
- గోవింద నామస్మరణతో మారుమోగిన ఆలయాలు
వెలుగు నెట్‌వర్క్: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆలయాలు గోవింద నామస్మరణతో మారుమోగాయి. మెదక్ పట్టణంలోని స్థానిక కోదండ రామాలయంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి సతీసమేతంగా, మెదక్ జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్య, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి, మెదక్ మున్సిపల్ చైర్మన్చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పల్లకీ సేవలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పాపన్నపేటలోని ప్రాచీన వేంకటేశ్వర ఆలయంలో అన్నదానం చేశారు. సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని శ్రీ లక్ష్మీ గోదా సమేత విరాట్ వేంకటేశ్వర ఆలయంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, కలెక్టర్ శరత్, జిల్లా న్యాయమూర్తి కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించుకుని పల్లకి సేవలో పాల్గొన్నారు.
బైపాస్ రోడ్డు లోని శ్రీ బాలాజీ టెంపుల్, సదాశివపేట వెంకటాపూర్ లోని వేంకటేశ్వర ఆలయం, కండి మండలం కోలంపేటలోని అలివేలు మంగ ఆలయాల్లో ఉత్తర ద్వారా దర్శనానికి పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి దంపతులు కుటుంబ సభ్యులతో తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారిని దర్శించుకున్నారు. సిద్దిపేట జిల్లాలోని పుల్లూరు బండ స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తూప్రాన్ లోని రామాలయం వద్ద ఉన్న కూర్మ నారసింహస్వామి ఆలయంలో భక్తులు ఉదయం నుంచే క్యూ కట్టారు. స్వామివారికి 108 పుష్పాలచే అభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సిద్దిపేటలోని కొత్త వేంకటేశ్వరాలయం, గణేశ్ నగర్ భక్తాంజనేయ దేవాలయాలను మాజీ మంత్రి హరీశ్ రావు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.