాలుగు రోజుల కస్టడీ విచారణలో ఎస్‌‌ఐబీ లాగర్‌‌ ‌‌రూమ్‌‌కు సంబంధించిన వివరాలు సేకరించారు. ప్రణీత్‌‌ రావు స్టేట్‌‌మెంట్‌‌ను రికార్డు చేశారు. 

శనివారంతో కస్టడీ ముగియనుండడంతో ఆయనను మరింత లోతుగా ప్రశ్నించే అవకాశం ఉంది. నిందితుడు ఇచ్చిన సమాచారంతో సంబంధిత వ్యక్తులను అధికారులు విచారించారు. ఇందులో కొంతమందిని సాక్షులుగా పేర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఎస్‌‌ఐబీలోని  మాన్యువల్, ఎలక్ట్రానిక్  రికార్డులను స్వయంగా ప్రణీత్‌‌ రావు ఆపరేట్  చేసేవాడని గుర్తించారు. వ్యక్తిగత సమాచారాన్ని అనధికారికంగా సేకరించి రెండు హార్డ్‌‌ డిస్కుల్లో స్టోర్  చేసినట్లు అనుమానిస్తున్నారు. వ్యక్తిగత రహస్య సమాచారం ఉండడంతో ఆయా ఎలక్ట్రానిక్  పరికరాలను ధ్వంసం చేసినట్లు భావిస్తున్నారు.

ఎస్‌‌ఐబీ లాగర్‌‌‌‌ రూమ్‌‌లో స్పెషల్‌‌ ఆపరేషన్‌‌

ప్రధానంగా ఎస్‌‌ఐబీ లాగర్‌‌ ‌‌రూమ్‌‌కు సంబంధించిన వ్యవహారం చుట్టే దర్యాప్తు జరుగుతున్నది. ప్రణీత్‌‌ రావుకు కేటాయించిన రెండు ప్రత్యేక గదుల్లో జరిగిన కార్యకలాపాల గురించి ఆరా తీసినట్లు తెలిసింది. స్పెషల్  ఆపరేషన్స్ టార్గెట్స్‌‌ (ఎస్‌‌ఓటీ) చీఫ్‌‌గా ప్రణీత్ రావు పర్యవేక్షణలో గత ఏనిమిదేండ్లుగా ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించారనే వివరాలకు సంబంధించిన డేటాను సేకరిస్తున్నారు. ప్రధానంగా అత్యంత రహస్యంగా ఉండే ఎస్‌‌ఐబీలో నిందితుడు వినిగియోగించిన ఫోన్లను గుర్తించేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రణీత్‌‌ రావుతో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తులకు సంబంధించిన వివరాలతో ప్రత్యేక డేటాబేస్‌‌  తయారు చేస్తున్నట్లు తెలిసింది. 

ప్రణీత్‌ రావు పిటిషన్‌ కొట్టివేత

ఎస్‌ఐబీలో రికార్డులు ధ్వంసం, పలు కీలక ఆధారాలను నాశనం చేశారనే అభియోగాలపై అరెస్టయిన స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ (ఎస్‌బీ) డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌ కుమార్‌ అలియాస్‌ ప్రణీత్‌ రావు దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం హైకోర్టు కొట్టేసింది. కింది కోర్టు  పోలీస్‌ కస్టడీకి ఇవ్వడాన్ని సవాల్​ చేస్తూ ప్రణీత్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్‌ జీ రాధారాణి గురువారం డిస్మిస్‌ చేశారు. కేసు దర్యాప్తులో భాగంగానే పిటిషనర్‌ను పోలీసులకు అప్పగిస్తూ కింది కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఆ ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. పోలీసుల దర్యాప్తునకు న్యాయవాదిని అనుమతించలేదని, పోలీస్‌ స్టేషన్‌లో సౌకర్యాలు లేనందున విచారణ తర్వాత జైలుకు తరలించాలని చేసిన పిటిషనర్‌ వినతిని తిరస్కరించారు.