ఊహించని నిర్ణయం : సెప్టెంబర్ 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు

ఊహించని నిర్ణయం : సెప్టెంబర్ 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక  సమావేశాలు

2023 సెప్టెంబరు 18 నుంచి -పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. మొత్తం ఐదు రోజులు జరగనున్న ఈ సమావేశాలు సెప్టెంబరు 22న ముగుస్తాయని చెప్పారు.  ఈ సమావేశాలు అద్భుతంగా జరగనున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి. ఈ ప్రత్యేక సమావేశాల్లో 10కి పైగా ముఖ్యమైన బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. 

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇటీవలే ముగిశాయి. జూలై 20వ తేదీన ప్రారంభం అయ్యి.. ఆగస్ట్ 11వ తేదీ వరకు జరిగాయి. మణిపూర్ అంశంపై పార్లమెంట్ దద్దరిల్లింది. అదే విధంగా విపక్షాల అవిశ్వాస తీర్మానంపై వాడి వేడి చర్చ జరిగింది. 23 రోజుల పార్లమెంట్ సమావేశాల్లో.. మొత్తం 23 బిల్లులను లోక్ సభ, రాజ్యసభ ఆమోదించాయి.

ఎవరూ ఊహించని విధంగా ఐదు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించటం రాజకీయంగా కలకలం రేపుతోంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఎందుకొచ్చింది.. ఏయే అంశాలపై చర్చించనున్నారు అనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.