ప్రభుత్వ భూముల..కబ్జాల కట్టడికి కమిటీ

ప్రభుత్వ భూముల..కబ్జాల కట్టడికి కమిటీ
  •    మహబూబాబాద్‌‌లో ప్రభుత్వ భూముల రక్షణకు ప్రత్యేక చర్యలు
  •     రెవెన్యూ, పోలీస్‌‌, మున్సిపల్‌‌ ఆఫీసర్లతో మానిటరింగ్‌‌ కమిటీ
  •     జూనియర్‌‌ అసిస్టెంట్‌‌ స్థాయి ఉద్యోగులు నిత్యం ఫీల్డ్‌‌లో పర్యటించేలా ఆదేశాలు 
  •     సర్వే నంబర్ల వారీగా బాధ్యతలు అప్పగించిన కలెక్టర్‌‌

మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్‌‌ జిల్లాలోని ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా ఆఫీసర్లు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కబ్జాలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు కొందరు ఉద్యోగులకు ఫీల్డ్‌‌ విజిట్ బాధ్యతలు అప్పగించారు. వీరు తమకు కేటాయించిన సర్వే నంబర్‌‌లో పర్యటిస్తూ కబ్జా వివరాలను ఫొటోలు తీసి డైరెక్ట్‌‌గా కలెక్టర్‌‌కు సెండ్‌‌ చేయాల్సి ఉంటుంది. అలాగే భూముల పరిరక్షణ కోసం వివిధ శాఖల ఆఫీసర్లతో ప్రత్యేక మానిటరింగ్‌‌ కమిటీని సైతం ఏర్పాటు చేశారు. 

అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూములు

మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలో సుమారుగా 3 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటుంది. 2016లో మహబూబాబాద్‌‌ జిల్లా కేంద్రంగా మారిన తర్వాత భూముల విలువ అమాంతం పెరిగింది. దీంతో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. కొందరు వ్యక్తులు సర్వే నంబర్లు మార్చి, భూములను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. వీరికి కొన్ని శాఖల ఆఫీసర్లు సైతం సహకరిస్తున్నారు. అలాగే పేదల కోసమంటూ వామపక్ష లీడర్లు, ఇతర కుల సంఘాలకు చెందిన వారి ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేస్తున్నారు. దీంతో ప్రభుత్వ భూమి రోజురోజుకు తగ్గిపోతోంది.

మహబూబాబాద్‌‌ జిల్లా కేంద్రంలోని సర్వే నంబర్‌‌ 287లో 1000 ఎకరాలు, సర్వే నంబర్‌‌ 551లో1300 ఎకరాలు, సర్వే నంబర్ 255లో 280 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉండాల్సి ఉండగా ప్రస్తుతం అందులో సగం భూమి కూడా అందుబాటులో లేదు. పేదలకు కొంత భూమి పంపిణీ చేయగా, ప్రభుత్వ అవసరాల కోసం మరికొంత భూమిని కేటాయించారు. ఎక్కువ భాగం భూములు అన్యాక్రాంతమయ్యాయి. 

భూముల రక్షణకు మానిటరింగ్‌‌ కమిటీ

మహబూబాబాద్‌‌ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం కాకుండా కలెక్టర్‌‌ అద్వైత్​కుమార్‌‌ సింగ్‌‌ స్పెషల్‌‌ ఫోకస్‌‌ పెట్టారు. భూములను కాపాడేందుకు మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, పీఆర్, హెల్త్, స్త్రీ శిశు సంక్షేమ శాఖల ఆఫీసర్లతో ఓ కమిటీ ఏర్పాటు చేయడంతో పాటుగా నిరంతర భూములను పర్యవేక్షించేందుకు ప్లాన్‌‌ చేశారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూముల రక్షణకు మానిటరింగ్‌‌ కమిటీని ఏర్పాటు చేసి చైర్మన్‌‌గా మహబూబాబాద్‌‌ ఆర్డీవో ఎల్.అలివేలు, సభ్యులుగా మహబూబాబాద్‌‌ తహసీల్దార్‌‌ భగవాన్‌‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్‌‌ రవీందర్

సీఐ శ్రీనివాస్‌‌ నాయక్‌‌, టీపీవో నవీన్‌‌కుమార్‌‌తో కలిపి ఉన్నత స్థాయి కమిటీని నియమించారు. అలాగే జూనియర్‌‌ అసిస్టెంట్‌‌ కేడర్ ఉద్యోగులు షిఫ్ట్‌‌ల వారీగా ప్రభుత్వ భూముల్లో పర్యటించేలా డ్యూటీలు వేశారు. వారు ఉదయం, సాయంత్రం తమకు కేటాయించిన సర్వే నంబర్‌‌ భూమిలో తిరుగుతూ ఎక్కడైనా స్థలం కబ్జాకు గురైతే వెంటనే ఫొటోలు తీసి డైరెక్ట్‌‌గా కలెక్టర్‌‌కు పంపించడంతో పాటు కమిటీకి సమాచారం అందించాలి. ప్రతీ రోజు ఫీల్డ్‌‌లో తిరిగినట్లుగా టైమ్‌‌తో సహా రిజిస్టర్‌‌లో నమోదు చేయాలి. రాత్రి సమయంలో ఆక్రమణలు జరిగిన సంబంధిత ఉద్యోగులు రెస్పాండ్‌‌ కావాలని ఆదేశాలు జారీ చేశారు.

ప్రభుత్వ భూముల రక్షణ కోసమే.. 

జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూములను రక్షించేందుకే ప్రత్యేక కమిటీ వేశారు. సిబ్బంది ప్రతీ రోజు క్షేత్ర స్థాయిలో పర్యటించి, సమస్యలను ఉన్నతాధికారులకు తెలియజేయాలి. ఉద్యోగులపై  పనిభారం పడకుండా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూములను రక్షించేందుకు ప్రజలు, వివిధ పార్టీల నేతలు సహకరించాలి.

- ఎల్. అలివేలు, మహబూబాబాద్‌‌ ఆర్డీవో