టాలెంట్​ని ఎవరంతకు వారు తెలుసుకునేలా ట్రైనింగ్

టాలెంట్​ని ఎవరంతకు వారు తెలుసుకునేలా ట్రైనింగ్

ఇంటలెక్చువల్​ డిజెబిలిటీ... ఈ సమస్యతో బాధపడేవాళ్లలో కొందరు సరిగ్గా మాట్లాడలేరు. మరికొందరు వినలేరు. ఏం చెప్పినా తొందరగా అర్థం చేసుకోలేరు. సొంతంగా ఏ పనీ చేసుకోలేరు. ఎవరో ఒకరు దగ్గరుండి మరీ వీళ్లను చూసుకోవాల్సి ఉంటుంది. దాంతో, వీళ్లకు చదువుకునే ఛాన్స్​ దొరకదు. తమ ప్రాంతంలో ఉన్న ఇలాంటి వాళ్ల కష్టాలు చూసి చలించిపోయిందామె. ఇంటలెక్చువల్​ డిజెబిలిటీతో బాధపడే వాళ్లని తమ కాళ్లపై తాము నిలబడేలా చేయాలి అనుకుంది. వాళ్ల టాలెంట్​ని​ గుర్తించి, ఎంకరేజ్​ చేసేందుకు ఆరేండ్ల కిందట ‘విజేత రెసిడెన్షియల్ స్పెషల్​ స్కూల్​, ఒకేషనల్​ ట్రైనింగ్​ సెంటర్​’ పెట్టింది. ఈ స్కూల్​ ద్వారా వాళ్లకి కొత్త బతుకుదారి చూపుతోంది కర్నాటకకు చెందిన కాంతా హరీష్​.  
ఉడిపి జిల్లాలో కర్కాల మున్సిపాలిటీలోని కుక్కుండూర్​ గ్రామంలో ఉంది ‘విజేత రెసిడెన్షియల్ స్పెషల్​ స్కూల్​, ఒకేషనల్​ ట్రైనింగ్​ సెంటర్​’. ఈ స్కూల్​ని శ్రీ గురు రాఘవేంద్ర ఎన్జీవో​ సహకారంతో  నడిపిస్తోంది కాంతా హరీష్​. ఆమే ఈ స్కూల్​కి ప్రిన్సిపాల్. ఇందులో  లైఫ్​ స్కిల్స్​తో పాటు సొంతంగా పనులు చేసుకోవడం ఎలాగో నేర్పిస్తారు. అంతేకాదు  పిల్లల బర్త్​డేలు కూడా చేస్తారు. 
స్కూల్​ ఆలోచన వెనుక
కొన్ని ప్రత్యేకమైన అవసరాలు ఉన్న వాళ్ల కోసం పాటుపడే సంస్థలో కొన్నాళ్లు జాబ్​ చేసింది కాంతా.  అందులో ఇంటలెక్చువల్ డిజెబిలిటీస్​ ఉన్న ఎనిమిది మందికి  లైఫ్​స్కిల్స్​ నేర్పించేవాళ్లు. అయితే, గవర్నమెంట్​ నుంచి ఫండ్స్​ రావడం ఆగిపోవడంతో ఆ సంస్థని మూసేశారు ఆర్గనైజర్స్​. దాంతో, ఆ  ఎనిమిది మంది పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. మానసిక ఆరోగ్యం బాగాలేని వాళ్లు పడే కష్టాల్ని దగ్గరగా చూసిన కాంతా వాళ్లకోసం ఏదైనా చేయాలి అనుకుంది. తమ చుట్టుపక్కల ఊర్లలో కూడా అలాంటి వాళ్లు మరికొంతమంది ఉన్నారని తెలుసుకుంది.

వాళ్లకి చదువుతో పాటు ఇతర యాక్టివిటీస్​ నేర్పించేందుకు 2016లో ‘విజేత రెసిడెన్షియల్ స్పెషల్​ స్కూల్, ఒకేషనల్​ ట్రైనింగ్​ సెంటర్’ పెట్టింది.  తమలోని టాలెంట్​ని వాళ్లంతట వాళ్లు తెలుసుకునేలా చేయడమే ఈ స్కూల్​ ఉద్దేశం.  మొదట్లో15 మంది వొకేషనల్​ ట్రైనింగ్​ క్లాసెస్​కి వచ్చారు. ఈ స్కూల్​ గురించి విని, తమ పిల్లల్ని (ఇలాంటి లోపం ఉన్నవాళ్లు) కూడా తీసుకొచ్చేవాళ్లు కొందరు పేరెంట్స్. కొత్తలో 25 ఏండ్లు దాటిన వాళ్లకే ట్రైనింగ్​ ఇచ్చేవాళ్లు. ఇప్పుడు చిన్న పిల్లలకి కూడా వొకేషనల్​ ట్రైనింగ్​ ఇస్తున్నారు. 
సిలబస్​తో పాటు ఇవి కూడా..
ఈ స్కూల్లో ఆటిజం, డౌన్​ సిండ్రోమ్​,  సెరిబ్రల్​ పాల్సీ వంటి హెల్త్​ ప్రాబ్లమ్స్​తో పాటు  నేర్చుకోవడంలో  ఇబ్బంది పడేవాళ్లు 86 మంది ఉన్నారు. ఇక్కడ ఉన్న 23 మంది టీచర్లు... వీళ్లకి  చదువు చెప్పడమే కాకుండా సొంతంగా పనులు చేసుకోవడం కూడా నేర్పిస్తారు. స్టూడెంట్స్​ని   ఇంటి నుంచి స్కూల్​కి బస్సులో తీసుకొచ్చి, స్కూల్​ అయిపోగానే ఇంటి దగ్గర దిగబెడతారు. ఇక్కడ చదువుకున్న స్టూడెంట్స్​లో ఐదుగురు ‘సెకండరీ స్కూల్​ లీవింగ్​ సర్టిఫికెట్​’ (ఎస్​ఎస్​ఎల్​సి) ఎగ్జామ్​ పాస్​ అయ్యారు. మామూలు సిలబస్​తో పాటు  డాన్స్, సింగింగ్​, యక్షగానం, యోగా వంటివి నేర్పిస్తారు.

అవసరమైన వాళ్లకి ఫిజియో థెరపీ, స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్​ థెరపీ కూడా చేయిస్తారు.  ఆటలు, పాటలు, కుట్లు, అల్లికలతో పాటు క్యాండిల్స్, సబ్బులు, రంగురంగుల కాగితా లతో డెకరేటివ్​ వస్తువులు తయారుచేయడం నేర్పిస్తారు. తయారుచేసిన వస్తువుల్ని అమ్మేందుకు కర్కాలా మునిసిపాలిటీ  ఒక షాపు​ ఏర్పాటు చేసింది. ఆ వస్తువుల్ని అమ్మితే వచ్చిన డబ్బుని స్కూల్లో ఫెసిలిటీస్​ కోసం ఉపయోగిస్తోంది కాంతా. ఇక్కడి పిల్లలు ఆటల్లోనూ రాణిస్తున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో మానసికంగా ఎదగని వాళ్లకు పెట్టిన  హాకీ, సైక్లింగ్​, వాలీబాల్​ పోటీల్లో పార్టిసిపేట్​ చేసి బహుమతులు కూడా గెలిచారు. 

డోనర్స్ సాయంతో...
మా స్కూల్లో  25 ఏండ్ల లోపు వాళ్లు 70 మంది. వాళ్లవరకు మాత్రమే  గవర్నమెంట్​ ప్రతి నెల రెండు లక్షల రూపాయల  గ్రాంట్స్​ ఇస్తోంది. మిగతా 16 మంది 25 ఏండ్లు దాటిన వాళ్లు. వీళ్లకు తిండి, మెడిసిన్స్​కి నెలకి లక్ష రూపాయలపైనే ఖర్చవుతుంది. ఆ మొత్తాన్ని నేనే భరిస్తున్నా.  వీళ్లతో పాటు 30 మంది అనాథ పిల్లల్ని కూడా చేరదీసి చదువు చెప్పిస్తున్నా. మా స్కూల్​ ఏడాదంతా నడుస్తుంది.  ఇంతమంది తిండి, బట్టలు చూడడం, మెడిసిన్స్​, ట్రాన్స్​పోర్టేషన్​ కోసం నెలకు మూడు లక్షల రూపాయలపైనే అవుతుంది. ఖర్చులకి డబ్బుల కోసం నా ఒంటి మీది బంగారం అమ్మేశాను. కొందరి దగ్గర అప్పు కూడా తెచ్చాను.  శ్రీ గురురాఘవేంద్ర ఎన్జీవో, కొంతమంది డోనర్స్​ ఆర్థిక సాయం చేస్తున్నారు. ఈ స్కూల్​ని నడపడంలో  నాకు ఫ్యామిలీ సపోర్ట్​ చాలా ఉంది. మా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటాం. మా అమ్మ వంట చేస్తుంది.  మా ఆయన డ్రైవర్. మాకు ఇద్దరు ఆడపిల్లలు. ఆరేండ్ల నుంచి కిరాయి బిల్డింగ్​లోనే స్కూల్​ నడుపుతున్నాం.  
- కాంతా హరిష్​, విజేత స్పెషల్​ స్కూల్​ ఫౌండర్.    ::: సంతోష్ బొందుగుల