ఛత్తీస్‌‌గఢ్‌‌లో ‘మొబైల్ వాలే డాక్టర్‌‌‌‌’

ఛత్తీస్‌‌గఢ్‌‌లో  ‘మొబైల్ వాలే డాక్టర్‌‌‌‌’

ఒక బిడ్డకు జన్మనివ్వడం అంటే తల్లి మరో జన్మ ఎత్తడమే. అలాంటిది, గ్రామీణ ప్రాంతాల్లో డెలివరీ టైంకి హాస్పిటల్స్‌‌కి చేరలేక చాలామంది మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానికి కారణం వాళ్ల ఊరికి సరైన రోడ్డు, అందుబాటులో హాస్పిటల్స్‌‌ లేకపోవడమే. ఆ ఇబ్బందుల్ని కొంత వరకు తగ్గించడానికి గర్భిణులకు మొబైల్‌‌ ఫోన్స్ ఫ్రీగా పంచుతున్నాడు డాక్టర్‌‌‌‌. గణేష్‌‌ బాబు.

ఛత్తీస్‌‌గఢ్‌‌లోని బర్‌‌‌‌సూర్‌‌‌‌ గవర్నమెంట్‌‌ హాస్పిటల్‌‌లో ప్రైమరీ హెల్త్‌‌ ఆఫీసర్‌‌‌‌గా పనిచేస్తున్నాడు గణేష్‌‌. బర్‌‌‌‌సూర్‌‌‌‌ చుట్టు పక్కలన్నీ గిరిజన గ్రామాలే. ఆ ఊళ్ల పక్కగా  ఇంద్రావతి నది ప్రవహిస్తుంటుంది. ఆ నది పిల్ల కాలువల మధ్య ఆ గ్రామాలు ఉంటాయి. దాంతో ఆ ఊళ్లకి సరైన రోడ్డు సౌకర్యం లేదు. వాగులపై వంతెనలుండవు. వర్షాకాలంలో ఎమర్జెన్సీగా హాస్పిటల్‌‌కి వెళ్లాల్సి వస్తే, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాగు దాటి, పక్క ఊళ్లోఉన్న హాస్పిటల్‌‌కి వెళ్తుంటారు జనాలు. గర్భిణీలు టైంకి హాస్పిటల్‌‌కి వెళ్లలేక ఇంట్లో లేదా రోడ్డు పక్కన డెలివరీ అవ్వక తప్పని పరిస్థితి. సరైన ట్రీట్మెంట్‌‌లేక అధిక రక్త స్రావం, ఉమ్మనీరు పోయి తల్లికి, కడుపులోని బిడ్డకు ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి వాళ్లకు సాయంగా ఉంటుందని ఫ్రీగా మొబైల్స్‌‌ ఇస్తున్నాడు డాక్టర్‌‌‌‌ గణేష్‌‌. అందుకే అతన్ని ‘మొబైల్ వాలే డాక్టర్‌‌‌‌’ అని పిలుస్తారు అక్కడివాళ్లు.

ఒక్క ఫోన్‌‌కాల్‌‌తో..

అక్కడ ఆడపిల్లలకు చిన్నతనంలోనే  ఎక్కువగా పెండ్లి చేస్తుంటారు. చిన్న వయసులోనే గర్భం దాల్చడంతో పిండం సరిగా ఎదగక తల్లీ, బిడ్డా ఇద్దరికీ సమస్యగానే ఉంటుంది. అలాంటి వాళ్లకు సరైన అవగాహన లేక, డెలివరీ కోసం నాటు వైద్యం చేస్తుంటారు. లేదంటే మంత్రసానుల దగ్గరికి వెళ్తుంటారు. ఇలాంటివాళ్లకు అవగాహన కల్పించి, హాస్పిటల్‌‌కి వచ్చేలా చేశాడు గణేష్‌‌. అయితే,  హాస్పిటల్ దూరంగా ఉందని, వెళ్లడానికి దారిలేదని హాస్పిటల్‌‌కి వెళ్లేవాళ్లు తగ్గిపోయారు. ఇకమీదట అలా ఎవరూ ఇబ్బంది పడొద్దని హాస్పిటల్‌‌కి వచ్చిన గర్భిణులకు మొబైల్స్‌‌ పంచడం మొదలుపెట్టాడు.ఆ మొబైల్స్‌‌లో ఎమర్జెన్సీ ఎస్సెమ్మెస్‌‌ బటన్‌‌ ఉంటుంది. ఒక్క నెంబర్‌‌‌‌ నొక్కితే చాలు హాస్పిటల్‌‌కి మెసేజ్‌‌ వెళ్తుంది.  ఆ మొబైల్‌‌లో డాక్టర్‌‌‌‌ నెంబర్‌‌‌‌ కూడా సేవ్‌‌ చేసి ఉంటుంది. డాక్టర్‌‌‌‌కి ఫోన్‌‌ చేసి కూడా మాట్లాడొచ్చు. పరిస్థితిని వివరించి సాయం పొందొచ్చు. సమాచారం తెలుసుకుని డాక్టర్‌‌‌‌ వాళ్ల దగ్గరకు వెళ్లడం, దగ్గర్లో ఉన్న అంగన్‌‌వాడీ మహిళలతో సాయం అందించడం లేదా హాస్పిటల్‌‌కి తీసు కొచ్చే ఏర్పాట్లు చేయడమో చేస్తున్నాడు గణేష్‌‌.