
అతిపిన్న వయసులోనే భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన రాజీవ్ గాంధీ దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. దేశ భవిష్యత్‌కు రాజీవ్ గాంధీ నాడు నాటిన మొక్కలు నేడు వృక్షాలై ఫలాలు అందిస్తున్నాయి. ఆయన దూరదృష్టితో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్థిక వ్యవస్థ సరళీకృతం, పరిశ్రమలకు రాయితీలు, పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టత వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. 21వ శతాబ్దిలో దేశాన్ని నూతన పథంలో నడిపించేలా దిశానిర్దేశం చేశారు.
ఆయన యువతరంలో శక్తిమంతమైన మార్పును ఆకాక్షించి కంప్యూటర్ యుగానికి నాంది పలకడంతో ఇప్పుడు దేశం పురోగతి దశలో పయనిస్తోంది. భారత్ భవిష్యత్ యువత చేతిలోనే ఉందని విశ్వసించిన రాజీవ్ గాంధీ యువతకు అన్ని రంగాల్లో పెద్దపీట వేశారు. జాతిపిత మహాత్మా గాంధీ మొదలుకొని దేశంకోసం త్యాగాలు, బలిదానాలు చేయడం కాంగ్రెస్‌కు కొత్తేమీ కాదు. ఉక్కు మహిళ ఇందిరాగాంధీ ముష్కరుల చేతిలో హత్యకు గురవడంతో దేశ ప్రజల ఆకాంక్ష మేరకు ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ 31 అక్టోబర్ 1984న భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
వృత్తిరీత్యా పైలట్ అయిన రాజీవ్ గాంధీకి తొలుత రాజకీయాలపై ఏమాత్రం ఆసక్తి లేదు. అయితే, 1980లో ఆయన తమ్ముడు సంజయ్ గాంధీ దురదృష్టవశాత్తు విమాన ప్రమాదంలో మరణించడంతో ఆయన తన తల్లి ఇందిరాగాంధీకి చేదోడుగా ఉండడం కోసం తప్పని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. ఇందిరాగాంధీ మరణం అనంతరం దేశంలో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితులతో దేశ ప్రయోజనాల కోసం రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రి పదవి చేపట్టారు.
1984 డిసెంబర్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాజీవ్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ రికార్డు స్థాయిలో 414 స్థానాలు గెలిచింది. ఇప్పటికీ ఏ పార్టీ, ఏ కూటమి కూడా అంత భారీ మెజార్టీని సాధించకపోవడంతో ఆ విజయం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.
సెల్‌ఫోన్ వ్యవస్థకు పునాది
రాజీవ్ రాజకీయ అరంగేట్రం తర్వాత ఆయనను ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా యువత రాజకీయాలపై ఆసక్తి పెంచుకుంది. ఆయన దేశాన్ని ఆధునీకరణ వైపు నడిపించడంతో టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ రంగాలు అభివృద్ధి చెందాయి. దేశం కంప్యూటరీకరణ వైపు అడుగులు వేయాల్సిన ఆవశ్యకతను గుర్తించి విద్యారంగాన్ని ప్రక్షాళన చేశారు. రాజీవ్ కృషితో కోట్లాది మంది సాఫ్ట్వేర్ రంగంలో దూసుకుపోవడంతో ప్రపంచవ్యాప్తంగా భారత యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయి.
దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లాలనే ప్రధాన లక్ష్యంతో పబ్లిక్ కాల్ ఆఫీస్ (పీసీఓ) విధానాన్ని ప్రవేశపెట్టడంతో సాధారణ ప్రజలకు కూడా కమ్యూనికేషన్ కనెక్టవిటీ పెరిగింది. రాజీవ్ ప్రభుత్వం అత్యాధునిక టెలికమ్యూనికేషన్ టెక్నాలజీని దేశీయంగా అభివృద్ధి చేయడానికి 1984లో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ స్థాపించింది. 1986లో మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ ప్రారంభించారు. ప్రపంచాన్ని అరచేతిలో చుట్టేసేలా ప్రస్తుతం మన జీవితంలో కీలకంగా మారిన సెల్ ఫోన్ వ్యవస్థకు పునాది రాజీవ్ గాంధీ హయాంలోనే పడింది.
మహాత్మాగాంధీ కలలు సాకారం
1985లో విద్యను సార్వత్రికీకరించడానికి ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీని రాజీవ్ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఓపెన్ యూనివర్సిటీల ప్రారంభానికి ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ స్ఫూర్తిగా నిలిచింది. బడుగు, బలహీన వర్గాలకు ప్రయోజనం కలిగేలా జాతీయ విద్యా విధానాన్ని విస్తరించాలనే లక్ష్యంతో 1986లో రాజీవ్ గాంధీ దేశంలో జవహర్ నవోదయ విద్యాలయాలను ప్రారంభించారు.
మహాత్మా గాంధీ కలలను సాకారం చేస్తూ రాజీవ్ గాంధీ గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకున్నారు. దేశంలో ప్రస్తుతం పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టంగా ఉండడడానికి ప్రధాన కారణం రాజీవ్ చేపట్టిన చర్యలే. రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1989 మే 15వ తేదీన చేసిన 64వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా పీవీ నరసింహారావు ప్రభుత్వం 1993లో చేసిన 73వ రాజ్యాంగ సవరణతో పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి లభించింది. మానవ వనరుల అభివృద్ధి కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండాలనే తలంపుతో రాజీవ్ గాంధీ 1985లో దీనికి ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసి ఆ బాధ్యతలను తెలంగాణ ముద్దుబిడ్డ పీపీ నరసింహారావుకు అప్పగించారు.
ఎన్నికల సంస్కరణలు
దేశ రాజకీయాల్లో ముఖ్యంగా 1967 తర్వాత పార్టీ ఫిరాయింపులు ఎక్కువవడంతో వాటి కట్టడికి రాజీవ్ నడుం కట్టారు. 1985లో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని 10వ షెడ్యూల్లో చేర్చడంతో పార్టీలు మారే ప్రజాప్రతినిధుల సభ్యత్వాన్ని రద్దు చేసే అవకాశం ఏర్పడింది. రాజీవ్ గాంధీ చేసిన చారిత్రాత్మక చట్టాల్లో 61వ రాజ్యాంగ సవరణ బిల్లు కీలకమైంది. దేశ నిర్మాణంలో యువతను భాగస్వాములుగా మార్చాలనే ఎంతో ఉన్నతమైన ఆశయంతో ఈ చట్ట సవరణ ద్వారా ఓటు వేసే కనీస వయసును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు.
దీంతో దేశ రాజకీయాల్లో యువతకు ప్రాధాన్యత పెరిగింది. 1991ఎన్నికల్లో ఆయన 40 శాతం సీట్లు యువతకు కేటాయించడం ఇందుకు నిదర్శనం. శాంతికి రాజీవ్ గాంధీ మారుపేరు. అణుబాంబుల ద్వారా కాకుండా.. శాంతి, స్వేచ్ఛ, సమానత్వం ద్వారా మానవాభివృద్ధిని సాధించవచ్చని యెమెన్‌లో జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఆయన ఇచ్చిన సందేశానికి ప్రపంచ దేశాధినేతల నుంచి ప్రశంసలు వచ్చాయి.
వాజ్‌పేయికి సహాయం
బీజేపీ సీనియర్ నేత, మాజీ ప్రధాని వాజ్‌పేయి కిడ్నీ సమస్యకు వైద్యం చేయించుకోవడానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే రాజీవ్ గాంధీ రాజకీయాలకు అతీతంగా సహాయం చేశారు. ఉన్నతమైన మానవతా దృక్పథం గల రాజీవ్ గాంధీ గురించి వాజ్‌పేయి
మాట్లాడుతూ రాజీవ్ కేవలం ప్రభావవంతమైన ప్రధాన మంత్రే కాదు. ఆయన రాజకీయాల్లో అరుదైన వ్యక్తి. మంచి మనిషి. సున్నితమైన వ్యక్తి అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.
శ్రీపెరంబదూర్‌లో రాజీవ్ హత్య
రాజీవ్ గాంధీ 1991లో ఎన్నికల ప్రచారంలో హడావుడిగా ఉన్న సమయంలో మే 21 రాత్రి కాళరాత్రిగా మారింది. విశాఖపట్నంలో పండుగ వాతావరణంలో సాగిన ఎన్నికల ప్రచారం విజయవంతంగా ముగిసిన తర్వాత రాజీవ్ గాంధీ ఎంతో సంతోషంతో తెలుగువారికి వీడ్కోలు పలుకుతూ తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. శ్రీపెరంబుదూర్‌లో ‘లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం’ ఆత్మాహుతి దళం బాంబర్ బెల్టు దాడిలో రాజీవ్ గాంధీ మరణించారు.
విశాఖపట్నంలో కాంగ్రెస్ నేతలు గంట ముందు రాజీవ్ గాంధీకి చెప్పిన వీడ్కోలు శాశ్వత వీడ్కోలు అవుతుందని ఎవరూ ఊహించలేదు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న నాకు ఈ దుర్ఘటన షాక్ నుండి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. రాజీవ్ గాంధీని ఉగ్రవాదులు హతమార్చిన మే 21వ తేదీని భారత దేశంలో ప్రతిఏటా ఉగ్రవాద వ్యతిరేక
దినోత్సవంగా పాటిస్తున్నారు.
రాజీవ్ హంతకులకు సోనియా క్షమాభిక్ష
సోనియా గాంధీ కుటుంబం వారసత్వంగా వచ్చిన మానవతా దృక్పథాన్ని మరోసారి చాటిచెప్పింది. రాజీవ్ గాంధీ హంతకులను క్షమిస్తూ వారికి విధించిన శిక్ష తగ్గించడానికి తోడ్పడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు నళినిని ప్రియాంకాగాంధీ స్వయంగా కలవడం గాంధీ కుటుంబానికి ఉన్న దాతృత్వానికి నిదర్శనం. మరణానంతరం ఆయనకు దేశంలో ప్రతిష్టాత్మకమైన భారత రత్న అవార్డు ప్రకటించారు. రాజీవ్ గాంధీ పేరున అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు రాజీవ్ ఖేల్ రత్న అవార్డు అందిస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సచివాలయం ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయనను గౌరవించుకుంది. రాష్ట్ర యువతకు స్వయం ఉపాధి కల్పన కోసం రాజీవ్ గాంధీ పేరిట రాజీవ్ యువ వికాసం పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. మంచితనానికి మారుపేరైన రాజీవ్ గాంధీ గర్వంగా చెప్పుకునే ‘మేరా భారత్ మహాన్’ను ఆదర్శంగా తీసుకొని యువత దేశ రాజకీయాల్లో చురుకుగా పాలుపంచుకొని ‘హమారా రాజీవ్ మహాన్’ అని చాటి చెప్పాలి.
- బి.మహేశ్ కుమార్ గౌడ్,
ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు