రియల్​ స్టార్ ​హైదరాబాద్

రియల్​ స్టార్ ​హైదరాబాద్

ఓ ఇల్లు ఉంటే చాలు. తిన్నా తినకున్నా అందులో ఉండొచ్చు అనుకుంటారు చాలామంది. అదంతా సరే కానీ, ఇంతకీ ఆ ఇల్లు ఎక్కడ ఉండాలి? అన్న ప్రశ్న ఎదురైనప్పుడు అందరినోటా ఒకే మాట వినిపిస్తోంది. అదే హైదరాబాద్. పనిచేయడానికి ప్రపంచస్థాయి కంపెనీలు, ఆఫీస్‌‌కు వెళ్లడానికి మెట్రో, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఫ్లై ఓవర్లు, ఎక్కడికైనా ట్రావెల్ చేసేందుకు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ..  సింపుల్‌‌గా చెప్పాలంటే వరల్డ్ క్లాస్ వసతులతో క్వాలిటీ లైఫ్. ఒక నగరానికి ఇంతకుమించి ఏం కావాలి! అందుకే తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల వాళ్లు కూడా హైదరాబాద్‌‌లో సొంతిల్లు ఉండాలని కోరుకుంటున్నారు. సిటీలో పెరుగుతున్న రియల్ ఎస్టేట్ ట్రెండ్‌‌ను చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ బెస్ట్‌‌గా ఉండడానికి కారణాలేంటి?

ఇండియన్ రియల్టీ రంగంలో హైదరాబాద్ హాట్‌‌స్పాట్‌‌గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల వాళ్లు, విదేశాల్లో ఉంటున్న ఎన్నారైలకు హైదరాబాద్ ఫైనల్ డెస్టినేషన్ పాయింటైంది. భాగ్యనగరానికి ఐటీ, ఐటీయేతర కంపెనీల పెట్టుబడులు రావడం, ట్రాన్స్‌‌పోర్టేషన్ ఫెసిలిటీస్ పెరగడం, జాబ్, బిజినెస్ పేరిట ఏటా లక్షలాది మంది సిటీకి వస్తుండడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం మంచి బూమ్‌‌లో ఉంది. హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ఎటు చూసినా 60 కిలోమీటర్ల దూరం వరకు ఇండ్లు, అపార్ట్‌‌మెంట్లు, విల్లాలు, ఫామ్ హౌస్‌‌ల అమ్మకాలు, కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. గతంలో ఔటర్ రింగ్ రోడ్డుకు ఇరువైపులా సాగిన రియల్ ఎస్టేట్ బిజినెస్.. ఇప్పుడు రీజనల్ రింగురోడ్డు వైపుగా దూసుకెళ్తోంది.  హైదరాబాద్ ఫ్యూచర్‌‌‌‌ను దృష్టిలో పెట్టుకుని చాలా మంది సిటీ చుట్టుపక్కల భూములు, స్థలాలపై పెట్టుబడులు పెడుతున్నారు. 

బెస్ట్ సిటీ ఇదే

దేశంలోని మిగతా మెట్రో సిటీస్‌‌తో పోలిస్తే హైదరాబాద్‌‌లో ఇండ్ల అమ్మకాలు, కొనుగోళ్లు ఎక్కువగా ఉంటున్నాయి.  రెసిడెన్షియల్ ఇండ్లు, అపార్ట్‌‌మెంట్ ఫ్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. కేవలం రియల్ ఎస్టేట్ మాత్రమే కాదు,  ఆఫీస్ స్పేస్, రిటైల్ స్పేస్‌‌కు కూడా సిటీలో మంచి డిమాండ్ ఉంది. ఇతర మెట్రో సిటీస్‌‌తో పోలిస్తే హైదరాబాద్ వాతావరణం బాగుండడం, ముంబై, చెన్నై వంటి నగరాల్లో మాదిరిగా వాటర్ ప్రాబ్లమ్ ఇక్కడ లేకపోవడం కూడా ఇతర రాష్ట్రాల ప్రజలను, ఎన్నారైలను అట్రాక్ట్ చేస్తోంది. 

దేశంలోనే రెండో స్థానం 

రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ లాంచింగ్స్‌‌లో ముంబై తర్వాత హైదరాబాద్‌‌ రెండో స్థానంలో ఉంది.  ఎప్పటిలాగే లాంచింగ్స్‌‌లో వెస్ట్ హైదరాబాద్‌‌ మొదటి వరుసలో నిలవగా.. నార్త్‌‌ హైదరాబాద్, ఈస్ట్, సౌత్ హైదరాబాద్‌‌ ప్రాంతాలు తర్వాతి స్థానాలను దక్కించుకున్నాయి. డిమాండ్‌‌కు  తగ్గట్టుగానే సరఫరా ఉంటుందన్న సూత్రం ప్రకారం.. డెవలపర్లు ప్రాజెక్ట్ లాంచింగ్‌‌లో లగ్జరీకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అమ్ముడవుతున్న ఇండ్లలో రూ.80 లక్షల నుంచి రూ.1.5 కోట్ల మధ్య ఉన్న హై ఎండ్‌‌ విల్లాలు, ఫ్లాట్‌‌లే 50 శాతం వాటాను దక్కించుకున్నాయి. ఆ తర్వాత రూ.40 లక్షల నుంచి రూ.80 లక్షల మధ్య ధరల ఇండ్లు అమ్ముడవుతున్నాయి. మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా రూ.40 లక్షల నుంచి రూ.80 లక్షల మధ్య ధర ఉన్న ఇండ్లను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. బ్యాంకులు ఇచ్చే హౌసింగ్‌‌ లోన్స్‌‌, డెవలపర్లు ఇచ్చే డిస్కౌంట్లతో  ఇళ్లు, ఫ్లాట్ల  అమ్మకాలు ఈ ఏడాదిలో చాలాశాతం పెరిగాయి. 

ఎన్నారైల చూపు హైదరాబాద్ వైపు.. 

అమెరికా, కెనడా, గల్ఫ్, యూరప్ దేశాల్లో నివసిస్తున్న నాన్- రెసిడెంట్ ఇండియన్స్(ఎన్నారైలు) పెట్టుబడులు పెట్టేందుకు  హైదరాబాద్‌‌ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఫస్ట్ ఆప్షన్‌‌గా మారింది. ‘కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ)’, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ‘అనరాక్’ కలిసి నిర్వహించిన సర్వేలో ఎన్నారైలు రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్‌‌నే ఎక్కువగా ఎంచుకున్నట్లు తేలింది. కిందటేడాది ఈ లిస్ట్‌‌లో బెంగళూరు ఫస్ట్ ప్లేస్‌‌లో ఉండగా.. ఈ ఏడాది అన్ని మెట్రో నగరాలను వెనక్కి నెట్టి హైదరాబాద్‌‌ టాప్ ప్లేస్‌‌లో నిలిచింది. ఈ సర్వేలో దాదాపు 500 మంది ఎన్నారైలు పార్టిసిపేట్ చేశారు. వీరిలో ఎక్కువమంది హైదరాబాద్‌‌, ఢిల్లీ, బెంగళూరులో పెట్టుబడులు పెట్టడంతో 60 శాతం పెట్టుబడులు ఈ మూడు నగరాల్లోనే నమోదయ్యాయి. వీటిలో 22 శాతం పెట్టుబడులతో హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్‌‌లో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ(20 శాతం), బెంగళూరు (18 శాతం) నిలవగా.. దేశ ఆర్థిక రాజధాని ముంబై నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. రియల్ ఎస్టేట్ మార్కెట్‌‌లో పెట్టుబడితో పోలిస్తే  స్టాక్స్‌‌, బంగారం, మ్యూచువల్ ఫండ్‌‌లతో మంచి రాబడి వచ్చే అవకాశమున్నప్పటికీ ఎన్నారైలు హైదరాబాద్ లాంటి మెట్రో సిటీల్లో ఇండ్లను కొనడానికి ఇష్టపడుతున్నారు.  దేశంలో ఎన్నారైల ఇండ్ల  కొనుగోళ్లు కరోనా కంటే ముందు కాలంతో  పోలిస్తే 55 శాతం మేర పెరిగినట్లు మార్కెట్‌‌ వర్గాలు తెలిపాయి. అమెరికన్‌‌ డాలర్‌‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణించడం కూడా ఎన్నారైల పెట్టుబడులు పెరగడానికి కారణమని ఎక్స్‌‌పర్ట్స్ చెప్తున్నారు. 

పాన్ ఇండియా కంపెనీల ఎంట్రీ.. 

రాష్ట్రంలో ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అంటే ధనవంతుల వ్యాపారంలా ఉండేది. కానీ, హైదరాబాద్ సిటీలో  ఉన్న రియల్ మార్కెట్ గ్రోత్‌‌ను చూసి పాన్ ఇండియా కంపెనీలు కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. వేల ఎకరాల ఖాళీ స్థలం ఉండడంతో ఈ రంగంలో విదేశీ కంపెనీలు సైతం ఇన్వెస్ట్ చేస్తున్నాయి. గత ఐదేండ్లుగా బెంగళూరు, ఢిల్లీ, ముంబైకి చెందిన సుమధుర, గోద్రెజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్, ప్రిస్టేజ్, ఎల్ అండ్ టీ, సాలార్ పురియా సత్వా, బ్రిగేడ్ లాంటి కంపెనీలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఎంట్రీ ఇవ్వడంతో ఇక్కడి మార్కెట్‌‌కు కార్పొరేట్ లుక్ వచ్చేసింది. ఇక హైదరాబాద్‌‌లో రిజిస్టర్ అయిన సుమారు 3 వేల మంది లోకల్ బిల్డర్లు కూడా ఇంటర్నేషనల్ లెవల్‌‌లో హైరైజ్ భవనాలను నిర్మిస్తుండటంతో... దేశంలోనే రియల్ ఎస్టేట్‌‌కు హైదరాబాద్ కేరాఫ్‌‌గా  మారింది. 

ధరలు పెరిగినా డిమాండ్ తగ్గట్లే.. 

తెలంగాణ  ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే హైదరాబాద్‌‌లో రియల్ ఎస్టేట్ పడిపోతుందని అప్పట్లో  ప్రచారం జరిగింది. కానీ, కొద్దిరోజుల్లోనే అది తలకిందులైంది. ధరలు తగ్గకపోగా మరింత పెరిగాయి. దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌‌లో భూముల ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఒక్క ఏడాదిలోనే రెసిడెన్షియల్ ఫ్లాట్ల ధర చదరపు అడుగుకు  రూ. 600 నుంచి రూ. 700 వరకు పెరిగింది.  ప్రస్తుతం ఫ్లాట్ బేసిక్ ధర చదరపు అడుగుకు రూ. 6000 నుంచి మొదలవుతోంది. కమర్షియల్ ఏరియాకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఈ ధర మరింత ఎక్కువగా ఉంది. పెట్టిన పెట్టుబడికి గిట్టుబాటయ్యే ధర వస్తుండడంతో  ఇన్వెస్టర్లు, డెవలపర్లు ఇక్కడ ఇన్వెస్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హైదరాబాద్‌‌  డెవలప్‌‌మెంట్ రోజురోజుకీ పెరుగుతుండడంతో ఇక్కడ సెటిల్ అవ్వాలనుకునే వాళ్ల సంఖ్య పెరుగుతోంది.

పెట్టుబడుల ప్రవాహం 

హైదరాబాద్‌‌లో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పలు మల్టీ నేషనల్‌‌ కంపెనీలు ‘క్యూ’ కట్టడం రియల్ ఎస్టేట్ రంగానికి ఊపునిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పేరు మోసిన గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి సంస్థలు హైదరాబాద్‌‌లో తమ ఆఫీసులు, డేటా సెంటర్లను ఏర్పాటు చేశాయి.  ఏటా 48 వేల ఫుల్‌‌టైమ్ ఉద్యోగాలు ఇవ్వగలిగే డేటా సెంటర్‌‌ను అమెజాన్‌‌ ఇటీవలే హైదరాబాద్‌‌లో ప్రారంభించింది. ఇదే సంస్థ రెండేండ్ల క్రితం..హైదరాబాద్‌‌ గచ్చిబౌలిలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆఫీసును ఓపెన్ చేసింది. తాజాగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌‌ఖాన్‌‌ పేట గ్రామంలో 48 ఎకరాల్లో రూ.5809 కోట్లతో, షాబాద్‌‌ మండలం చందన్‌‌వెల్లిలో 33 ఎకరాల్లో రూ. 5,821 కోట్లతో డేటా సెంటర్లను నిర్మించింది. ఇటీవల కాపిటలాండ్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా త్వరలో  సుమారు రూ.6,200 కోట్లతో ఒక డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది.  అలాగే తమ నాలుగో డేటా సెంటర్‌‌ను హైదరాబాద్‌‌లో ఏర్పాటు చేస్తామని మైక్రోసాఫ్ట్‌‌ ఇటీవల ప్రకటించింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత అధికారిక లెక్కల ప్రకారం గత ఎనిమిదేండ్లలో హైదరాబాద్ చుట్టూ ఫార్మా, లైఫ్‌‌ సైన్సెస్, మెడికల్‌‌ డివైజెస్, ఫుడ్‌‌ ప్రాసెసింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రిక్‌‌ వాహనాలు, టెక్స్‌‌టైల్స్‌‌ రంగాల్లో రూ.2,32,311 కోట్ల పెట్టుబడులు రాగా, 19,454 కంపెనీలు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా 16.48 లక్షల మందికి ఉద్యోగాలొచ్చాయి. ఇవన్నీ కలిసి  హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగ దశ, దిశను మార్చేస్తున్నాయి. 

ఈ ఇళ్లకే డిమాండ్..

సిటీలో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 62,159 ప్రాపర్టీ యూనిట్ల రిజిస్ట్రేషన్లు జరగగా, వీటి మొత్తం విలువ రూ.30,415 కోట్లుగా ఉంది. నైట్‌‌‌‌ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన డేటా ప్రకారం రెసిడెన్షియల్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు కిందటి నెలలో 32 శాతం పెరిగాయి. ఈ ఏడాది నవంబర్‌‌‌‌‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌లో రూ.2,892 కోట్ల విలువైన 6,119 రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఈ రిపోర్ట్ వెల్లడించింది. హైదరాబాద్ రియల్‌‌ఎస్టేట్‌‌ మార్కెట్‌‌ కింద హైదరాబాద్‌‌‌‌, మల్కాజ్‌‌‌‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలను తీసుకుని నైట్‌‌‌‌ ఫ్రాంక్ ఇండియా ఈ రీసెర్చ్ చేసింది.  ఇందులోనూ రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య విలువ ఉన్న  రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగాయని నైట్‌‌‌‌ఫ్రాంక్ వెల్లడించింది.  మొత్తం ఇండ్ల రిజిస్ట్రేషన్లలో వీటి వాటా 50 శాతంగా ఉందని తెలిపింది. ఫ్లాట్ సైజు పరంగా చూస్తే 500 నుంచి 1,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్లు ఏడాది కాలంగా ఎక్కువవుతున్నాయి. ఇండ్ల రిజిస్ట్రేషన్లు మేడ్చల్–మల్కాజ్‌‌‌‌గిరి జిల్లాలో ఎక్కువగా  జరుగుతున్నాయి. మొత్తం రిజిస్ట్రేషన్లలో 41 శాతం వాటా ఈ జిల్లాదే. 39 శాతం వాటాతో రంగారెడ్డి జిల్లా రెండో ప్లేస్‌‌‌‌లో ఉంది. 

లగ్జరీ విల్లాలపై మోజు

విల్లా అనేది విలాసవంతమైన నివాసం. ఒకప్పుడు సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్లు, వ్యాపారవేత్తలకే పరిమితమైన విల్లాలు ఇప్పుడు అప్పర్ మిడిల్ క్లాస్ జనాలకు కూడా చేరువయ్యాయి.  దానికి తగినట్లుగానే విల్లా రేంజ్ కూడా మారిపోయింది. రకరకాల బడ్జెట్‌‌లలో విల్లాలు దొరుకుతున్నాయి. గుంపులుగా ఉండే అపార్టుమెంట్ ఫ్లాట్లకు బదులు సిటీకి కాస్త దూరంగా ఉండే గండిపేట్, కిస్మత్ పూర్, తెల్లాపూర్, మోకిలా, కోకాపేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్​ వంటి ప్రాంతాల్లో విల్లాల ట్రెండ్ పెరుగుతోంది. కొన్నిచోట్ల అర ఎకరం విస్తీర్ణంలో నిర్మించిన విల్లాలు కూడా ఉన్నాయి.  కేవలం ముంబై, గుర్గావ్, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో కనిపించే ఆంబీషియస్ లగ్జరీ విల్లాలు ఇప్పుడు హైదరాబాద్‌‌లో కూడా కనిపిస్తున్నాయి. వీటి ధరలు రూ.10 కోట్ల నుంచి రూ. 30 కోట్ల వరకూ ఉన్నాయి. కాంక్రీట్ జంగిల్‌‌కు దూరంగా ప్రశాంతమైన, ఎకో ఫ్రెండ్లీ వాతావరణాన్ని అనుభవించాలనుకునే వాళ్లు విల్లాలు  కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ధనవంతుల్లో టాప్ 2

దేశంలో అత్యంత ధనికులు నివాసమంటున్న నగరాల్లో దేశ ఆర్థిక రాజధాని  ముంబై ఫస్ట్ ప్లేస్‌‌లో ఉండగా హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. ముంబైలో ధనవంతుల సంఖ్య 1,596 ఉండగా.. హైదరాబాద్ లో 467 మంది ఉన్నట్లు నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2021–2022 వెల్లడించింది.  నెట్‌‌వర్త్ రూ.227 కోట్ల కంటే ఎక్కువగా ఉండేవారిని  అత్యంత ధనికులుగా నైట్ ఫ్రాంక్ ఇండియా లిస్ట్ చేసింది. ఈ లెక్కన 2026 నాటికి హైదరాబాద్‌‌లో ధనవంతుల సంఖ్య728కి పెరుగుతుందని అంచనా వేసింది.  

ఆఫీస్ స్పేస్‌‌లోనూ..

గత కొంతకాలంగా ఐటీ, రిటైల్‌‌ సంస్థలు హైదరాబాద్‌‌లో ఆఫీస్‌‌లు లీజుకు తీసుకోవడం పెరిగింది. గ్లోబల్ సిటీగా శరవేగంగా డెవలప్ అవుతున్న భాగ్యనగరంలో కమర్షియల్ స్పేస్‌‌కు డిమాండ్ పెరిగింది. దీనికితోడు సిటీలో 150 ప్రాంతాలను కమర్షియల్ జోన్లుగా మార్చబోతున్నారు. అక్కడ షాపింగ్ మాల్స్, ఆఫీసులు, ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున ఏర్పాటవుతున్నాయి. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మియాపూర్, కొండాపూర్, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్‌‌తోపాటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో కో–లివింగ్ అండ్ కో–వర్కింగ్ స్పేస్ వంటివి ఎక్కువగా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య, హైదరాబాద్‌‌లో 8.2 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ వాడుకలోకి వచ్చింది. కరోనా తగ్గుముఖం పట్టాక హైదరాబాద్‌‌లో చాలా ఐటీ, ఇతర కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసు నుంచే పనిచేసేలా ఆదేశాలిస్తున్నాయి. హైదరాబాద్‌‌లోని ఆఫీస్ స్పేస్ మార్కెట్‌‌లో ఐటీ/ఐటీ రిలేటెడ్ కంపెనీలే(39 శాతం) ఎక్కువగా వాటా కలిగి ఉన్నట్లు అనరాక్ తాజా రిపోర్ట్ వెల్లడించింది. ఆ తర్వాత 22 శాతం ఆఫీస్ స్పేస్‌‌ను మాన్యుఫాక్చరింగ్ / ఇండస్ట్రీలే లీజుకు తీసుకున్నాయి.  కన్సల్టెన్సీ సంస్థలు, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సంస్థలు మరో 18 శాతం చొప్పున లీజుకు తీసుకున్నాయి. హైదరాబాద్‌‌లో మంత్లీ ఆఫీస్ రెంట్ చదరపు అడుగుకు సగటున రూ.61  ఉంటోంది.  బంజారాహిల్స్,  హైటెక్ సిటీ, బేగంపేట్, గచ్చిబౌలి, కోకాపేట్, ఉప్పల్‌‌లో  మంత్లీ రెంట్ చదరపు అడుగుకు  రూ.50 నుంచి రూ.75 వరకు పలుకుతోంది. 

సగం భూ లావాదేవీలు ఇక్కడే

ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు జరిపిన భూముల కొనుగోళ్లు, అమ్మకాల్లో 50 శాతం హైదరాబాద్‌‌లోనే జరగడం విశేషం. దేశవ్యాప్తంగా రెసిడెన్షియల్‌‌ ప్రాపర్టీ డెవలప్‌‌మెంట్‌‌ల కోసం గోద్రెజ్‌‌ ప్రాపర్టీస్‌‌, ఒబెరాయస్‌‌ రియల్టీ, మహీంద్రా లైఫ్‌‌ స్పేస్‌‌, గౌర్స్‌‌ గ్రూపు, మైక్రోసాప్ట్‌‌, మ్యాప్‌‌ట్రీ లాజిస్టిక్‌‌లు పలు ల్యాండ్స్‌‌ను కొనుగోలు చేశాయి. ఆయా సంస్థలు ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరు వరకు దేశవ్యాప్తంగా 8  నగరాల్లో 1,656 ఎకరాల కొనుగోళ్లకు వేర్వేరు అగ్రిమెంట్లు చేసుకున్నాయి.  ఇందులో రూ.1313 కోట్ల విలువైన 769 ఎకరాల కొనుగోళ్లు హైదరాబాద్‌‌ లోనే జరిగినట్లు అనరాక్‌‌ గ్రూప్‌‌ వెల్లడించింది. ఇందులో హెటిరో గ్రూపు 600 ఎకరాల భూమిని, మైక్రోసాప్ట్‌‌ తన డేటా సెంటర్‌‌ కోసం మరో 41 ఎకరాలను కొనుగోలు చేసింది. హైదరాబాద్‌‌ తర్వాత బెంగళూరులో 223 ఎకరాలు, ముంబై మెట్రో పాలిటన్‌‌ రీజియన్‌‌లో 199 ఎకరాల భూ లావాదేవీలు జరిగాయి. 

ఇటు అపార్ట్‌‌మెంట్లు.. అటు విల్లాలు..

ఔటర్ రింగ్ రోడ్డుకి లోపల ఇంటి స్థలాల ధరలు మండిపోతున్నాయి. మధ్యతరగతి ప్రజలు రింగ్ రోడ్డుకు దగ్గర్లో ఇంటి స్థలాలు కొని ఇళ్లు కట్టే పరిస్థితి లేదు. అందుకే వీళ్లంతా అపార్ట్‌‌మెంట్ల వైపు చూస్తున్నారు. సీబీఆర్ నివేదిక ప్రకారం హైదరాబాద్ సిటీలో 2019 నుంచి 2022 వరకు మూడేండ్లలో సుమారు 33 లక్షల ఫ్లాట్ల నిర్మాణం చేపట్టారు. హైదరాబాద్ వెస్ట్ మినహా మిగతా చోట్ల ఫ్లాట్ ధర చదరపు అడుగుకి రూ.3500 నుంచి రూ.4 వేలు ఉంది. గేటెడ్ కమ్యూనిటీల్లో ఈ ధరలు కాస్త ఎక్కువ ఉన్నాయి.  రూ.40 లక్షల నుంచి రూ.-50 లక్షల లోపు ధరలో డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి.
ఔటర్ రింగ్ రోడ్డుకు లోపల అపార్ట్‌‌మెంట్‌‌ల ట్రెండ్ నడుస్తుంటే రింగ్ రోడ్డుకి అవతల విల్లా ప్రాజెక్టులకు ఎక్కువ క్రేజ్ ఉంది. ఇప్పటికే సిటీలో ఫ్లాట్ ఉన్నవాళ్లు.. ఔటర్ బయట విల్లాలు కొంటున్నారు. ఔటర్ బయట గ్రోత్ కారిడార్ దాటిన తర్వాత చదరపు గజానికి 10 వేల నుంచి 20 వేల రూపాయల వరకు ధర ఉంది.  చాలామంది సిటీకి బయట విల్లాలు కొని వీకెండ్ హోమ్స్‌‌గా ఉపయోగించుకుంటున్నారు. సిటీ నుంచి ఈ ప్రాంతాలు 40 నుంచి 50 కి.మీ. దూరంలో ఉన్నప్పటికీ  గవర్నమెంట్​ ఆఫీసర్లు, వ్యాపారులు, ఐటీ ఉద్యోగులు, ఎన్నారైలు.. విల్లాలకే ఇంట్రెస్ట్ చూపుతున్నారు. 

రీజనల్ రింగ్ రోడ్డుతో మరింత బూమ్ 

ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల 30 కిలోమీటర్ల దూరంలో రీజనల్ రింగ్ రోడ్డు రాబోతుంది. దీంతో  హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మరో 50 కిలోమీటర్లకు విస్తరించబోతుంది. ఇప్పటికే చాలామంది ముందు చూపుతో అక్కడ భూములు కొంటున్నారు. ఫార్మాసిటీ, లైఫ్ సైన్సెస్, ఇంజినీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్లాస్టిక్, పాలీమర్స్, ఆటోమొబైల్, లాజిస్టిక్స్, ఎఫ్ఎంసీజీ, జెమ్స్ అండ్ జ్యువెలరీ రంగానికి సంబంధించిన పరిశ్రమలు ట్రిపుల్ ఆర్ చుట్టుపక్కలే ఏర్పాటు కాబోతున్నాయి. పరిశ్రమల రాకతో ఈ రోడ్డు వెంట రియల్ ఎస్టేట్ బిజినెస్‌‌కు మరింత బూమ్ రానుంది. ఇప్పటికే శంకర్ పల్లి, చేవెళ్ల, కందుకూరు ప్రాంతాల్లో ఫామ్ ల్యాండ్స్ చదరపు గజం రూ.7 వేల వరకు పలుకుతున్నాయి. ‘డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ)’ అనుమతి ఉన్న లేఔట్లలో గజం రూ.12 వేలపైనే ఉంది. బాలానగర్, జడ్చర్ల సమీపంలోని ఫామ్ ల్యాండ్స్‌‌లో గజం రూ.5,000 పలుకుతోంది. 

ఫ్యూచర్‌‌‌‌లో ఇలా..

  • రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌‌‌‌పోర్ట్ వరకు  ఎక్స్‌‌ప్రెస్ మెట్రో పనుల శంఖుస్థాపనతో ఇక మీదట హైదరాబాద్ సౌత్ జోన్‌‌లో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకోనుంది. మెట్రో విస్తరణతో ఎయిర్‌‌‌‌పోర్ట్ నుంచి చుట్టూ15 కిలోమీటర్ల విస్తీర్ణంలో రాజేంద్ర నగర్, శంషాబాద్, తుక్కుగూడ, ఆదిభట్ల ఏరియాల్లో నిర్మాణాలు పెరగనున్నాయి.
  • కండ్లకోయలో గేట్ వే ఆఫ్​ ఐటీ పార్క్ నిర్మాణం చేపట్టడంతో  హైదరాబాద్ నార్త్ వైపు కూడా ఇండ్ల స్థలాల ధరలు అమాంతం పెరిగిపోయాయి.  ఈ ఐటీ పార్క్ దగ్గర్లో గుండ్లపోచంపల్లి రైల్వే స్టేషన్ వరకు ఎంఎంటీఎస్  నెట్‌‌వర్క్ విస్తరణ కూడా జరుగుతోంది. ఈ స్టేషన్‌‌ను దాటుకుని మేడ్చల్ వరకు ఎంఎంటీఎస్ రైలు సేవలు ప్రారంభమైతే ఈ ఏరియాలో రెసిడెన్షియల్ ప్రాజెక్టులు ఎక్కువ సంఖ్యలో పెరిగే ఛాన్స్ ఉంది. మరో వైపు రీజనల్ రింగ్ రోడ్డు ప్రపోజల్స్‌‌తో ఇప్పటికే హైదరాబాద్ నార్త్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మెదక్ జిల్లా తూప్రాన్ వరకూ విస్తరించింది.
  • ఇప్పటికే ఇళ్ల అమ్మకాలు, లాంచింగ్స్‌‌లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న హైదరాబాద్ వెస్ట్ జోన్‌‌లోని కూకట్‌‌పల్లి, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కోకాపేట వంటి ఏరియాల్లో ఐటీ, కమర్షియల్ కాంప్లెక్స్‌‌ల విస్తరణతో ఇదే హవా మరికొన్నాళ్ల పాటు కొనసాగనుంది. 
  • అటు ఎల్‌‌బీ నగర్, ఇటు నాగోల్ వరకు మెట్రో లైన్, ఫ్లై ఓవర్ల విస్తరణతో హైదరాబాద్ ఈస్ట్ జోన్‌‌లోని ఉప్పల్, మల్కాజ్‌‌గిరి, ఎల్‌‌బీ నగర్‌‌లోని ఇండ్లకు డిమాండ్ పెరిగింది.
  •  సిటీ నుంచి వెళ్తున్న పలు జాతీయ రహదారులను కూడా విస్తరించనున్నారు. విజయవాడ, బెంగళూరు, శ్రీశైలం ఇలా పలు నేషనల్ హైవేలు ఎక్స్‌‌ప్యాండ్ అవ్వనున్నాయి. ఫ్యూచర్‌‌‌‌లో ఆయా ప్రాంతాల్లో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగే అవకాశముంది. ::: డా. నుగ్గునూతల యాకయ్య , నరేష్​​ వరికిల్ల, వెలుగు

అఫర్డబుల్ రేట్లలో

కరోనాకు ముందు పరిస్థితితో పోలిస్తే ఇప్పుడు హైదరాబాద్ సిటీ చుట్టూ రియల్ ఎస్టేట్ బిజినెస్ చాలా బాగుంది. భవిష్యత్‌‌లో రేట్లు పెరుగుతాయనే ఆలోచనతో ఎక్కువమంది హైదరాబాద్‌‌లో ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. గతంలో హైదరాబాద్​లో నార్త్ వైపు ప్రాపర్టీ షో పెట్టినప్పుడు రష్​ బాగా ఉండేది. ఆ తరువాత ఈస్ట్ సైడ్ ప్రాపర్టీ షోలో కూడా రష్ బాగా కనిపించింది. ఎంక్వైరీస్ చాలా పాజిటివ్‌‌గా వచ్చాయి. ఆ మధ్య జూన్‌‌లో కొంత వరకు నెగెటివిటీ ఉంది. వినాయక చవితి తర్వాత మార్కెట్ మళ్లీ పుంజుకుంది. గతంలో ప్రి–లాంచ్ లాంటి స్కీమ్‌‌ల వల్ల ప్రజలు కొంచెం కన్ఫ్యూజన్‌‌లో పడ్డారు. దీనిపై మేము అవేర్‌‌‌‌నెస్ ప్రోగ్రామ్స్ తీసుకురావడంతో కన్ఫ్యూజన్‌‌ తగ్గింది. హైదరాబాద్‌‌లో మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడం రియల్ ఎస్టేట్ మార్కెట్‌‌కు ప్రధానంగా కలిసొచ్చే అంశం. గతంతో పోలిస్తే అఫర్డబుల్ రేట్లలో ఇప్పుడు ప్రాపర్టీ దొరుకుతుంది. ఇది కూడా మరో ముఖ్య కారణం. – రాజశేఖర్ రెడ్డి, రియల్​ ఎస్టేట్ ఎక్స్‌‌పర్ట్

ఫ్యూచర్ కనిపిస్తోంది

హైదరాబాద్‌‌లో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగుంది. దీనికి  కారణాలు చాలానే ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా వాతావరణం అన్ని సీజన్లలో అనుకూలంగా ఉంటుంది. అలాగే నగరానికి దేశవ్యాప్తంగా కనెక్టివిటీ ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా సిటీలోని అన్ని ప్రాంతాల వాళ్లు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఈజీగా వెళ్లొచ్చు. ఉద్యోగావకాశాలు కూడా ఇక్కడ ఎక్కువ. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యేవాళ్లు కూడా చాలామందే. ఈ కారణాల వల్ల సిటీలో రియల్ ఎస్టేట్ మార్కెట్‌‌కు డిమాండ్ పెరిగింది. ఏ నగరంలో లేని విధంగా ఇక్కడ అన్ని రకాల వసతులు ఉన్నాయి. దానివల్ల పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 

సిటీలో మొన్నటివరకూ వెస్ట్ సైడ్ మాత్రమే రియల్ ఎస్టేట్ మార్కెట్ ఉండేది. ఇప్పుడు సిటీ అంతా డెవలప్‌‌మెంట్ కనిపిస్తుంది. దాంతో ఈస్ట్, వెస్ట్ అని తేడా లేకుండా అన్ని వైపులా స్థలాలకు డిమాండ్ పెరిగింది. ఉప్పల్, నాగోల్, కొంపల్లి, కిస్మత్​పూర్, రాజేంద్రనగర్, శ్రీశైలం రోడ్డు.. ఇలా సిటీకి అన్ని వైపులా రియల్ ఎస్టేట్ మార్కెట్​ ఊపందుకుంది. సిటీకి చుట్టుపక్కల ఫ్యాబ్ సిటీ, ఫార్మా సిటీ లాంటి కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. మెట్రో లైన్లు పడుతున్నాయి. దాంతో సిటీకి నాలుగువైపులా రియల్ ఎస్టేట్‌‌కు డిమాండ్ కనిపిస్తోంది. 

ఈ ఏడాది స్థలాలు, ఫ్లాట్ల కొనుగోళ్లు దాదాపు డబుల్ అయ్యాయి. ఈ ట్రెండ్ ఇక్కడితో ఆగదు. ఫ్యూచర్‌‌‌‌లో ఇంకా పెరిగే అవకాశముంది. ఇప్పుడు అనౌన్స్ చేసిన కొత్త ప్రాజెక్టులు, రోడ్లు, మెట్రోలు అందుబాటులోకి వచ్చాక ఇళ్ల కొనుగోళ్లు మరింత పెరిగే అవకాశముంది. రాబోయే ఏండ్లలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పెరుగుతుందే తప్ప తగ్గే అవకాశం ఏమాత్రం లేదు. – చెరుకు రామచంద్రా రెడ్డి,  చైర్మన్, క్రెడాయ్ తెలంగాణ